Abn logo
Apr 6 2021 @ 03:34AM

రైతు చేజారుతున్న భూమి

  • భారీగా వ్యవసాయ భూముల విక్రయాలు.. 
  • బీళ్లుగా మారుతున్న భూములు.. 
  • ఐదేళ్లలో రెట్టింపైన అమ్మకాలు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): భూమి రైతు చేజారుతోంది. ఎప్పటినుంచో భూమిని నమ్ముకొని బతుకుతున్న రైతు క్రమంగా ఆ భూమి నుంచి దూరమవుతున్నాడు. ఒకవైపు కోటి ఎకరాలకు సాగునీరందించడానికి రాష్ట్రప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంటే, మరోవైపు రైతులు  తమ భూములను వ్యాపారులకు తెగనమ్ముకుంటున్నారు. వ్యవసాయ భూముల కోసం గ్రామాల్లో బడాబాబులు వాలిపోతున్నారు. ఇప్పటివరకు గ్రామాల్లో భూములు కొనుగోలు చేయడానికి హైదరాబాద్‌ నుంచి వచ్చేవారే అధికంగా ఉండేవారు. రెండేళ్లుగా వ్యవసాయ భూముల కోసం గుజరాత్‌, కర్ణాటక, మహారాష్ట్ర, న్యూఢిల్లీ తదితర ప్రాంతాల నుంచి వచ్చేవారి సంఖ్య పెరుగుతోంది. అందుకే హైదరాబాద్‌ నుంచి వంద కిలోమీటర్ల వరకు రోడ్డుకిరువైపులా వ్యవసాయ భూములు కాగడాపెట్టి వెతికినా కానరావు.


రైతుల నుంచి చేతులు మారిన బీడు భూములే కనిపిస్తాయి. మరోవైపు ఎనిమిదేళ్లుగా భూముల విలువలు సవరించకపోవడంతో రాష్ట్రంలో ఏ ప్రాంతంలో చూసినా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ విలువ దాదాపు రూ.15 లక్షల్లోపే ఉంటుంది. మెదక్‌ జిల్లా తూప్రాన్‌ వెళ్లేదారిలో రోడ్డుపక్కనే ఉన్న భూమి ఎకరం రూ.కోటి కంటే తక్కువకు ఽలభించదు. అదే మెయిన్‌ రోడ్‌ నుంచి లోపలికి వెళితే ఎకరం సుమారు రూ.25 లక్షలకు దొరుకుతుంది. అలాగే హైదరాబాద్‌ నుంచి జడ్చర్ల వెళ్లే దారిలో రోడ్డు పక్కన 100 గజాల భూమి కొనాలంటే రూ.10 లక్షల వరకు చెల్లించాల్సిందే. కానీ ఇక్కడ ఎకరం కొంటే రిజిస్ట్రేషన్‌ విలువ రూ.10 లక్ష్లలోపే ఉంటుంది. దీంతో రూ.కోటి వెచ్చించి ఎకరం కొన్నవారు కూడా రూ.5 లక్షల విలువకే స్టాంప్‌డ్యూటీ చెల్లిస్తున్నారు. ఇలా కొన్నవారు రేటు వచ్చినప్పుడు మళ్లీ ఆ భూములను అమ్ముకుంటున్నారు. ఇలా చేతులు మారుతూ వ్యవసాయం చేసేవారు లేకపోవడంతో వ్యవసాయ భూములు క్రమేణా బీళ్లుగా మారుతున్నాయి. 

 

రైతులు కొనేది 10 శాతంలోపే

గతంలో పంట దిగుబడి బాగా పెరిగితే... ఆ పంటలు అమ్ముకొని ఒక ఎకరం ఉన్న రైతు మరో ఎకరం అదనంగా కొనుగోలు చేసే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం ఎంత పంట పండించినా ఎకరం భూమిని అదనంగా కొనే పరిస్థితి రైతులకు లేకుండాపోయింది. వ్యవసాయ భూముల విక్రయాలు రెండింతలు పెరిగినా ఇందులో రైతుల వాటా 10 శాతం లోపే ఉంటుందని అంచనాలు చెబుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా వ్యవసాయ భూముల విక్రయాలపై నియంత్రణలు విధించకపోతే వ్యవసాయిక రాష్ట్రాల జాబితా నుంచి రాష్ట్రం కనుమరుగయ్యే ప్రమాదం లేకపోలేదు. ఏటా భూముల విలువలు సవరించాలని రిజిస్ట్రేషన్ల శాఖ 8 ఏళ్లుగా కోరుతున్నా ప్రభుత్వం దీనికి ఆమోదం తెలుపలేదు. మచ్చుకు పరిశీలిస్తే.. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎకరం భూమి రిజిస్ట్రేషన్‌ విలువ రూ.15 లక్షలు ఉంది. కానీ బహిరంగ మార్కెట్‌లో రూ.5 కోట్లు పెడితేనే ఎకరం దొరికే పరిస్థితి. అదే రిజిస్ట్రేషన్‌ విలువ ఎకరానికి రూ.లక్ష. భూముల విలువలు సవరించకపోవడంతో తక్కువ విలువను చూపించి డాక్యుమెంట్‌ చేసుకొనే అవకాశం ఉంది. దీంతో వ్యాపారులంతా వ్యవసాయ భూములు కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. 


రెండింతలు పెరిగిన విక్రయాలు

2014-15లో 2,11,635 వ్యవసాయ భూముల లావాదేవీలు నమోదయ్యాయి. ఐదేళ్ల తర్వాత 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 4,34,637 వ్యవసాయ భూముల విక్రయాలు జరిగాయి. అంటే రెట్టింపయ్యాయి. హరియాణ, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో వ్యవసాయ భూములను వ్యవసాయం చేసేవారే కొనుగోలు చేయాలనే నిబంధన ఉంది. కర్ణాటకలో కూడా ఉన్నప్పటికీ కరోనా సమయంలో ఈ నిబంధన తీసేశారు. వ్యవసాయ భూములను రైతుల చేతుల్లోనే ఉంచటం ద్వారా ఆహారభద్రతకు ముప్పు ఏర్పడకుండా ఉంటుందనే లక్ష్యంతో ఈ నిబంధన పెట్టగా... రాష్ట్రాల్లో దీన్ని క్రమంగా ఎత్తేస్తున్నారు.  


98 వేల మంది వద్ద 14.97 లక్షల ఎకరాలు

తెలంగాణలో 98562 మంది వద్ద 14,97,169 ఎకరాల భూములున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం 10 ఎకరాలపైన భూములు కలిగినవారు 98,652 మంది ఉండగా... వీరి వద్ద 14,97,169.55 ఎకరాల భూములు ఉన్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో 60,95,134 మంది పట్టాదారులు ఉండగా... వీరి వద్ద 1,50,12,603 ఎకరాల భూములున్నాయి. ఇక 60.95 లక్షల మంది పట్టాదారుల్లో 64.84 శాతం మంది వద్ద 47,43,420.34 ఎకరాల భూములే ఉన్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం...


Advertisement
Advertisement
Advertisement