ఆడదానివి... నీవల్ల కాదన్నారు!

ABN , First Publish Date - 2021-10-28T03:59:46+05:30 IST

డపిల్లవి. పైగా ఇద్దరు పిల్లల తల్లివి. ఇది మగవారు మాత్రమే చేయగలిగే పని. నీవల్ల ఏమవుతుంద’న్నారు. చులకనగా మాట్లాడారు........

ఆడదానివి... నీవల్ల కాదన్నారు!

పుట్టీ పుట్టగానే బిడ్డ చనిపోయాడు. కొన్నాళ్లకు భర్త దూరమయ్యాడు. చంకలో చంటి బిడ్డలు...

పూట గడవని పరిస్థితులు... కట్టలు తెంచుకుంటున్న దుఃఖాన్ని దిగమింగి 

ఆమె ఒంటరిగా బతుకు పోరాటం మొదలుపెట్టింది. దుక్కి పట్టి... 

భూమి దున్ని సిరులు పండిస్తోంది. ‘ఆడదానివి నీవల్ల కాదన్న’వారికి లక్షల్లో సంపాదించి చూపిస్తోంది. ఎవరీ మహిళా రైతు? 


ఆడపిల్లవి. పైగా ఇద్దరు పిల్లల తల్లివి. ఇది మగవారు మాత్రమే చేయగలిగే పని. నీవల్ల ఏమవుతుంద’న్నారు. చులకనగా మాట్లాడారు. ఆ మాటలు నాకు సూదుల్లా గుచ్చుకున్నాయి. పట్టుదలను పెంచాయి. కసి రగిలించాయి.


సహనం... పట్టుదల... ఇవే 39 సంవత్సరాల సంగీతా పింగ్లే బలం. మహారాష్ట్ర నాసిక్‌లోని మటోరి గ్రామం ఆమె స్వస్థలం. సైన్స్‌ గ్రాడ్యుయేట్‌. అర్థం చేసుకొనే భర్త... ఆప్యాయంగా చూసుకొనే అత్తా మామ... దేనికీ లోటు లేకుండా సాగిపోతున్న సంగీత జీవితంలో పెద్ద కుదుపు. 


‘‘నా కష్టం పగవాడికి కూడా రాకూడదు. 2004లో... పుట్టుకతోనే వచ్చిన ఆరోగ్య సమస్యల వల్ల నా రెండో బిడ్డ చనిపోయాడు. అది జరిగిన మూడేళ్లకు రోడ్డు ప్రమాదంలో నా భర్త మరణించాడు. అప్పుడు నేను తొమ్మిది నెలల నిండు గర్భిణిని. నా గుండె పగిలిపోయింది. ఒకదాని తరువాత ఒకటి... కోలుకోలేని దెబ్బలు. మానసికంగా కుంగిపోయిన నాకు మా మామ, బంధువులు అండగా నిలిచారు. పదేళ్లు వారి సంరక్షణలో గడిచిపోయింది. నా ఇద్దరు పిల్లల్ని చూసుకొంటూ... కాలం చేసిన గాయాలను మరిచిపోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఓ ఎదురుదెబ్బ. కలహాలతో మా ఉమ్మడి కుటుంబం కాస్తా విడిపోయింది. దాంతో నా పిల్లల్ని తీసుకొని, అత్తా మామలతో కలిసి కొంతకాలం జీవించాను’’ అంటూ చెప్పుకొచ్చారు సంగీత.   


ఒంటరిగా... 

అంతటితో సంగీత కష్టాలు తీరిపోలేదు. రెండు నెలలు గడవకముందే మరో షాక్‌. అనారోగ్యంతో ఆమె మామ మరణించారు. ‘‘నాకు ఎవరైతే అండగా ఉంటూ వచ్చారో వాళ్లందరూ ఈ లోకం వదిలి వెళ్లిపోయారు. నేను ఒంటరినయ్యాను. జీవితం మీద ఆశ చచ్చిపోయింది. కానీ మరుక్షణం నా ఇద్దరు పిల్లలు గుర్తుకువచ్చారు. నా కోసం కాకపోయినా వారి కోసం, వారికి మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసమైనా జీవించాలనుకున్నాను’’ అంటూ సంగీత నాటి చేదు అనుభవాలను గుర్తు చేసుకున్నారు. 


అదే ఆధారం... 

