అక్కడ వారిదే పెత్తనం!

ABN , First Publish Date - 2022-03-21T05:30:00+05:30 IST

ముప్ఫై నాలుగేళ్ళ వృత్తి జీవితంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదురైనా... అన్నిటినీ తట్టుకొని ధైర్యంగా నిలబడ్డారు...

అక్కడ వారిదే పెత్తనం!

ముప్ఫై నాలుగేళ్ళ వృత్తి జీవితంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదురైనా... అన్నిటినీ తట్టుకొని ధైర్యంగా నిలబడ్డారు. ఆచార్య ధూళిపూడి శాంతిశ్రీ పండిట్‌.దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన జెఎన్‌యు విద్యార్థిని అయిన ఆమె...ఇప్పుడు అదే విశ్వవిద్యాలయానికి తొలి మహిళా వైస్‌ ఛాన్సలర్‌గా బాధ్యతలు అందుకున్నారు. తెలుగు మూలాలున్న ఆచార్య శాంతిశ్రీ ‘నవ్య’తో పంచుకున్న విశేషాలివి....


‘‘నేను చదివిన ఢిల్లీ జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయానికి విశ్వవిద్యాలయానికి ఉపాధ్యక్షురాలిని అవుతానని నేనెన్నడూ ఊహించలేదు. బహుశా ఇదొక రుణానుబంధం అనుకుంటా. అందులోనూ దేశంలోనే అతి పెద్ద యూనివర్సిటీకి తొలి మహిళా వీసీ అయినందుకు గర్విస్తున్నాను. రాజకీయ భావజాలాలకు అతీతంగా విద్యార్థులందరితోనూ దఫదఫాలుగా కలుస్తున్నాను. నాకు వాదాలకన్నా, విద్యార్థుల శ్రేయస్సే ముఖ్యం. రాజకీయ భావజాలాలకు నేను చాలా దూరం. వాటికి అస్సలు విలువ ఇవ్వను. నేను పూర్తిగా విద్యార్థి కేంద్రకంగా పనిచేసే ఆచార్యురాలిని మాత్రమే.! ఇప్పటికే యూనివర్సిటీ లైబ్రరీని ఆకస్మికంగా సందర్శించాను. హాస్టళ్లలో విద్యార్థులతో కలిసి భోజనం చేశాను. విద్యార్థులు, ఇతర సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకొని, వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాను. ముఖ్యంగా ప్రొఫెసర్లకు పదోన్నతులు, ఉద్యోగ ఖాళీల భర్తీ తదితర అంశాలను పూర్తి చేయాల్సి ఉంది. దాంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనమీద దృష్టి పెడుతున్నాం. కరోనా అనంతర పరిణామాలకు అనువుగా కొన్ని మార్పులు చేర్పులు చేయనున్నాం. అంతిమంగా 21వ శతాబ్దానికి తగినట్టుగా డిజిటలైజేషన్‌ తదితర కార్యాచరణతో యూనివర్సిటీని మరింత ఉన్నతీకరించాలనేదే మా లక్ష్యం. జేఎన్‌యూ పూర్వ విద్యార్థిగా ఇక్కడి బలాలు, బలహీనతలు నాకు బాగా తెలుసు. కనుక ఆ క్రమంలో ఎదురయ్యే సవాళ్లను కూడా సులువుగా అధిగమించగలను. 


చదువే ముందు...

మా యూనివర్సిటీలో అతివాద భావజాలం కలిగినవాళ్లు ఇరవై శాతానికి మించి ఉండరు. మిగతా ఎనభై శాతం మంది రాజకీయాలకు అతీతంగా మెలిగేవాళ్లే! పైగా వారంతా ఎక్కువగా బీద కుటుంబాలకు చెందినవారు. బాగా చదివి, జీవితంలో స్థిరపడాలనేది వాళ్ల జీవిత లక్ష్యం. కనుక రాజకీయాలకు దూరంగా ఉంటారు. యూనివర్సిటీకి నెగెటివ్‌ ఇమేజీ ఉంటే విద్యార్థులకూ నష్టమే కదా! అందుకే ‘రాజకీయాలు తర్వాత, ముందు చదవండి’ అని చెబుతాను. అప్పట్లో మాకు చదివేందుకే సమయం సరిపోయేది కాదు, ఇక రాజకీయాలు చేసేదెక్కడ! నేనైతే, రోజుకు ఎనిమిది గంటలు లైబ్రరీలోనే ఉండేదాన్ని. అప్పటి ప్రొఫెసర్లు కూడా మమ్మల్ని కరెక్టుగా గైడ్‌ చేసేవారు. విద్యార్థులను అకడమిక్స్‌లో నిమగ్నం చేయాలి. అప్పుడే అనవసరమైన రాద్ధాంతాలు చాలా వరకు తగ్గుతాయి. విద్యార్థులకు మంచి చేయడం ద్వారా అలాంటి అంతరాలనూ అధిగమించవచ్చని నమ్ముతాను. 


