కృష్ణా బోర్డు ఏం చేస్తోంది?

ABN , First Publish Date - 2021-07-10T07:10:03+05:30 IST

విభజన చట్టం ప్రకారం రిజర్వాయర్ల నిర్వహణ కేంద్రప్రభుత్వ సంస్థ కృష్ణా బోర్డుదే. ఆ చట్టనిబంధన అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ అంటుంటే కేంద్ర ప్రభుత్వానికి వంత పాడుతున్నారని అంటున్నారు. కృష్ణానదీ జలాలను చట్టనిబంధనలకు.....

కృష్ణా బోర్డు ఏం చేస్తోంది?

విభజన చట్టం ప్రకారం రిజర్వాయర్ల నిర్వహణ కేంద్రప్రభుత్వ సంస్థ కృష్ణా బోర్డుదే. ఆ చట్టనిబంధన అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ అంటుంటే కేంద్ర ప్రభుత్వానికి వంత పాడుతున్నారని అంటున్నారు. కృష్ణానదీ జలాలను చట్టనిబంధనలకు అతీతంగా సముద్రంపాలు చేయటం విభజన చట్టం అతిక్రమణే కాక ఆంధ్రా రైతుపై క్రూరత్వం ప్రదర్శించడమే.


ఏప్రభుత్వం లోనైనా పరిపాలన అనేది కొన్ని సూత్రాల ఆధారంగానూ, పద్ధతుల ఆధారంగానూ జరుగుతుంది. లేదంటే పరిపాలన అస్తవ్యస్తంగా తయారవుతుంది. కృష్ణాబేసిన్‌లోని ఉమ్మడిప్రాజెక్టుల నీటి యాజమాన్యం ప్రస్తుతం అలాగే తయారయింది. ఒక ఉమ్మడి సంపత్తి అని ప్రాజెక్టుల యాజమాన్యం కేంద్రప్రభుత్వ సంస్థ కృష్ణాబోర్డుకు అప్పగించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ద్వారా ఈ బోర్డు ఉద్భవించింది. చట్టం పక్రారమే ఉభయ రాష్ట్రాలు ఈ బోర్డు పరిధిలోకి వస్తాయి దాని ఆదేశాలకి లోబడి వ్యవహరించాలి. ప్రస్తుతం తెలంగాణ ఈ నియమాన్ని విస్మరించి తన ఇష్టానుసారం వ్యవహరించి అరాచకం సృష్టించింది.


ఒక ప్రభుత్వోద్యోగి నియమాలని నిబంధనలని అతిక్రమిస్తే పైఅధికారి అతనిని బాధ్యతారహితంగానూ అక్రమంగానూ ప్రవర్తించావని అక్షింతలు వేస్తాడు. రాజకీయనాయకులు పరిపాలనకి ఆధ్వర్యం వహిస్తున్నప్పుడు ఇటువంటి నిబంధనలకు అతీతులేమో మరి! 


