నిబద్ధతతోనే భాషా పరిరక్షణ

ABN , First Publish Date - 2020-08-29T06:01:36+05:30 IST

యునెస్కో ప్రకటించిన అంతరించిపోబోతున్న భాషల్లో తెలుగు భాష ఉండటం బాధాకరమైన విషయం.

నిబద్ధతతోనే భాషా పరిరక్షణ

యునెస్కో ప్రకటించిన అంతరించిపోబోతున్న భాషల్లో తెలుగు భాష ఉండటం బాధాకరమైన విషయం. కొంతమంది భాషా విశ్లేషకులు చెప్పినట్లు తెలుగువారున్నంత కాలం తెలుగు కచ్చితంగా బతికే ఉంటుందనడంలో సందేహం లేకపోయినా, ఇప్పుడున్న పరిస్థితిని బట్టి భవిష్యత్‌లోనయినా మృతభాష అయ్యే అవకాశం లేకపోలేదు. ఉద్యోగ సంపాదనలో భాగంగా ఆంగ్ల మాధ్యమానికి ప్రాధాన్యం పెరిగినందున తెలుగువారు సైతం భాష విషయంలో ఆ మాధ్యమాన్నే ఎంచుకుంటున్నారు. కానీ మాతృభాషలో ప్రావీణ్యం పొందిన విద్యార్థికి, పరభాషలో విద్యనభ్యసించిన విద్యార్థికి మధ్య భావ వ్యక్తీకరణలో గాని, విషయాన్ని సమగ్రంగా విశ్లేషించడంలో గాని, సంబంధిత అంశంపై పరిపూర్ణత సాధించడంలో గాని చాలా వ్యత్యాసం ఉంటుంది. అందుకే మాతృభాషలో ప్రాథమిక విద్య అవసరం అని త్రిభాషా విధానాన్ని తీసుకొచ్చారు. కానీ దాన్ని అమలు చేస్తున్నది కొన్ని ప్రభుత్వాలు మాత్రమే.


ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వస్తే భాషా పరిరక్షణ విషయంలో సరైన విధానాలు ఎక్కడా అమలు చేయలేదు. రాజకీయ నాయకులు గాని, ప్రభుత్వాధికారులు గాని భాష కోసం చేసిందేమీ లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా తెలుగుభాషను పట్టించుకున్న దాఖలాలు లేవు. కేవలం భాషా దినోత్సవాలకే వారి ఉపన్యాసాలు పరిమితమవుతున్నాయి. నిబద్ధతతో కూడిన బాధ్యత కనిపించడం లేదు. భాషా ఉద్యమకారులు సైతం ఎన్ని ఉద్యమాలు చేసినా వాటి ఫలితం శూన్యమనే చెప్పాలి. దీనికి కారణం తగిన రీతిలో స్పందించేవాళ్ళు లేకపోవడమే. 


అలాగే సాహితీ సంస్థలు చేసే భాషా కృషి గురించి చెప్పాల్సిన అవసరమే లేదనిపిస్తుంది. ఎక్కడో పేరు మోసిన, దశాబ్దాల చరిత్ర ఉన్న సాహితీ సంస్థలు మినహాయిస్తే, మిగిలిన సంస్థలన్నీ కేవలం పేరుప్రఖ్యాతుల కోసమే ఆరాటపడుతూ మనుగడ సాగిస్తున్నాయి. సాహితీ సంస్థలపై నేను పిహెచ్‌.డి. చేసినపుడు ఈ విషయం తేటతెల్లమైంది. సాహితీ సంస్థల సభ్యులు, వేదికలెక్కి గంటలు గంటలు ఉపన్యాసాలిచ్చే సాహితీవేత్తలు కూడా తమ తమ పిల్లల ప్రాథమిక విద్యను కూడా ఆంగ్లంలోనే కొనసాగించడం, వారికి కనీసం తెలుగుభాష నేర్పే ప్రయత్నం చేయకపోవడం భాషా ద్రోహంగానే పరిగణించాలి. ఇక వ్యక్తిగతమైన బాధ్యత గురించి మాట్లాడుకుంటే, తమంతటతాము భాషా పరిరక్షణ కోసం పాటుపడాలనే ఆలోచన అత్యధికులలో లేకుండా పోయింది. భాషా పరిరక్షణ విషయంలో కేవలం ప్రభుత్వాలనే తప్పుబట్టాల్సిన అవసరం లేదు. వ్యక్తిగతంగా ఎవరికి వారు ఎంతవరకు మాతృభాష పరిరక్షణ కోసం కృషిచేస్తున్నారో ముందు ప్రశ్నించుకోవాలి. తమ వంతు బాధ్యతను గుర్తించి వ్యవహరించాలి. తమకున్న వనరులను ఉపయోగించుకుంటూ నిబద్ధతో కృషి చేయాలి. తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాలలో మాతృభాషకు ప్రాధాన్యం పెరుగుతోందంటే ఈ విధమైన ప్రయత్నం వల్లనేనని చెప్పాలి. వాళ్లు భాష కోసం చట్టాలు చేసుకుని అవి పూర్తిస్థాయిలో అమలయ్యేలా చర్యలు తీసుకుంటారు. 