అప్పట్లోనే గుర్తింపు...

నేను జేఎన్‌యూలో పీహెచ్‌డీ విద్యార్థిగా ఉన్నప్పుడు జీలం హాస్టల్‌ అధ్యక్ష ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి, ఎస్‌ఎ్‌ఫఐ వాళ్లను ఓడించాను. దక్షిణాదికి చెందిన వ్యక్తిగా నా గెలుపు అప్పుడు ఒక పెద్ద సంచలనం. అలా విద్యార్థి దశలోనే యూనివర్సిటీలో నాకు ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. జేఎన్‌యూలో చాలా వరకు పెత్తనమంతా వామపక్ష ఉదారవాదులదే! అందులోనూ ఉత్తర భారతీయులదే హవా! ఒకవిధంగా వాళ్లు దీన్ని తమ రాజప్రాసాదంగా మలుచుకున్నారు. వామపక్ష ఉదారవాదులు చాలా మంది ఇక్కడే చదివి, ఇక్కడే ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. వారంతా కలిసి ఒక కోటరీగా రాజకీయాలను నడుపుతుంటారు. వాళ్ల విధానాలను ప్రశ్నించిన వ్యక్తుల మీద రకరకాలుగా బురద చల్లుతుంటారు. అంతెందుకు... వీసీగా నా పేరు ప్రతిపాదనకు రాగానే, నామీదా దుష్ప్రచారం మొదలుపెట్టారు. ఒక మహిళ, అందులోనూ దక్షిణాదికి చెందిన... వెనుకబడిన సామాజిక వర్గం నుంచి వచ్చిన వ్యక్తి అంత పెద్ద హోదాలో ఉండడాన్ని వారంతా జీర్ణించుకోలేకపోయారు. 


అమ్మ గొప్పతనం అప్పుడు తెలిసింది...

మా అమ్మ ఆదిలక్ష్మి నేను పుట్టిన పదహారు రోజులకు అనారోగ్యంతో రష్యాలో కన్నుమూశారు. మా నాన్న వాళ్లది ఉమ్మడి కుటుంబం కావడంతో నాకెన్నడూ అమ్మలేని లోటు తెలియలేదు. పీటర్స్‌బర్గ్‌లోని లెనిన్‌గ్రాడ్‌ యూనివర్సిటీలో తెలుగు, తమిళ శాఖలను మా అమ్మ ప్రారంభించారని తెలుసు. ఆమెకు ఎనిమిది భాషలు వచ్చని కూడా విన్నాను. రాజ్యసభ సభ్యుడు వినయ్‌ సహస్రదేవ్‌ బుద్దే నా విద్యార్థి. అతని ఆహ్వానం మేరకు... భారత్‌, రష్యాల 70 ఏళ్ళ స్నేహాన్ని పురస్కరించుకొని... ఆరేళ్ల కిందట పీటర్స్‌బర్గ్‌ వెళ్లాను. అప్పుడు లెనిన్‌ గ్రాడ్‌ యూనివర్సిటీలో మా అమ్మ ఫొటోతో పాటు నా చిన్ననాటి ఫొటోలు కూడా చూసి ఆశ్చర్యపోయాను. మా అమ్మ భాషావేత్త అని తెలుసు కానీ, ఆ సబ్జెక్టులో తాను దేశం గర్వించదగ్గ నిష్ణాతురాలని నాకు అప్పుడే తెలిసింది. అరవై ఏళ్ల కిందటే మా అమ్మ తెలుగు బోధనా పద్ధతి మీద రష్యన్‌ భాషలో పుస్తకం రాశారు. వాళ్లు ఇప్పటికి అమ్మ సేవలను స్మరించుకోవడం గర్వంగా ఉంది. ఇప్పటికి రష్యన్లు చాలామంది తెలుగు నేర్చుకుంటున్నారు. 