విభజన చట్టంలోని షెడ్యూల్ 11 నియమాల పక్రారం: 1) వ్యవసాయ, విద్యుచ్ఛక్తి అవసరాల మధ్య విరుద్ధ పరిస్థితులు ఏర్పడినప్పుడు వ్యవసాయ అవసరాలకు ప్రాధాన్యమివ్వాలి 2) ఉమ్మడి రాష్ట్రానికి ట్రైబ్యునల్‌లు గోదావరి నదిమీద లేక కృష్ణానదిమీద గాని కేటాయించిన వాటాలలో మార్పు ఉండదు. ఈ రెండు నిబంధనలనీ తెలంగాణ ఉపేక్షించి రిజర్వాయర్లలో ఉన్న నీటిని వ్యవసాయ అవసరాలకు మిగలకుండా విద్యుదుత్పత్తికి కిందకి తోడేసి సముద్రం పాలు చేసింది. విభజన చట్టం సెక్షన్ 84, బోర్డు కర్తవ్యాల నిబంధనలను ఇలాగ విశదీకరించింది: ‘ఉమ్మడి రాష్ట్రానికి ఏ ట్రైబ్యునల్ అయినా వివిధ ప్రాజెక్టులకు కేటాయించిన నీటివాటాల ప్రకారంగా గాని, ఉమ్మడి రాష్ట్రం ఇతర రాష్ట్రాలతో లేక కేంద్రపాలిత రాష్ట్రాలతో చేసుకున్న ఒడంబడిక ప్రకారంగా గానీ లేక అమలులో ఉన్న క్రమం (అరేంజ్‌మెంట్) ప్రకారంగా కానీ ఇరు వారసత్వ రాష్ట్రాలకు నీటిపంపిణీ క్రమబద్ధీకరించాలి. ఈ నిబంధన పక్రారం ఇరు రాష్ట్రాల ప్రాజెక్టులకు కేటాయించిన వాటాల నిష్పత్తి 63:37గా వస్తుంది. అదే ప్రస్తుతం అనుసరించబడుతోంది. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి విద్యుదుత్పత్తికి ఉన్న నీటిని 50:50గా పంచుకుందాం అని అంటున్నారు. ఈ యాభై-–యాభై ప్రాతిపదిక గత రెండు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ పెద్దమనసుతో బోర్డు ప్రోద్బలంతో తెలంగాణలో పవర్ డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు అవసరాలకు సరిపోయే నిల్వ ఉన్నది కనుక తాత్కాలిక ఏర్పాటుగా ఒప్పుకుంది. ఇదే ప్రాతిపదిక నీటి నిల్వలు తక్కువగా ఉన్నప్పుడు సీజన్ మొదట్లోనే బోర్డులో ఏకాభిప్రాయం లేకుండా ఎలా ఒప్పుకుంటారు? శ్రీశైలం నాగార్జునసాగర్ రిజర్వాయర్లను ఏకీకృత విధానంలో ఆపరేట్ చెయ్యాలని సాగు నీటి అవసరాలకు లోటు రాకుండా విద్యుదుత్పత్తి ఉండాలని 1960 దశకంలోనే ‘కమిటీ ఆన్ ప్రాజెక్ట్స్’ సూచించింది.


ట్రైబ్యునల్ 1లో కూడా రెండు రిజర్వాయర్ల ఏకీకృత ఆపరేషన్ విధానం లెక్కలోకి తీసుకొనే శ్రీశైలం రిజర్వాయర్ గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు గానూ కనీస నీటిమట్టం 854 అడుగులుగా సాగునీటి అవసరాల దృష్ట్యా అవసరమని చెప్పింది. కానీ సాగునీటి అవసరాలు పెరుగుతూండటంతో 1991లో వంద సంవత్సరాల ప్రవాహ వివరాల ఆధారంగా వర్కింగ్ టేబుల్స్ పరిశీలించి విద్యుదుత్పత్తికి కనీస నీటిమట్టం 834 అడుగులుగా నిర్ణయించారు. కొన్ని సంవత్సరాలు ఈ మట్టాని కంటే కూడా కిందకి అవసరాల దృష్ట్యా వెళ్ళి ఉండవచ్చు. అవసరమయితే ఇటువంటి నిర్ణయం నీటి సంవత్సరం చివరి రోజులలో తీసుకోవాలి కానీ జూన్, జూలై నెలలలో కాదు. ఈ అభ్యాసం ఆధారంగానే శ్రీశైలం నాగార్జునసాగర్ రిజర్వాయర్ల నీటి నిర్వహణ పంపిణీ విధానాలను జి.వో. 69లో రూపొందించారు. అప్పట్నించి ఇందులో పొందుపరచిన క్రమంని (అరేంజ్‌మెంట్) అనుసరిస్తున్నారు. ఆ జి.వో ప్రకారం విద్యుదుత్పత్తి శ్రీశైలం రిజర్వాయర్ నీటిమట్టం+834 అడుగులు పైన ఉన్నప్పుడు మాత్రమే చేయాలి. అదీ కుడి పవర్ హౌస్ ద్వారానే. శ్రీశైలం డ్యాం ప్రథమ యోచనలో కుడి పవర్ హౌస్ మాత్రమే ఉంది. ఆ ప్రకారమే ట్రైబ్యునల్ 1, నీటి ఆవిరి నష్టంగా 33 టి.ఎం.సిలు కేటాయించింది.


