వివక్ష న్యాయ వ్యవస్థలోనూ ఉంది

ABN , First Publish Date - 2021-11-10T05:30:00+05:30 IST

కాస్తస్వేచ్ఛ, మరికాస్త ప్రోత్సాహం ఉంటే మహిళలు ఆకాశమే హద్దుగా ఎదుగుతారనడానికి నిదర్శనం...

వివక్ష న్యాయ వ్యవస్థలోనూ ఉంది

కాస్తస్వేచ్ఛ, మరికాస్త ప్రోత్సాహం ఉంటే మహిళలు ఆకాశమే హద్దుగా ఎదుగుతారనడానికి నిదర్శనం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి  గురిజాల రాధారాణి. సాధారణ గృహిణి నుంచి ఉన్నత న్యాయస్థాన పీఠం వరకు సాగిన ఆమె ప్రయాణంలో ప్రతి అడుగూ ఒక స్ఫూర్తి పాఠం.తెనాలిలోని విమానం మేడలో మొదలై తెలంగాణ హైకోర్టు వరకు నడిచిన తన ప్రస్థానంలోని కొన్ని మేలి మలుపులు, పోరాట స్మృతుల గురించి స్టిస్‌ రాధారాణి వెల్లడించిన విశేషాలు నవ్యకు ప్రత్యేకం!


‘‘ఏ రంగంలోనైనా మహిళలు తమను తాము నిరూపించుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. వాళ్ల హక్కులను పొందడానికి అలుపెరగని పోరాటం చేయాల్సి ఉంటుంది. అందుకు నా జీవితమేమీ అతీతం కాదు. సాధారణ గృహిణిగా ఉన్న నేను ఇవాళ ఈ స్థానంలో ఉండటానికి నా కృషి, పట్టుదలతో పాటు నా భర్త సీఎల్‌ఎన్‌ గాంధీ ప్రోత్సాహం కూడా తోడ్పడింది. ఆడవాళ్లు బయటకెళ్లి ఏమి సాధించాలన్నా, ముందుగా కుటుంబం నుంచి సహకారం ఉండాలి. నేను డిగ్రీ మొదటి సంవత్సరంలో ఉండగా నాకు పెళ్లి అయింది. మాది కులాంతర వివాహం. అదీ మా అమ్మ, నాన్నల ప్రోద్బలంతో జరిగింది. నా భర్త చెరుకూరి లక్ష్మీనరసింహ గాంధీ మొదట మాకు ట్యూషన్‌ చెప్పేవారు. ఆ సమయంలో ఆయన వ్యక్తిత్వాన్ని మా వాళ్లు దగ్గరగా చూశారు. దాంతో ‘కులం కన్నా గుణం గొప్పది’ అనుకొని... అప్పుడే గ్రూప్‌-1 ఉద్యోగంలో చేరిన గాంధీకి నన్ను ఇవ్వాలని అమ్మ రాజేశ్వరి ప్రతిపాదించింది. అదీ పెళ్లి తర్వాత కూడా అమ్మాయిని చదివించాలనే షరతుతో! అలా 1980, మే 24న జస్టిస్‌ ఆవుల సాంబశివరావు సమక్షంలో గాంధీ, నేనూ ఒకరికొకరం దండలు మార్చుకోవడంతో ఒక్కటయ్యాం.


మధ్యలో చదువు ఆపేశా!

