జల విద్యుదుత్పత్తి, రూల్‌కర్వ్‌ పై తేల్చేద్దాం!

ABN , First Publish Date - 2022-08-20T09:43:56+05:30 IST

శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాల్లో రూల్‌కర్వ్‌, జలవిద్యుదుత్పత్తి అంశాలపై తేల్చాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నిర్ణయించింది.

జల విద్యుదుత్పత్తి, రూల్‌కర్వ్‌ పై తేల్చేద్దాం!

ఈ అంశాలపై ఏకాభిప్రాయం సాధిద్దాం

తెలుగు రాష్ట్రాలకు సూచించిన కృష్ణా బోర్డు

23న ఆర్‌ఎంసీ తుది సమావేశం


హైదరాబాద్‌, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాల్లో రూల్‌కర్వ్‌, జలవిద్యుదుత్పత్తి అంశాలపై తేల్చాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నిర్ణయించింది. ఈ అంశాలపై చర్చించేందుకు ఈ నెల 23న బోర్డుకు చెందిన జలాశయాల నిర్వహణ కమిటీ (ఆర్‌ఎంసీ) సమావేశం ఏర్పాటు చేసింది. శ్రీశైలం, సాగర్‌ జలాశయాల్లో ఏ సమయంలో ఎంత మేరకు నీటి నిల్వలు ఉండాలనే అంశాన్ని తేల్చే రూల్‌కర్వ్‌తో పాటు జల విద్యుత్తును ఎప్పుడు ఉత్పత్తి చేయాలి? వంటి అంశాలపై ఆర్‌ఎంసీ భేటీలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఆయా అంశాలపై ఏకాభిప్రాయం సాధించిన తర్వాత.. ఆర్‌ఎంసీ సిఫారసులపై తెలుగు రాష్ట్రాల అధికారులతో సంతకాలు తీసుకోవాలని నిర్ణయించారు. దీంతో ఈ సమావేశానికి సభ్యులంతా విధిగా హాజరు కావాలని కృష్ణా బోర్డు విజ్ఞప్తి చేసింది. మరోవైపు ఆర్‌ఎంసీ ముసాయిదా ప్రతిపాదనలను తెలుగు రాష్ట్రాలకు పంపించింది. ఈ ముసాయిదాకు 23న ఉదయం జలసౌధలో జరిగే సమావేశంలో తుదిరూపు ఇవ్వనున్నారు. ఇక ఏ రికార్డులు/పత్రాలను ప్రామాణికం చేసుకొని రూల్‌కర్వ్‌ ముసాయిదా రూపొందించారు? దీనికి ప్రాతిపదిక ఏంటనే పత్రాలు సమర్పించాలని తెలంగాణ ఇప్పటికే పలుసార్లు లేఖల ద్వారా బోర్డును కోరిన విషయం తెలిసిందే. తదుపరి సమావేశం జరిగేలోపు పత్రాలు అందించాలని (పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ, ఎస్‌ఆర్‌బీసీ అనుమతి పత్రాలు) కోరినప్పటికీ దానిపై స్పందించకుండా, 23న జరిగే సమావేశానికి హాజరు కావాలని బోర్డు కోరడంపై తెలంగాణ ఆగ్రహంగా ఉంది. కాగా, శ్రీశైలం, సాగర్‌ నుంచి కృష్ణా జలాల కేటాయింపుపై ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సమర్పించిన ఇండెంట్లపై చర్చించి, నిర్ణయం తీసుకోవడానికి వీలుగా 23న మధ్యాహ్నం 3:30 గంటలకు కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం కానుంది. 

Updated Date - 2022-08-20T09:43:56+05:30 IST