రైతులకు త్వరలోనే రుణమాఫీ

ABN , First Publish Date - 2020-03-03T08:50:47+05:30 IST

రైతులకు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీకి సంబంధించిన ప్రక్రియను త్వరలోనే ప్రారంభించాలని అధికారులకు సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారని

రైతులకు త్వరలోనే  రుణమాఫీ

ప్రక్రియ ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు

ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి

ఆ బాధ్యత సహకార సంఘాల నేతలదే

రైతు సంక్షేమానికి ఎంత ఖర్చైనా వెనుకాడం

డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్లతో కేటీఆర్‌

హైదరాబాద్‌, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): రైతులకు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీకి సంబంధించిన ప్రక్రియను త్వరలోనే ప్రారంభించాలని అధికారులకు సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ తెలిపారు. కేంద్రం అసంబద్ధ నిర్ణయాల వల్ల ఆర్థిక మందగమనం ఉన్నప్పటికీ దృఢ సంకల్పంతో కేసీఆర్‌ నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు. రైతుల సమస్యలపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని, దాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత సహకార సంఘాల నేతలు తీసుకోవాలని సూచించారు. డీసీసీబీ, డీసీఎం్‌సల చైర్మన్లు, వైస్‌ చైర్మన్లతో సోమవారం ఇక్కడ టీఆర్‌ఎస్‌ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమది రైతు పక్షపాతి ప్రభుత్వమని, వారి సంక్షేమానికి ఎంత ఖర్చైనా వెనుకాడబోమన్నారు.


సీఎం కేసీఆర్‌ స్వయంగా రైతు అని, అందుకే రైతుల కోసం భారీగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. రైతులపై ప్రత్యేక ప్రేమ చూపుతూ వ్యవసాయ రంగాన్ని కొత్తపుంతలు తొక్కిస్తున్నారని పేర్కొన్నారు. రైతు బీమా, రైతు బంధు వంటి పథకాలను అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. రాష్ట్రంలో భారీగా వ్యవసాయ విస్తరణాధికారులను నియమించామని, వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకుంటూ రైతులను బహుముఖంగా ఆదుకుంటున్నామని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులతోపాటు పలు పథకాలు అమలు చేస్తున్నందునే పీఏసీఎస్‌ ఎన్నికల్లో 94శాతానికిపైగా స్థానాలను తమ పార్టీ మద్దతుదారులకు రైతులు కట్టబెట్టారని చెప్పారు. 


సామాజిక న్యాయం పాటిస్తున్న కేసీఆర్‌

సామాజిక న్యాయం అంటూ మాటలు చెప్పే పార్టీలకు భిన్నంగా టీఆర్‌ఎస్‌ వ్యవహరిస్తోందని కేటీఆర్‌ తెలిపారు. ఎన్నికలకు ముందు ఎలాంటి హామీ ఇవ్వకున్నా, పదవుల పంపకంలో సీఎం కేసీఆర్‌ సామాజిక న్యాయం పాటిస్తున్నారని పేర్కొన్నారు. డీసీసీబీ, డీసీఎంఎ్‌సల చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల పదవుల్లో 48 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. ఎలాంటి రిజర్వేషన్‌ లేకున్నప్పటికీ, బలహీన వర్గాల కోసం కేసీఆర్‌ ప్రత్యేక చొరవతో నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. మునిసిపల్‌ ఎన్నికల్లోనూ వారికే ఎక్కువ పదవులు ఇచ్చారని గుర్తు చేశారు.


కేటీఆర్‌ను కలిసిన జూపల్లి, బూర నర్సయ్య

మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ కేటీఆర్‌ను కలిశారు. బూర నర్సయ్య జన్మదినం సందర్భంగా ఆయనకు కేటీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. 

Updated Date - 2020-03-03T08:50:47+05:30 IST