మా నాన్న గురిజాల సీతారామయ్య హేతువాది. తెనాలిలో విమానం మేడగా సుపరిచితమైన మా ఇంటిమీద ‘ఎంఎన్‌ రాయ్‌ భవనం’ అని ఉంటుంది. నాస్తికవాదులు, హేతువాదుల రాకపోకలు, సభలు, సమావేశాలతో నిత్యం మా ఇల్లు కళకళలాడుతుండేది. హేతువాద ఉద్యమానికి ప్రభావితమైన నేను మొదటి నుంచి సంప్రదాయాలు, ఆచారాలకు వ్యతిరేకం. పైగా అవి మహిళల హక్కులను హరిస్తాయని దృఢంగా నమ్ముతాను. డిగ్రీ చివరి సంవత్సరంలో ఉండగా గర్భవతినయ్యాను. అప్పుడు మెడలో తాళి, కాళ్లకు మెట్టెలు లేకుండా కాలేజీకి వెళుతున్న నన్ను చూసిన కొందరు ‘పెళ్లి కాకుండా తల్లి అవుతోందే?’ అన్నట్టు ప్రశ్నార్థకంగా చూసేవారు. అదే సమయంలో నాకు నెలలు నిండటంతో ఏప్రిల్‌కు బదులు సెప్టెంబరులో పరీక్షలు రాసి డిగ్రీ పూర్తి చేశాను! తర్వాత రెండేళ్లకు చిన్న పాప పుట్టడంతో మధ్యలో మూడేళ్లు చదువు ఆపేశా. కానీ చదవాలనే ఆశ వదులుకోలేదు!


జూనియర్‌ లాయర్‌గా....

గాంధీకి ఆర్డీవోగా ఏలూరు బదిలీ అవడంతో మేమంతా అక్కడికి వెళ్లాం. ఒక రోజు ఆయన సీఆర్‌ఆర్‌ కాలేజీ సాయంత్రం తరగతుల్లో ‘లా’ కోర్సు చేరదామని దరఖాస్తులు తెచ్చాడు. సైన్స్‌ విద్యార్థిని అయిన నాకు అప్పటి వరకు న్యాయశాస్త్రం గురించి ఏమీ తెలియదు. ఆయన ప్రోత్సాహంతో బీఎల్‌లో చేరాను. సాయంత్రాలు కాలేజీకి వెళ్లడం చాలా కష్టంగా ఉండేది. క్లాసులకు వెళ్లకుంటే సబ్జెక్టు అర్థం కాదు. తొలి ఏడాది పరీక్షల్లో ధైర్యం లేక ఒక సబ్జెక్టు మినహా మిగతావేవీ రాయలేదు. ఆ ఒక్కదాంట్లోనే మంచి మార్కులు రావడంతో నామీద నాకు నమ్మకం కలిగింది. సాయంత్రాలు ఆయన ఆఫీసు నుంచి రావడం ఆలస్యమైనా, పిల్లలకు ఆరోగ్యం బాగులేకున్నా కాలేజీకి వెళ్లలేకపోయేదాన్ని. అలా అవస్థలు పడుతూనే మూడేళ్ల ‘లా’ కోర్సు పూర్తిచేశాను. తర్వాత ఏలూరులో పేరున్న క్రిమినల్‌ లాయర్‌ దేవరకొండ శివకుమార్‌ శాస్త్రి వద్ద జూనియర్‌గా చేరి, కొంత నేర్చుకున్నాను. కానీ వాదనలు వినిపించేందుకు పెద్దగా అవకాశాలు వచ్చేవి కావు. కోర్టు అబ్జర్వేషనే ప్రధానంగా ఉండేది. సొంతంగా ప్రాక్టీసు చేద్దామంటే, కోర్టు వేళలకు ముందు, తర్వాత ఆడవాళ్లకు ఇంటి పనితోనే సరిపోతుంది. ఇక క్లయింట్లకు సమయం ఏదీ! ఎప్పుడైనా కేసు గెలిస్తే, ఆడవాళ్లు కనుక తీర్పు అనుకూలంగా వచ్చిందని ప్రతివాది లాయర్లు నొసలు చిట్లించేవాళ్లు. న్యాయవ్యవస్థలోనూ ఆడవాళ్లను చాలా తేలిగ్గా చూస్తుంటారు. భర్త చక్కగా ఉద్యోగం చేస్తుంటే, ఇంట్లో ఉండి పిల్లలను చూసుకోకుండా తాపత్రయమెందుకని మరికొందరు నిరుత్సాహపరుస్తారు. అలాంటి మాటలు విన్నా పట్టించుకోకుండా పట్టుదలతో ముందుకెళ్లడమే ఆడవాళ్ల కర్తవ్యం. 


