మోసపూరితంగా ఆ బిల్లుల ఆమోదం

ABN , First Publish Date - 2020-12-03T09:13:30+05:30 IST

పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లుల ఆమోదం వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం సభా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందని, శాసనమండలి వాటిని అనుమతించకుండానే ప్రభుత్వం మోసపూరితంగా

మోసపూరితంగా ఆ బిల్లుల ఆమోదం

పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దుపై హైకోర్టుకు న్యాయవాది రవిశంకర్‌ నివేదన


అమరావతి, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లుల ఆమోదం వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం సభా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందని, శాసనమండలి వాటిని అనుమతించకుండానే ప్రభుత్వం మోసపూరితంగా గవర్నర్‌ ద్వారా ఆమోదింపజేసుకుందని న్యాయవాది జంధ్యాల రవిశంకర్‌ హైకోర్టుకు నివేదించారు. ఆ రెండు బిల్లుల్ని విధానం ప్రకారం చట్టసభలో ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకునే ఉద్దేశమే ప్రభుత్వానికి లేదన్నారు. రాజధాని అంశాలకు సంబంధించిన పిటిషన్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, న్యాయమూర్తులు జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన త్రిసభ్య ధర్మాసనం రోజువారీ తుది విచారణ చేపడుతున్న విషయం తెలిసిందే.


దీనిలో భాగంగా బుధవారం జరిగిన విచారణ సందర్భంగా ఆయా చట్టాలను సవాల్‌చేస్తూ ఎమ్మెల్సీ పి.అశోక్‌బాబు దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా పిటిషనర్‌ తరఫున న్యాయవాది జంధ్యాల వాదనలు వినిపిస్తూ.. మండలి చైర్మన్‌ బిల్లుల్ని సెలక్ట్‌ కమిటీకి సిఫారసు చేశారని, తన విస్తృతాధికారం మేరకు సెలక్ట్‌ కమిటీని వేశారని తెలిపారు. కానీ, శాసనసభ కార్యదర్శి ఆ కమిటీ నియామకం విషయంలో గెజిట్‌ ప్రకటించకుండా రెండునెలల పాటు జాప్యం చేశారని తెలిపారు. మండలిలో బిల్లులు ప్రవేశపెట్టి 3నెలల గడువు ముగిసిందన్న సాకుతో అధికరణ 197 మేరకు శాసనసభలో రెండోమారు ప్రవేశపెట్టి ఆమోదింపచేయడం నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. కాగా, మండలి చైర్మన్‌ అధికారాలు, కార్యదర్శి బాధ్యతలేంటో తెలపాలని న్యాయవాదికి ధర్మాసనం సూచించింది. 


రాష్ట్రం పేరు మార్చే అధికారం లేదు

రాష్ట్రం పేరు మార్చే అధికారం ప్రభుత్వానికి లేదని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు తరఫు న్యాయవాది జీవీఆర్‌ చౌదరి హైకోర్టుకు వివరించారు. మంగళవారం నాటి వాదనల్ని కొనసాగిస్తూ.. పేరు మార్చే అధికారమే లేనప్పుడు, మూడు రాజధానుల ఏర్పాటు అధికారం మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడినుంచి వస్తుందని ప్రశ్నించారు. తదుపరి విచారణ గురువారానికి వాయిదా పడింది. 


మీడియా కథనాల ఆధారంగా పిల్‌ ఎలా?: హైకోర్టు 

గుమ్మనూరు పేకాట వ్యవహారంలో సరైన దర్యాప్తు చేయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించకుండా కోర్టుకు ఎందుకు వచ్చారని పిటిషనర్‌ను  హైకోర్టు ప్రశ్నించింది. ఏ ఆధారాలతో పిల్‌ దాఖలు చేశారని అడిగింది.  మీడియా కథనాల ఆధారంగా పిటిషన్‌ను దాఖలు చేశారా? అని నిలదీసింది. మంత్రి గుమ్మనూరు జయరాం స్వస్థలమైన కర్నూలు జిల్లా గుమ్మనూరులో పేకాట క్లబ్‌ వ్యవహారంపై పోలీసులు నమోదుచేసిన కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని అభ్యర్థిస్తూ బీజేపీ నేత, న్యాయవాది బి.పురుషోత్తంరెడ్డి దాఖలు చేసిన పిల్‌పై న్యాయమూర్తులు జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ కె.సురేశ్‌ రెడ్డితో కూడిన ధర్మాసనం ముందు విచారణ జరిగింది. పేకాట వ్యవహారంలో పోలీసులు సరిగా దర్యాప్తు చేయడం లేదని, కేసును సీబీఐ దర్యాప్తు చేయించాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది అభ్యర్థించారు. పూర్తివివరాలను కోర్టుముందు ఉంచేందుకు పిటిషనర్‌ సమ యం కోరడంతో తదుపరి విచారణను పది రోజులకు వాయిదా వేసింది.


సివిల్‌ జడ్జీల పదోన్నతి నిబంధనల్లో మార్పులు

సీనియర్‌ సివిల్‌ జడ్జీల నుంచి జిల్లా జడ్జ్‌ల పదోన్నతి నిబంధనల్లో మార్పులు చేస్తూ న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో పదోన్నతి పొందాలంటే మార్చి 31 నాటికి ఐదేళ్లు పూర్తి చేసి ఉండాలి. అయితే నోటిఫికేషన్‌ ఇచ్చేనాటికి 5ఏళ్లు సర్వీస్‌ పూర్తి చేసి ఉండాలని తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని హైకోర్టు రిజిస్ట్రార్‌  జనరల్‌కు రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి సునీత విజ్ణప్తి చేశారు. 

Updated Date - 2020-12-03T09:13:30+05:30 IST