ప్రాంతీయ ద్వేషాలతో...

గోవా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా 1988లో నా కెరీర్‌ ప్రారంభమైంది. నా భర్త నిరంజన్‌ పండిట్‌ది మహారాష్ట్ర. మాదీ ప్రేమవివాహమే. ఆయన నాకు రెడ్‌క్రాస్‌ సేవాకార్యక్రమాల్లో పరిచయమయ్యారు. పెళ్లయిన తరువాత... పుణెలోని సావిత్రీబాయి ఫూలే యూనివర్సిటీకి నాకు బదిలీ అయింది. తొలినాళ్లలో నేనక్కడ టీచర్స్‌ యూనియన్‌ సెక్రెటరీగా, తర్వాత ఎగ్జిక్యూటివ్‌ కౌన్సెల్‌గా అసోసియేషన్‌లో చురుగ్గా ఉండేదాన్ని. అది సహించలేని వాళ్లు మొదట ‘నాన్‌-లోకల్‌’ అంటూ నామీద వ్యతిరేక ప్రచారం ప్రారంభించారు. నా ఎదుగుదలను చూసి భరించలేక, యూనివర్సిటీలోని వామపక్ష ఉదారవాద కూటమి అంతా కలిసి నామీద జుగుప్సాకరమైన రాజకీయాలకు తెగబడ్డారు. అయినా, నన్నేమీ చేయలేకపోయారు. ఎందుకంటే, నేను అంతకు మించిన దైర్యంతో ఎదురొడ్డి నిలిచాను కనుక. మహిళలను నేరుగా ఎదర్కోలేక ఇలా వాళ్లను దెబ్బతీయాలని చూస్తారు. అయినా, ముందుకెళ్లడంలోనే మహిళల విజయం ఉంటుంది.


అవన్నీ అబద్ధాలే...

మీడియాలోనూ వామపక్ష ఉదారవాదవాదులు చాలామందది  ఉన్నారు. వాళ్లే నామీద లేనిపోనివి ప్రచారం చేశారు. నేను ట్విట్టర్‌లో ఏవేవో విద్వేష వ్యాఖ్యలు చేశానంటూ అబద్ధాలు రాశారు. నిజానికి ఆరేళ్ల కిందటే నా ట్విట్టర్‌ ఖాతాను డిలీట్‌ చేశాను. పైగా నేనెన్నడూ గాడ్సే గురించి రాసింది లేదు. పుణె యూనివర్సిటీలో నేను 30మంది పీహెచ్‌డీ విద్యార్థులకు పర్యవేక్షకురాలిగా ఉన్నాను. అందులో ఎనిమిది మంది మైనార్టీలే! ఇక నేను చెన్నైలో చదివింది ఒక మిషనరీ స్కూల్లో! తర్వాత మా అమ్మాయి కూడా క్రిస్టియన్‌ మిషనరీ స్కూల్లోనే చదివింది. నాకు ఇతర మతాలలో చాలామంది స్నేహితులున్నారు. అలాంటిది నేనెందుకు పరమతాలను ద్వేషిస్తూ, వ్యాఖ్యలు పోస్టు చేస్తాను? ఇదంతా వామపక్ష మేధావుల సృష్టే.అయినా, ఆ ఆరోపణల్లో నిజంలేదని విజిలెన్స్‌ రిపోర్టులోనూ తేలింది. 


ఎదుగుదలను సహించలేరు...

