Yadadri: యాదగిరిగుట్టలో సంప్రదాయ పూజలు

ABN , First Publish Date - 2022-07-21T01:58:15+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి (Lakshmi Narasimha Swamy)కి బుధవారం నిత్యవిధి కైంకర్యాలు సంప్రదాయరీతిలో కొనసాగాయి.

Yadadri: యాదగిరిగుట్టలో సంప్రదాయ పూజలు

యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి (Lakshmi Narasimha Swamy)కి బుధవారం నిత్యవిధి కైంకర్యాలు సంప్రదాయరీతిలో కొనసాగాయి. వేకువజామున సుప్రభాతంతో స్వామిని మేల్కొలిపిన అర్చకులు గర్భాలయంలో కొలువుదీరిన స్వయంభువులను, సువర్ణ ప్రతిష్ఠా అలంకారమూర్తులను పంచామృతాలతో అభిషేకించి తులసీ దళాలతో అర్చనలు జరిపారు. ప్రధానాలయ మొదటి ప్రాకార మండపంలో లక్ష్మీనృసింహుడిని గజవాహన సేవ అనంతరం నిత్యతిరుకల్యాణోత్సవం నిర్వహించారు. ముందుగా విశ్వక్సేనుడిని ఆరాధిస్తూ సుదర్శన నారసింహ హోమ పూజలు నిర్వహించారు. ప్రధానాలయ ముఖమండపంలో సువర్ణ పుష్పార్చనలు, అష్టోత్తరాలు, సాయంత్రం అలంకార వెండి జోడు సేవలు, సహస్రనామార్చన పూజలు కొనసాగాయి. కొండపైన శివాలయంలో రామలింగేశ్వరుడికి నిత్యారాధనలు, కొండకింద గండి చెరువు సమీపంలోని దీక్షాపరుల మండపంలో సత్యనారాయణస్వామి వ్రతపూజలు శైవాగమ పద్ధతిలో కొనసాగాయి. అదేవిధంగా అనుబంధ పాతగుట్ట ఆలయంలోనూ నిత్య పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. పాతగుట్ట దేవాలయంలో కొలువుదీరిన స్వయంభూమూర్తులకు నిజాభిషేకం, నిత్యార్చనలు, నిత్యతిరుకల్యా ణోత్సవాన్ని  ఆగమ శాస్త్రరీతిలో వైభవంగా నిర్వహించారు.  

Updated Date - 2022-07-21T01:58:15+05:30 IST