అంతటి విషాదంలోనూ కాస్త ఊరటనిచ్చే విషయం ఏమిటంటే... మామగారి పేరున ఉన్న 13 ఎకరాల వ్యవసాయ భూమికి ఏకైక వారసురాలు సంగీతనే. ‘‘బతకడానికి నాకున్న ఒకే ఒక్క ఆధారం ఆ పొలం. అది మినహా వేరే ఆదాయ మార్గం లేదు. పంట ఎలా పండించాలనేది నేర్చుకొంటేనే నాకు గానీ, నా పిల్లలకు గానీ మనుగడ. కానీ అది అంత సులువు కాదని తెలుసు. అలాగని ప్రయత్నించకుండా వదిలేయకూడదు. ఆ విషయం మా బంధువులకు చెప్పాను. వాళ్లు నన్ను నిరుత్సాహపరిచారు. ‘ఆడపిల్లవి. పైగా ఇద్దరు పిల్లల తల్లివి. ఇది మగవారు మాత్రమే చేయగలిగే పని. నీవల్ల ఏమవుతుంద’న్నారు. చులకనగా మాట్లాడారు. ఆ మాటలు నాకు సూదుల్లా గుచ్చుకున్నాయి. పట్టుదలను పెంచాయి. కసి రగిలించాయి’’ అంటున్న ఆమె... మహిళ తలుచుకొంటే ఏదైనా సాధించగలదని నిరూపించాలనుకున్నారు. 


అప్పు చేసి... 

అయితే సంగీత దగ్గర సాగుకు సరిపడేంత డబ్బు లేదు. దీంతో నగలు తాకట్టు పెట్టి బ్యాంకులో రుణం తీసుకున్నారు. దాయాదుల నుంచి మరికొంత అప్పు తెచ్చారు. ద్రాక్ష, టమోటా పండించాలని నిర్ణయించారు. ‘‘పంటకు ఎరువులు ఏం వేయాలి... ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి వంటి ఎన్నో విషయాల్లో నా సోదరులు సూచనలు ఇచ్చారు. ఆరంభంలో వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి అవగాహన ఉండేది కాదు. అయితే సైన్స్‌ విద్యార్థిని కావడంతో త్వరగానే తెలుసుకోగలిగాను’’ అంటారామె. 


ట్రాక్టర్‌ నడిపి...  

ద్రాక్ష తోటలను పెంచడంలో సంగీత ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు. ‘‘తరచూ వాటర్‌ పంపు పాడైపోయేది. కూలీలతో ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. పురుగు పట్టకుండా కాపాడుకోవాలి. వ్యవసాయంలో ప్రత్యేకించి కొన్ని పనులు మగవారే చేస్తారు. ఉదాహరణకు... ట్రాక్టర్‌ నడపడం, మిషన్లు రిపేర్‌ చేయడం, పనిముట్లు ఉపయోగించడం వంటివి. కానీ ఇక్కడ పరిస్థితి భిన్నం. ఈ రంగంలో నిలబడాలంటే ఆ పనులు కూడా నేను చేయగలగాలి. అందుకే ట్రాక్టర్‌ నడపడమే కాదు, దాని మరమ్మతు చేయడం కూడా నేర్చుకున్నాను. అన్నిటినీ అధిగమించి పంట చేతికి వస్తుందనుకున్న తరుణంలో అకాల వర్షాలు అతలాకుతలం చేసేవి. పెట్టుబడి పోయి నష్టం మిగిలేది. దిగితేనే తెలిసింది... వ్యవసాయం ఎంత కష్టమో! అయితే అనుభవం ఎన్నో పాఠాలు నేర్పుతుంది’’ అంటున్న సంగీత ప్రస్తుతం ఏడాదికి 800 నుంచి 1000 టన్నుల ద్రాక్ష పండిస్తున్నారు. తద్వారా ఏటా రూ.30 లక్షల రూపాయల ఆదాయం పొందుతున్నారు. 


స్వయంకృషితో... 

ఎంత శ్రమపడినా వ్యవసాయంలో అప్పుడప్పడూ నష్టాలు సాధారణం. వాటిని ఆమె టమోటా పంట ద్వారా పూడ్చుకొంటున్నారు. ‘‘కృషి, పట్టుదల, అంకితభావం నా విజయ రహస్యం అంటున్న సంగీత కూతురు డిగ్రీ చదువుతోంది. కొడుకు స్కూల్‌కు వెళుతున్నాడు. నాడు నీవల్ల కాదన్నవారే నేడు అభినందనలతో ముంచెత్తుతున్నారు. ఎందరికో ఆదర్శమంటూ కొనియాడుతున్నారు. ఇది ఆమె నిర్మించుకున్న జీవితం. అసాధ్యమన్నదాన్ని సుసాధ్యం చేసి చూపిన ఓ మహిళా రైతు విజయం.



Updated Date - 2021-10-28T03:59:46+05:30 IST