వైద్యురాలిపై సామూహిక అత్యాచారం?

ABN , First Publish Date - 2022-03-23T15:47:05+05:30 IST

నగరంలో వేరే రాష్ట్రానికి చెందిన ఓ వైద్యురాలిపై నలుగురు అత్యాచారానికి ఒడిగట్టారని, అయితే ఈ విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందనే భయంతో ఆమె

వైద్యురాలిపై సామూహిక అత్యాచారం?

- ఫిర్యాదుకు నిరాకరించిన డాక్టర్‌

- పోలీసుల అదుపులో నిందితులు ?


వేలూరు(చెన్నై): నగరంలో వేరే రాష్ట్రానికి చెందిన ఓ వైద్యురాలిపై నలుగురు అత్యాచారానికి ఒడిగట్టారని, అయితే ఈ విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందనే భయంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు నిరాకరించినట్టుగా నగరంలో పలువురు చర్చించుకుంటున్నారు. ఈ వ్యవహారంపై ఏం చేద్దామనే అంశంపై పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు .. సత్తువాచారి ఇందిరానగర్‌లో పోలీసులు ఆదివారం సాధారణ గస్తీ చేపడుతుండగా, నలుగురు వ్యక్తులు తప్పతాగి ఘర్షణ పడుతుండడంతో వారిని అదుపులోకి తీసుకుని రాత్రంతా స్టేషన్‌లోనే వుంచి సోమవారం వారిని విచారించినట్టు భోగట్టా. ఆ సందర్భంగా వారు చెప్పింది విని దిగ్ర్భాంతి చెందడం పోలీసుల వంతయింది. నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పని చేస్తున్న ఇతర రాష్ట్రాలకు చెందిన వైద్యురాలు, వైద్యుడు ఈ నెల 19వ తేదీ రాత్రి కాట్పాడిలో వున్న ఓ థియేటర్‌లో సెకండ్‌షోకు వెళ్లారు. అనంతరం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో అటుగా వచ్చిన ఓ ఆటో ఎక్కి ఆస్పత్రికి వద్దకెళ్లాలని చెప్పారు. కానీ అప్పటికే అందులో ముగ్గురు వ్యక్తులున్నారు. ఆటో వేలూరులోని గ్రీన్‌ సర్కిల్‌ వద్దకు రాగానే ఆ ముగ్గురు వైద్యుడిపై దాడి చేసి కిందకు తోసేయడమే కాకుండా ఆ వైద్యురాలిని పాలారు తీరానికి తీసుకెళ్లి ఆటోడ్రైవర్‌ సహా నలుగురూ అత్యాచారానికి పాల్పడినట్టు తెలిసింది. ఆమెను సత్తువాచారి మెయిన్‌రోడ్డులో వదిలి, ఆమె ఏటీఎం కార్డు తీసుకుని అందులోనుంచి రూ.40 వేలు డ్రా చేసినట్టుగా పోలీసులకు చెప్పినట్టు సమాచారం. ఆ డబ్బు పంచుకునే విషయంలో ఘర్షణ పడుతుండగా పోలీసుల చేతికి చిక్కారు. వారు చెప్పిన ఆధారాల మేరకు  పోలీసులు మంగళవారం ఆ వైద్యురాలిని ప్రశ్నించగా, ఆమె ఫిర్యాదు చేసేందుకు నిరాకరించినట్టుగా సమాచారం. ఈ విషయం తెలిస్తే తన పరువు పోతుందని, తన తల్లిదండ్రులు బ్రతకరంటూ కన్నీటిపర్యంతమవడంతో వెనుదిరిగిన పోలీసులు.. ఈ వ్యవహారంపై ఏం చేయాలనే విషయంపై మల్లగుల్లాలు పడుతున్నట్టుగా తెలుస్తోంది.

Updated Date - 2022-03-23T15:47:05+05:30 IST