వైఫల్యాల స్ఫూర్తితో....

లా అండ్‌ పొలిటికల్‌ సబ్జెక్టుతో ‘గ్రూప్‌-1’కు ఒకటికాదు రెండు కాదు మూడుసార్లు ప్రయత్నించాను. ప్రతిసారీ ప్రిలిమ్స్‌లో పాస్‌ అవుతున్నా, మెయిన్స్‌లో పోతోంది. అందుకు కారణం ‘తెలిసిన సబ్జెక్టు కదా’ అని ‘లా’ను స్పెషల్‌ సబ్జెక్ట్‌గా తీసుకోవడమే. అందులో స్టడీ మెటీరియల్‌ కూడా దొరికేది కాదు. అప్పటి వరకు కష్టపడి చదివిందంతా అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (ఏపీపీ) పరీక్షకు అక్కరకు వచ్చింది. ఏపీపీగా ఉద్యోగంలో చేరడమే నా జీవితానికి అతి పెద్ద మలుపు. రెగ్యులర్‌గా కోర్టుకు వెళ్లడం, కేసులు వాదించడం నా దినచర్యలో భాగమైంది. నాకంటూ ఒక గుర్తింపు లభించింది. వృత్తి జీవితంలో అది నాకొక గౌరవాన్ని తెచ్చిపెట్టింది. అంతకన్నా ఇంటి పని నుంచి నాకు విశ్రాంతి దొరికింది. ముఖ్యంగా ‘వంట పని నుంచి విముక్తి పొందడం స్త్రీల ఎదుగుదలకు తొలి అడుగు’ అని నా భావన.


చదువు ఆపలేదు...

ఒకవైపు ఏపీపీగా ప్రాక్టీసు చేస్తూనే ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌ఎం చేరాను. అదీ ఈవెనింగ్‌ కాలేజీనే. తర్వాత న్యూఢిల్లీలోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌ నుంచి డిస్టెన్స్‌ కోర్సు చేశాను. ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ రైట్స్‌ మీద మరొక పీజీ డిప్లొమా పూర్తి చేశాను. నా జీవితాన్ని నేను తీర్చిదిద్దుకోవడానికి చదువు ఒక్కటే మార్గం అని నా నమ్మకం. కనుక నా చదువును కొనసాగించాను. మధ్యలో మెజిస్ట్రేట్‌ ఉద్యోగంలో చేరినా, నాలుగు నెలలకే మానేసి జిల్లా జడ్జి పోటీ పరీక్షకు సన్నద్ధమయ్యాను. 2004లో పరీక్ష రాస్తే కొన్ని కారణాల వల్ల 2008లో పోస్టింగ్‌ ఇచ్చారు. ఆ మధ్యకాలంలో పీహెచ్‌డీ చేశాను 


పోలీసులకు ఇన్వెస్టిగేషన్‌ పద్దతులు తెలీవు...

నా పీహెచ్‌డీ టాపిక్‌... ‘‘రోల్‌ ఆఫ్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ఇన్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆఫ్‌ ఇన్విస్టిగేషన్‌ సిస్టం ఇన్‌ ఇండియా’’. ఇంటరాగేషన్‌ పేరుతో పోలీసులు పెట్టే హింసను ‘జై భీం’ సినిమాలో చూసుంటారు కదా.! అలా కాకుండా ఒక శాస్ర్తీయమైన పద్ధతిలో కేసును విచారించడం మన పోలీసులకు తెలియదు. ఇన్వెస్టిగేషన్‌ టెక్నిక్స్‌ను ఏమాత్రం వాడరు. ఫోరెన్సిక్‌ టైప్‌ ఆఫ్‌ ఎవిడెన్స్‌ ఐదు శాతం కేసుల్లో మాత్రమే దొరుకుతుంది. సరైన విచారణ పద్ధతులు తెలియక పోలీసులు నిందితులను టార్చర్‌ చేస్తుంటారు. విచారణను ఒక నైపుణ్యంగా అభివృద్ధి చేయాలి. మనదేశంలో ఫోరెన్సిక్‌ ల్యాబరేటరీలు సక్రమంగా లేవు. రిపోర్టులూ త్వరగా రావు. అందుకని మరిన్ని ల్యాబరేటరీలను నెలకొల్పాలి. విచారణ అనేది అనుమానితుల్ని అరెస్టు చేయడంతో కాదు, సాక్ష్యాధారాల సేకరణతో మొదలవాలి.