ఎడమ పార్శ్వం పవర్ హౌస్‌ని తరువాత, నీటి కేటాయింపు లేదు కనుక ఒక పంప్డ్ స్టొరేజ్‌గా రూపొందించారు. ఈ పవర్ హౌస్ ద్వారా విద్యుదుత్పత్తికి వాడిన నీరు తిరిగి రిజర్వాయర్‌లోకి పంప్ చేయాలి. ఈ విధానంలో అదనపు నీటి వినియోగం ఉండదు. 1996 జూన్ 15 నాటి జి.వో. 69 పక్రారం ఆ పవర్ హౌస్‌ను అత్యధిక డిమాండ్ అవసరం దృష్ట్యా ఆపరేట్ చేసినట్టయితే, విద్యుత్ అవసరాలు బాగా తక్కువగా ఉన్నప్పుడు (రాత్రుళ్ళు) అంతే నీటిపరిమాణాన్ని వెనక్కి పంప్ చెయ్యాలి. ఇలాగ చేయాలంటే నాగార్జునసాగర్ డాం కింద ఉన్నట్లుగా ఒక టైల్‌పాండ్ డాం శ్రీశైలం డాం కింద అన్నా ఉండాలి లేక నాగార్జునసాగర్ రిజర్వాయర్ నీటిమట్టం బాగా ఎక్కువగా ఉండి ఆ నిల్వ వెనకకి ఎగదన్ని టర్బైన్‌లు పంపులుగా పని చేయటానికిగల కనీస నీటిమట్టం సుగమం కావాలి. ఇంకొక వీలు కూడా కల్పించారు-– అది శ్రీశైలం రిజర్వాయర్ పూర్తిగా నిండి గేట్లు ఎత్తి స్పిల్‌వే మీదుగా నీటిని కిందకు వదులుతున్నప్పుడు కూడా ఎడమ పవర్ హౌస్ ఆపరేట్ చేయవచ్చు. ప్రస్తుతం ఇటువంటి పరిస్థితి లేకపోగా నీటిమట్టం బాగా తక్కువగా ఉన్నా, నీటిని వెనక్కి పంప్ చేసే వీలు లేకపోయినా కూడా కిందకి తోడేశారు. ఏమంటే మేము ఈ జివో 69ని ఒప్పుకోము, మాకు వీలయిన కె.సి.ఆర్ గారి నిబంధనల ప్రకారమే జరగాలి అని అంటున్నారు. ఈ సంఘటలన్నింటిని కృష్ణాబోర్డు గుడ్లప్పగించి చూస్తోంది. అయినా తెలంగాణ ఆ బోర్డుని తప్పు పడుతోంది, వారిని నిబంధనలని అనుసరించమంటున్నారని. విభజన చట్టం ప్రకారం రిజర్వాయర్ల నిర్వహణ బోర్డుదే. ఆ చట్టనిబంధన అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ అంటుంటే కేంద్రప్రభుత్వానికి వంత పాడుతున్నారని అంటున్నారు. ఇలాగ నీటిని చట్టనిబంధనలకు అతీతంగా సముద్రంపాలు చేయటం విభజన చట్టఅతిక్రమణే కాక ఆంధ్రా రైతుపై క్రూరత్వం ప్రదర్శించడమే.