అసలు భాష కోసం ఎవరెవరు ఏం చేయాలని ఆలోచించినపుడు, ముందుగా ప్రభుత్వాలు అందుకు కట్టుబడి ఉండాలి. భాషా దినోత్సవాల రోజున వాగ్దానాలకు మాత్రమే పరిమితం కాకుండా, వాటి అమలుకు చర్యలు తీసుకోవాలి. అవకాశం ఉన్నంత వరకు మాతృభాషను ఉపయోగించడాన్ని అన్ని శాఖలలోనూ తప్పనిసరి చేయాలి. మాతృభాష కోసం ఏర్పాటు చేసిన విభాగాన్ని పూర్తి స్థాయిలో తీర్చిదిద్ది, భాషాపరమైన నిర్ణయాల అమలుకు అవసరమైన చర్యలు తక్షణం తీసుకోవాలి. తెలుగు భాష పరిరక్షణకు విశ్వవిద్యాలయ స్థాయిలో కమిటీలు వేసి, వాటి పర్యవేక్షణలో భాషాప్రయోగాన్ని కాపాడుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రతీ విశ్వవిద్యాలయంలోని తెలుగు శాఖాధిపతులను ఈ కమిటీలకు అధ్యక్షులుగా, సంబంధిత విశ్వవిద్యాలయ ఉపకులపతిని గౌరవాధ్యక్షుడిగా నియమించి క్షేత్రస్థాయిలో మాతృభాష అమలయ్యేలా చర్యలు తీసుకోవాలి. అలాగే ఇతర దక్షిణాది రాష్ట్రాలలో వలే మాతృభాష పరిరక్షణ కోసం ప్రత్యేక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలి. ఈ విశ్వవిద్యాలయం రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలలో ఉన్న తెలుగు పరిరక్షణ కమిటీలన్నింటికీ నోడల్‌ ఏజన్సీగా పని చేయాలి. ప్రభుత్వాలు బాధ్యతగా వ్యవహరిస్తూ ఇలాంటి చర్యలు తీసుకుంటే మాతృభాష మనుగడకు ఏవిధమైన డోకా ఉండదు. వివిధ సంస్థలు భాషాపరిరక్షణకు నిబద్ధతగా వ్యవహరించాలి. ఏదో వాటి ఉనికిని నిలబెట్టుకునే ప్రయత్నంలా కాకుండా, తమ వంతు కృషిని చిత్తశుద్ధితో చేయాలి. తెలుగువారందరూ మాతృభాష కోసం కట్టుబడి ఉండాలి. మరీ ముఖ్యంగా యువత ఈ విషయంలో అత్యంత చురుకుగా వ్యవహరించాలి. ‘ప్రాణి సాధింపగల సకల పరమార్థములకు తల్లి భాష ప్రధాన సూత్రంబగుట భాష కంటే నవ్యులకు తపస్సు లేదు’ అని ఒక మహాకవి అన్నట్లు ఆధునిక సమాజంలో ప్రతి ఒక్కరి ఉనికికి భాషే కారణం. కాబట్టి మన వారసత్వ ఆస్తి అయిన తెలుగు భాష మనుగడ కోసం అహర్నిశలు కష్టపడాలి. మనభాష మృతభాష కాకుండా చూసుకోవడానికి బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.


డాక్టర్‌ శ్రీనివాసరావు పులపర్తి 

అతిధేయ అధ్యాపకులు, ఆంధ్ర విశ్వకళాపరిషత్

Updated Date - 2020-08-29T06:01:36+05:30 IST