నా బాధ్యత మరింత పెరిగింది...

మా పెద్దమ్మాయి చేతన అమెరికాలో లా ప్రాక్టీసు చేస్తోంది. చిన్నమ్మాయి మానవి రేడియాలజీలో ఎండీ చేసింది. వారిద్దరివీ కులాంతర వివాహాలే.! మా అమ్మాయిలకు ఇంటి పేర్లుండవు. నా పేరులోని రాధా, నా భర్త పేరులోని గాంధీ కలిపి ‘రాధా గాంధీ’గా వారి పేర్లకు ముందు పెట్టాం. న్యాయమూర్తుల మీద విపరీతమైన పని ఒత్తిడి  ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబానికి సరైన సమయం కేటాయించడం కూడా కష్టం అవుతుంది. హైకోర్టు న్యాయమూర్తిగా నా బాధ్యత మరింత పెరిగింది. ఇదివరకటి కన్నా మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయం ఇది. 


అడుగడుగునా అవాంతరాలు...

లైంగిక వేధింపులకు మేమూ గురవుతూనే ఉన్నాం. ఒక ఎగ్జిబిషన్‌కు వెళ్లినప్పుడు, ఒంటరి ప్రయాణాల్లో ... ఇలా పలు సందర్భాల్లో ఈవ్‌టీజింగ్‌ను ఎదుర్కొన్నాను. నేను పీపీగా ప్రాక్టీసు చేస్తున్న సమయంలో... ఒక సందర్భంలో రైల్లో ఒంటరిగా ప్రయాణిస్తుండగా ఒక వ్యక్తి నాపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అప్పటికప్పుడు చుట్టుపక్కల వాళ్లను అప్రమత్తం చేసి, టీసీని పిలిపించి వాడిని రైలు దింపాను. ఇలా ఒకటా, రెండా మహిళలకు అనేక అవాంతరాలు ఎదురవుతాయి. అలా అని ఇంట్లోనే ఉంటే, కుటుంబంలోని హింస తక్కువేమీ కాదు. కనుక మహిళ బయటకు రావాల్సిందే. అవరోధాలు, అవమానాలు దాటి ముందుకెళ్లాల్సిందే. మన హక్కుల గురించి మనం తెలుసుకోవడంతోనే వివక్ష, అణచివేతలను ఎదుర్కోగలం.’’


అందులో చిన్నతనం ఏముంది?

హౌస్‌ వైఫ్స్‌ లాగే హౌస్‌ హజ్బెండ్స్‌ అనిపించుకోడానికి చాలామంది చిన్నతనంగా భావిస్తున్నారు. అందులో చిన్నతనమేంటో అర్థం కాదు. అత్తమామల బాధ్యత కోడలి మీద వదిలేయడం సబబుకాదు. తల్లిదండ్రుల బాగోగులు చూడాల్సింది వాళ్ల కన్నబిడ్డలే. ఆడవాళ్లు వెహికల్‌ డ్రైవింగ్‌ నేర్చుకోవడం ఎంత ముఖ్యమో, మగవాళ్లు వంట నేర్చుకోవడం అంతే ముఖ్యం. నేను ఏలూరులో ఉండగా... కాలేజీకి వెళ్లడానికి రవాణా సౌకర్యం లేకపోవడంతో మా నాన్న నాకొక మోపెడ్‌ కొనిచ్చి, ఆయనే దగ్గరుండి నడపడమూ నేర్పించారు. డ్రైవింగ్‌ నేర్చుకోవడం మహిళా స్వాతంత్ర్యానికి దారి వేస్తుంది.


