తగ్గేదే లే!

ABN , First Publish Date - 2022-01-28T07:19:14+05:30 IST

గవర్నర్‌ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మధ్య విబేధాలు మరింత ముదురుతున్నట్టే ఉన్నాయి.

తగ్గేదే లే!

  • కేసీఆర్‌-గవర్నర్‌ మధ్య పెరిగిన దూరం
  • గణతంత్ర వేడుకల మరుసటి రోజే రణతంత్రం
  • ఎంపీ అర్వింద్‌కు గవర్నర్‌ తమిళిసై ఫోన్‌ 
  • ఇటీవలి దాడిపై ఆరా.. బీజేపీ వర్గాల వెల్లడి
  • దాడి సీపీ నాగరాజు పర్యవేక్షణలోనే జరిగిందన్న అర్వింద్‌
  • తన హత్యకు కుట్ర జరిగిందంటూ నడ్డాకు ఫిర్యాదు
  • ఒకట్రెండు రోజుల్లో  లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాను కలిసే చాన్స్‌

హైదరాబాద్‌/జగిత్యాల, జనవరి 27(ఆంధ్రజ్యోతి): గవర్నర్‌ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మధ్య విబేధాలు మరింత ముదురుతున్నట్టే ఉన్నాయి. గవర్నర్‌ ఆధ్వర్యంలో జరిగిన గణతంత్ర ఉత్సవాలకు  కేసీఆర్‌ వెళ్లకపోవడం, మంత్రుల్లో ఎవరూ హాజరుకాకపోవడం.. అటు గవర్నర్‌ కూడా తన ప్రసంగంలో తెలంగాణ రాష్ట్ర ప్రగతి లెక్కలపై ఏమీ మాట్లాడకపోవడంతో గవర్నర్‌-సీఎం మధ్య  పూడ్చలేని గ్యాప్‌ ఏర్పడినట్లుగా రాజకీయ నిపుణులు చర్చించుకుంటున్నారు. ఈ పరిణామానికి ఊపునిచ్చే విధంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు గురువారం గవర్నర్‌ తమిళిసై ఫోన్‌ చేసి మాట్లాడారు. ఇటీవల ఎంపీపై జరిగిన దాడి వివరాలు తెలుసుకున్నారు. పోలీసు కమిషనర్‌ నాగరాజు పర్యవేక్షణలోనే తన హత్యకు ప్లాన్‌ జరిగిందని గవర్నర్‌కు ఆయన తెలిపారు. టీఆర్‌ఎస్‌ నాయకులు, రౌడీమూకలు దాడి చేసే అవకాశం ఉందని ముందురోజే పోలీసు అధికారులకు చెప్పినా వారిని అదుపు చేయలేదని, తనకు కనీస భద్రత కల్పించలేదని ఫిర్యాదు చేశారు. తనతో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌పై పోలీసులు దాడులు చేయడం ఆందోళన కలిగిస్తోందని అర్వింద్‌ వివరించారని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఇక తనను చంపేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కుట్ర పన్నిందని అరవింద్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు  బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు తెలిపారు. 


తనపై టీఆర్‌ఎస్‌ పన్నిన కుట్రకు సంబంధించి నిజామాబాద్‌ పోలీసు కమిషనర్‌పై హత్యాయత్నం కేసు పెట్టామని చెప్పారు. నడ్డా, గురువారం రాత్రి ఫోన్‌ చేసి దాడి వివరాలు తెలుసుకున్నారని అరవింద్‌ ఒక ప్రకటనలో వెల్లడించారు. తనతో పాటు పార్టీ కార్యకర్తలపై జరిగిన దాడిని, ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, నిజామాబాద్‌ సీపీ గురించి వివరంగా నడ్డాకు తెలియజేసినట్లు చెప్పారు. ఈ కుట్రలో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల పాత్రపై విచారణ అవసరమని పేర్కొనగా, నడ్డా తక్షణం స్పందించి లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా అపాయింట్‌మెంట్‌ ఇప్పించారని అరవింద్‌ వివరించారు. ఒకటి, రెండు రోజుల్లో స్పీకర్‌కు తాను ఫిర్యాదు చేస్తానని చెప్పారు. మరోవైపు అరవింద్‌పై టీఆర్‌ఎస్‌ నాయకులు దాడి చేయడాన్ని నిరసిస్తూ కరీంనగర్‌ జిల్లాలో గురువారం బీజేపీ నాయకులు ధర్నాలు, నిరసనలు చేపట్టారు. కరీంనగర్‌లో ప్లకార్డులతో నిరసన తెలిపారు. హుజూరాబాద్‌ నిరసన తెలిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇల్లందకుంట మండలం మల్యాలలో సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. వీణవంకలో మౌనదీక్ష చేపట్టారు. శంకరపట్నం మండల కేంద్రంలో కరీంనగర్‌-వరంగల్‌ రహదారిపై రాస్తారోకో చేశారు. జగిత్యాల జిల్లా కథలాపూర్‌లో సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. జగిత్యాల, ధర్మపురి, సారంగపూర్‌, మెట్‌పల్లి, కోరుట్ల మండలంలోని పైడిమడుగు, పెగడపల్లి, మల్లాపూర్‌, కొడిమ్యాల, వెల్గటూరులలో బీజేపీ, బీజేవైయం నేతలు ధర్నాలు, నిరసనలు వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-01-28T07:19:14+05:30 IST