కేసీఆర్‌ గడీలను కూలగొడదాం

ABN , First Publish Date - 2022-08-13T10:03:35+05:30 IST

కేసీఆర్‌ గడీలను కూలగొట్టే సమయం ఆసన్నమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు.

కేసీఆర్‌ గడీలను కూలగొడదాం

  • ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం: బండి

యాదాద్రి/నార్కట్‌పల్లి, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): కేసీఆర్‌ గడీలను కూలగొట్టే సమయం ఆసన్నమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వ ఏర్పాటుకు అందరూ సహకరించాలని కోరారు. అన్ని వర్గాల ప్రజలను మోసగిస్తున్న కేసీఆర్‌ గిమ్మిక్కులను ఎండగట్టేందుకే తాను పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా శుక్రవారం యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం పల్లివాడ, ఎన్నారం గ్రామాల్లో, నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం అమ్మనబోలులో సంజయ్‌ మాట్లాడారు. మహిళలకు బీజేపీ పెద్దపీట వేస్తోందని, రాష్ట్రపతిగా గిరిజన మహిళను ఎంపిక చేయడమే దీనికి నిదర్శనమని అన్నారు. 


ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మహిళలంటే చిన్నచూపు అని, అందుకే తొలి దఫా క్యాబినెట్‌లో ఒక్క మహిళకూ స్థానం కల్పించలేదని ఆరోపించారు. ఎనిమిదేళ్ల పాలనలో డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేశారని, ఆ సంఘాలకు రూ.4 వేల కోట్లు వడ్డీ బకాయి పడ్డారని అన్నారు. కేసీఆర్‌ కుటుంబంలో సీఎం కుర్చీ కోసం కొట్లాట నడుస్తోందన్నారు. యాదాద్రిని కేసీఆర్‌ రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టుగా మార్చారని ధ్వజమెత్తారు. ఆయన పాపం పండే రోజులొచ్చాయన్నారు. అమ్మనబోలు మండలం కావాలంటే స్థానిక ఎమ్మెల్యే రాజీనామా చేయాలని, లేదంటే మంత్రికి ఇక్కడ భూములు, ఇళ్లు ఉండాలని ఎద్దేవా చేశారు. బీజేపీ అధికారంలోకి రాగానే అమ్మనబోలు మండలాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. 


ఉపాధి పథకంలో అవినీతి దారుణం

ఈ నెల 21 న మునుగోడు నియోజకవర్గంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నామని సంజయ్‌ ప్రకటించారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సభకు హాజరవుతారని తెలిపారు. మునుగోడు సభ వాయిదా పడిందంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బండి సంజయ్‌ దీనిపై స్పష్టత ఇచ్చారు. కాగా, పేద ప్రజల పొట్ట నింపేందుకు ఉద్దేశించిన ఉపాధి హామీ పథకంలో పెద్ద ఎత్తున అవినీతి జరగటం దారుణమని సంజయ్‌ ట్వీట్‌ చేశారు. ఉపాధి హామీ పథకం అమలవుతున్న తీరుపై కేంద్ర ప్రభుత్వ బృందాలు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయగా, అవకతవకలు బయటపడ్డాయని పేర్కొన్నారు.

Updated Date - 2022-08-13T10:03:35+05:30 IST