జి.వో 69 (1996)లో బచావత్ ట్రైబ్యునల్ కేటాయింపుల ఆధారంగా రూపొందించారు. ప్రస్తుతం రిజర్వాయర్ల నిర్వహణ ఆ కేటాయింపుల ప్రకారమే జరుగుతోంది. కేటాయింపులు లేని ప్రాజెక్టులకు నీరు అందుతున్నాయంటే కేటాయించిన నీరు రాష్ట్రంలో ఎక్కడైనా వాడుకోవచ్చనే వీలు ట్రైబ్యునల్ కల్పించటం మూలానే. ఈ జి.వో, ప్రస్తుత బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పు ఇచ్చాక విభజన చట్టంలో ఆదేశించబడిన ఆపరేషన్ ప్రొటోకాల్ ట్రైబ్యునల్ ప్రకటించాక, షెడ్యూల్ 11లోని ప్రాజెక్టుల భవితవ్యం తేలాక, మిగతా కొత్త ప్రాజెక్టులకు నీటిసరఫరాపై ఒక పద్ధతి ఉదయించాక మార్పులు చేయవచ్చు. 


రాజకీయంగా ఏదయినా చర్య వేరు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముందున్న పాలనాపరంగా తీసుకోవలిసిన చర్య మాత్రం ఒకటే కావాలి. విభజన చట్టం పక్రారం ఒక వివాదం ఏర్పడినప్పుడు ఇరువురికి ఏకాభిప్రాయం కుదరనప్పుడు కృష్ణాబోర్డు నిస్సహాయతగా చూస్తోంది కనుక అపెక్స్ కౌన్సిల్‌కి వెళ్ళాలి. వెంటనే అత్యవసర అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని కోరాలి. ఇందులో అజెండా అంశంగా ప్రస్తుత తెలంగాణ ఉద్దేశపూర్వక చట్టఅతిక్రమణలు ఉంచమని అర్థించాలి. ఉల్లంఘన వివరాలను, కలిగిన నష్టాన్నీ విస్తృతంగా నమోదు చెయ్యాలి. తప్పిదాలకి, విభజన చట్టం షెడ్యూల్ 11లో గల నిబంధన 9 పక్రారం ఆర్థిక ఆంక్షలు విధించాలని పట్టు పట్టాలి. తెలంగాణ రిజర్వాయర్ల నీటి పంపిణీ విధానం బోర్డు చెప్పింది కాక తమ ఇష్టానుసారం చేస్తున్నారనీ ఆంధ్రప్రదేశ్‌కి తీవ్ర నష్టం కల్గించే విధానాలు అవలంబిస్తున్నారని,- ఇది రిజర్వాయర్లు బోర్డు పూర్తి కంట్రోల్‌లోకి వెళ్ళకుండా తెలంగాణ అడ్డుపడుతూండడం మూలానే సాధ్యమవుతోందనీ కూడా అపెక్స్ కౌన్సిల్ దృష్టికి తీసుకు వెళ్ళాలి.


బోర్డు పరిధులు వెంటనే నోటిఫై చేసి రిజర్వాయర్ల నిర్వహణ పూర్తిగా బోర్డ్ ద్వారానే జరిగేటట్టుగా ఏ చర్యలు అవసరమో కూడా కౌన్సిల్ మీటింగ్‌లో తుది నిర్ణయాలు జరిగేలా అజెండా రూపొందించమని అడగాలి. అక్కడ కోరినట్టుగా న్యాయం ఒక నెలలోపు లభించకపోతే సుప్రీంకోర్టు తలుపు తట్టాలి. తెలంగాణపై చట్టప్రకారం ఆర్థిక ఆంక్షలు విధించమని కేంద్రాన్ని ఆదేశించాలని కోరాలి. ఈ విషయంలో పొరుగు రాష్ట్రం అని వెనకాడితే తెలంగాణ ఇంకా రెచ్చిపోయే ప్రమాదముంది.


-కురుమద్దాలి వెంకట సుబ్బారావు

రిటైర్డ్ ఛీఫ్ ఇంజనీర్ (ఇరిగేషన్)

Updated Date - 2021-07-10T07:10:03+05:30 IST