ఇంకా వరద ముంపులోనే లంక గ్రామాలు

ABN , First Publish Date - 2020-09-29T16:10:02+05:30 IST

కృష్ణానది ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో గుంటూరు, కృష్ణా జిల్లాలోని లంక గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి.

ఇంకా వరద ముంపులోనే లంక గ్రామాలు

విజయవాడ: కృష్ణానది ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో గుంటూరు, కృష్ణా జిల్లాలోని లంక గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. గుంటూరు జిల్లా కొల్లిపొర, కొల్లూరు, భట్టిప్రోలు మండలాల్లోని లంక గ్రామాలు వరద ముంపులో ఉంటే.. తాడేపల్లి, రేపల్లె మండలాలు పాక్షికంగా ముంపుబారిన పడ్డాయి. రేపల్లె మండలం పెనుమూరు నుంచి 125 కుటుంబాలు దుగ్గిరాల మండలం పెద్దకొండూరు నుంచి మరో 30 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.


కొల్లూరు, భట్టిప్రొలు మండల పరిధిలోని లంక గ్రామాలకు రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. అధికారులు 50 బోట్లను సిద్ధం చేసి అత్యవసర సేవలకు ఉపయోగిస్తున్నారు. తాడేపల్లి, భట్టిప్రోలులో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు. కృష్ణా జిల్లాలోని ఫెర్రి ఘాట్ వద్ద వరద ప్రమాదస్థాయికి చేరుకుంది. దీంతో పరివాహక ముంపు ప్రాంతాల్లో నివాసితులను అధికారులు ఖాళీ చేయించారు.


జూపూడి, మూలపాడు, ఇబ్రహీంపట్నంలో వందలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. కొల్లూరు, భట్టిప్రోలు, కొల్లిపొర మండలాల్లో కోట్ల రూపాయల విలువైన వాణిజ్య పంటలు నీట మునిగాయి. అరటి, తమలపాకు, పసుపు, కంద పంటలు చేతికందివచ్చే తరుణంలో మునిగిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటుక బట్టీలు కూడా నీట మునిగాయి. రేపల్లె మండలం, పెనుమూడిదగ్గర కృష్ణ కరకట్టకు ఆనుకుని ఉన్న రొయ్యల చెరువుల కట్టలు తెగిపోవడంతో రొయ్యలన్నీ నదిలో కొట్టుకుపోయాయి. 

Updated Date - 2020-09-29T16:10:02+05:30 IST