‘టెస్లా’ను తెలంగాణలో పెట్టండి

ABN , First Publish Date - 2022-01-17T08:13:25+05:30 IST

‘‘భారత్‌లో కార్ల వ్యాపారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాం’’ అంటూ ప్రముఖ అంతర్జాతీయ ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ సంస్థ టెస్లా

‘టెస్లా’ను తెలంగాణలో పెట్టండి

కంపెనీ సీఈవో ఎలన్‌ మస్క్‌ను కోరిన కేటీఆర్‌ 

భారత్‌లో వ్యాపారానికి ప్రభుత్వం నుంచి అనేక సవాళ్లు 

ఎదుర్కొంటున్నామన్న మస్క్‌

కేటీఆర్‌ ట్వీట్‌తో ఇతర రాష్ట్రాల నుంచీ స్పందన

మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌ మంత్రుల ఆహ్వానం

పంజాబ్‌కు రావాలన్న సిద్ధూ

అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తాం.. సవాళ్లను ఎదుర్కొనడంలో భాగస్వాములవుతాం


హైదరాబాద్‌, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): ‘‘భారత్‌లో కార్ల వ్యాపారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాం’’ అంటూ ప్రముఖ అంతర్జాతీయ ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ సంస్థ టెస్లా సీఈవో చేసిన ట్వీట్‌ రాజకీయవర్గాల్లో దుమారం రేపగా.. దీనిని పలు రాష్ట్రాలు తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఈ విషయంలో తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అందరికన్నా ముందుగా స్పందించారు. ఆయనను తెలంగాణకు ఆహ్వానించారు. ‘‘హే ఎలన్‌.. నేను భారత్‌లోని తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రిని. కొత్త పరిశ్రమల ఏర్పాటులో తెలంగాణ రాష్ట్రం.. దేశంలోనే అగ్రశ్రేణి వ్యాపార గమ్యస్థానం. ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేస్తే భాగస్వామిగా కలిసి పనిచేసేందుకు, ఏర్పాటుకు అయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ముందుంటాం’’ అంటూ ఈ నెల 15న ట్వీట్‌ చేశారు. కేటీఆర్‌ ట్వీట్‌కు పలువురు సినీ ప్రముఖులు మద్దతుపలికారు. నటులు విజయ్‌ దేవరకొండ, నిఖిల్‌, దర్శకులు మెహర్‌ రమేశ్‌, గోపిచంద్‌ మలినేని.. టెస్లా సీఈవోను ఉద్దేశిస్తూ పెట్టుబడులకు రాష్ట్రానికి రావాలని కోరారు. మహారాష్ట్ర, పంజాబ్‌, పశ్చిమబెంగాల్‌ సైతం టెస్లాను తమ రాష్ట్రాలకు ఆహ్వానించాయి. దేశంలోనే అత్యంత ప్రగతిశీల రాష్ట్రంగా ఉన్న మహారాష్ట్రలో కార్ల తయారీ కర్మాగారాన్ని ప్రారంభించాలని ఆహ్వానిస్తున్నామంటూ ఆ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి జయంత్‌ పాటిల్‌ కోరారు. పంజాబ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూ సైతం తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని మస్క్‌ను కోరారు. టెస్లా కంపెనీని పశ్చిమబెంగాల్‌లో ఏర్పాటు చేయాలంటూ ఆ రాష్ట్ర మంత్రి రబ్బానీ ఆహ్వానించారు.


అమెరికాలో 18 ఏళ్ల క్రితం ఏర్పాటు..

అమెరికాలోని టెక్సాస్‌ కేంద్రంగా 18 ఏళ్ల క్రితం ప్రారంభమై అంచెలంచెలుగా అనేక దేశాలకు విస్తరించిన టెస్లా కంపెనీ.. ఎలక్ట్రిక్‌ కార్ల రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద బ్రాండ్‌గా అవతరించింది. ఎలక్ట్రిక్‌ కార్లకు పెరుగుతున్న డిమాండ్‌ నేపథ్యంలో వాహనాల తయారీ కేంద్రాన్ని భారత్‌లో ఏర్పాటు చేస్తామని టెస్లా సీఈవో మస్క్‌ 2020లోనే ప్రకటించారు. అప్పటినుంచి భారత ప్రభుత్వంతో జరుపుతున్న చర్చలు ఓ కొలిక్కి రాకపోవడంతో మస్క్‌ ఇటీవలే ట్విటర్‌ ద్వారా ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. టెస్లా ఇండియ మోటార్స్‌ పేరుతో ఈ సంస్థ ఇప్పటికే బెంగళూరు కేంద్రంగా కంపెనీ రిజిస్టర్‌ చేసుకుంది.


ప్రపంచంలోనే అతిపెద్ద అమెజాన్‌ డేటా సెంటర్‌ ఎక్కడ ఉంది?

ట్విటర్‌లో మంత్రి కేటీఆర్‌ క్విజ్‌ 

‘‘ప్రపంచంలోనే అతిపెద్ద అమెజాన్‌ డేటా సెంటర్‌ ఎక్కడ ఉంది?’’ ట్విటర్‌ వేదికగా మంత్రి కేటీఆర్‌ నెటిజన్లకు వేసిన ప్రశ్న ఇది. ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న క్విజ్‌లో భాగంగా కేటీఆర్‌ ఈ ప్రశ్న వేశారు. అతిపెద్ద అమెజాన్‌ డేటా సెంటర్‌ హైదరాబాద్‌లోనే ఉందంటూ.. నగరంలోని నానక్‌రాంగూడలో ఉన్న అమెజాన్‌ సెంటర్‌ ఫొటోను పోస్ట్‌ చేశారు. తద్వారా ఐటీ రంగంలో తెలంగాణ రాష్ట్ర పురోగతిని నెటిజన్లకు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. 

Updated Date - 2022-01-17T08:13:25+05:30 IST