సినిమాలంటే ఇష్టం...

నాకు సినిమాలంటే చాలా ఇష్టం. ఈ మధ్యకాలంలో నాకు నచ్చిన సినిమాలంటే  ‘జై భీం’ ‘ది గ్రేట్‌ ఇండియన్‌ కిచెన్‌’. వీటిలో ‘జై భీం’ సినిమా చాలా రియలిస్టిగ్‌గా తీశారు. హైకోర్టు ప్రొసీజర్స్‌ను చాలా బాగా చూపించారు. కొద్దిమంది మానవహక్కుల ఉద్యమకారుల పోరాటం వల్లే పోలీసు స్టేషన్లో లాక్‌పలను తీసేయడం, వీడియో కెమేరాలు పెట్టడం లాంటి కీలకమైన మార్పులు వచ్చాయి. ఇక, పుస్తకాలు కూడా బాగా చదువుతా. మాలతీ చందూర్‌ వ్యాసాల ద్వారా ప్రపంచ సాహిత్యంతో నాకు పరిచయం ఏర్పడింది. రంగనాయకమ్మ ‘జానకి విముక్తి’, ‘స్వీట్‌హోం’ , ఓల్గా ‘స్వేచ్ఛ’ నన్ను ప్రభావితం చేసిన నవలలు. చలం సాహిత్యానికి అభిమానిని. అయాన్‌ రాండ్‌ ‘ఫౌంటెన్‌ హెడ్‌’ ‘అట్లాస్‌ స్ట్రగ్డ్‌’, అయాన్‌ హిర్సీ ఆలీ ‘ఇన్‌ఫిడిల్‌’ పుస్తకాలు బాగా ఇష్టం.


అందరూ పితృస్వామ్య వ్యవస్థలో భాగమే...

న్యాయవ్యవస్థ, అందులోని న్యాయవాదులు, న్యాయమూర్తులు..వీరంతా పితృస్వామ్య వ్యవస్థలో భాగమే. కనుక ఆ వ్యవస్థ తాలూకూ ప్రభావాలు కొందరు న్యాయమూర్తులు వెల్లడించే తీర్పుల్లోనూ ప్రతిబింబిస్తుంటాయి. ఒక కేసును వ్యక్తిగత దృక్పథానికి అతీతంగా సాక్ష్యాలు, చట్టం, రాజ్యాంగం విలువలతో మాత్రమే సమీక్షించి నిష్పక్షపాతంగా చూడాలని నేషనల్‌ జ్యుడీషియల్‌ అకాడమీలో మాకు ప్రత్యేకంగా శిక్షణలోనూ బోధిస్తారు. అది నేర్చుకోవడమే జడ్జిలు చేయాల్సింది కూడా. 


ఈ మార్పు రాజకీయాల్లోనూ రావాలి!

న్యాయవ్యవస్థ మీద రాజకీయ ప్రభావం ఉండకూడదు. కానీ కొన్ని సందర్భాలు చూస్తుంటే ఆ ప్రభావం ఉందనిపిస్తుంది. కొందరు న్యాయమూర్తులు స్వతంత్య్రంగా వ్యవహరిస్తున్నారు. అతికొద్దిమంది ప్రభుత్వాలను కీర్తించే స్థాయిలో ఉన్నారు. ప్రభుత్వ చర్యలను ఒక కంట కనిపెడుతూ, అవసరమైనప్పుడు జోక్యం చేసుకోవడం న్యాయమూర్తులు చేయాల్సిన పని. న్యాయవ్యవస్థలో 33శాతం మహిళా రిజర్వేషన్‌తో చాలా ఉన్నత స్థానాల్లోకి మహిళలు వస్తున్నారు. ఇది శుభపరిణామం. అదే రాజకీయ వ్యవస్థలోనూ రావాలి. 

Updated Date - 2021-11-10T05:30:00+05:30 IST