మన దేశంలో 54 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఉంటే, అందులో కేవలం నలుగురు మహిళలు ప్రస్తుతం వీసీలుగా ఉన్నారు. ఇదివరకు అది కూడా లేదు. డెభ్భై ఏళ్లు ఈ దేశాన్ని ఏలినవారు జేఎన్‌యూకు ఒక మహిళా వీసీని ఇంతవరకు ఎందుకు నియమించలేకపోయారు? వామపక్ష పార్టీల్లోనూ నిర్ణయాధికారమంతా అగ్రకులాలదే. దానికి తోడు పితృస్వామ్య భావజాలం కలిగిన వాళ్లు ఆయా పార్టీల్లో ఎక్కువ. వాళ్లు మహిళల ఎదుగుదలను అస్సలు సహించలేరు. పైగా వాళ్ల కోటరీ కానివాళ్లను మాటవరసకు కూడా అంగీకరించరు. పైగా హిందీ భాషేతరులను అస్సలు ఒప్పుకోరు. కనుకే వామపక్ష ఉదారవాదులు ఎన్నడూ యూనివర్సిటీల్లోని ఉన్నత స్థానాల్లో మహిళలను నియమించలేకపోయారు. కానీ ఆ పని మన ప్రధాని చేయగలిగారు. డెభ్భై ఏళ్ల సంకుచిత సంప్రదాయానికి స్వస్తి పలికారు. కాబట్టే... 75ఏళ్ల స్వాతంత్య్ర అమృతోత్సవ వేళ... నాలాంటి హిందీ ప్రాంతేతర, బ్రాహ్మణేతర మహిళ జేఎన్‌యూ లాంటి ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీకి వీసీ కాగలిగింది. మగవాళ్ల కన్నా ఆడవాళ్లు మూడింతలు సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించగలరు. అయితే, వాళ్లకు తగిన అవకాశాలు రావాలి. అప్పుడే తమను తాము నిరూపించుకోగలరు.’’


శ్రీశ్రీ ‘నేనెవరో నీకు తెలుసా?’ అంటూ..,

మా అమ్మ, నాన్నలది కులాంతర వివాహం. మా నాన్న డి.ఆంజనేయులు ప్రఖ్యాత జర్నలిస్టు. ఆయన కులరహిత సమాజాన్ని కాంక్షించారు. మమ్మల్ని అలానే పెంచారు. కుల అస్తిత్వం ఉండకూడదనే,... నేనెన్నడూ రిజర్వేషన్‌ ఉపయోగించుకోలేదు. మా నాన్న వ్యక్తిగత లైబ్రరీలో 75వేల పైచిలుకు పుస్తకాలుండేవి. ఆయన తదనంతరం వాటన్నింటినీ చెన్నైలోని రామకృష్ణ మఠానికి ఇచ్చాం. నాన్న ప్రోత్సాహం వల్ల చిన్నప్పటి నుంచి పుస్తకాలు బాగా చదివేదాన్ని. అదే నా భవిష్యత్తుకు దారి దీపమైంది. మహాకవి శ్రీశ్రీ, ఆరుద్ర, దాశరథి, కృష్ణశాస్త్రి తదితర ప్రముఖులంతా నాన్నకు ఆత్మీయులు. వారంతా చెన్నైలోని మా ఇంటికి నిత్యం వస్తుండేవారు. శ్రీశ్రీ అయితే, ‘నేనెవరో నీకు తెలుసా’ అంటూ నాతో చాలా సరదాగా మాట్లాడేవారు. పైగా ఎదురుబొదురు ఇళ్లు కావడంతో, అప్పుడప్పుడు అల్పాహారానికి కూడా వచ్చేవారు. అది తెలుగు సాహిత్యానికి స్వర్ణయుగం. అప్పట్లో ‘లెఫ్టు, రైటు’ అని ఇంతగా విభేదాలుండేవి కావు. రచయితలంతా కలిసిమెలిసి ఉండేవారు. 



 కె.వెంకటేశ్‌


‘పుష్స’ బాగా నచ్చింది...

‘‘మా అమ్మ, నాన్న తెలుగు వాళ్లు అయినా, నేను పెరిగిందంతా చెన్నైలోనే. కనుక నేను తమిళనాడు అస్తిత్వాన్నే ఇష్టపడతాను. తెలుగు సినిమాలు బాగా చూస్తాను. అందులోనూ ‘మాయాబజార్‌,’ ‘శంకరాభరణం’ సినిమాలు నాకు చాలా ఇష్టం. ఈ మధ్య వచ్చిన ‘పుష్ప’ సినిమా నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పటికి ఆ సినిమాను మూడు సార్లు చూశాను. ముఖ్యంగా అందులోని ‘పుష్ప... ఫ్లవర్‌ కాదు పవర్‌’ సంభాషణలు భలే ఉన్నాయి. ‘శ్రీవల్లీ’ పాట కూడా నచ్చింది. దాశరథి, కృష్ణశాస్త్రి కవిత్వం ఇష్టంగా చదువుతాను. వంట చేయడం పని ఒత్తిడి నుంచి నాకు పెద్ద ఉపశమనం. కనుక వీసీ బంగ్లాలో సహాయకులున్నా, నా వంట నేనే చేసుకుంటాను.’’

Updated Date - 2022-03-21T05:30:00+05:30 IST