కేటీఆర్‌ క్యాంపు ఆఫీసు ముట్టడి

ABN , First Publish Date - 2021-12-09T07:20:16+05:30 IST

మధ్యాహ్న భోజన పథకం కార్మికులు బుధవారం రాజన్న

కేటీఆర్‌ క్యాంపు ఆఫీసు ముట్టడి

  • మధ్యాహ్న భోజన పథకం కార్మికుల ఆందోళన..
  • పెండింగ్‌ బిల్లులు, వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ 


సిరిసిల్ల/మొయినాబాద్‌ రూరల్‌, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): మధ్యాహ్న భోజన పథకం కార్మికులు బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మంత్రి కేటీఆర్‌ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న మధ్యాహ్న భోజన బిల్లులు, వేతనాలను చెల్లించాలంటూ మూడు రోజులుగా వారు సమ్మె చేస్తున్నారు. అయినా ప్రభుత్వం స్పందించడం లేదంటూ మంత్రి కేటీఆర్‌ క్యాంపు కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల మధ్యాహ్న భోజన వంట కార్మికుల సంఘం ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ మండలాల నుంచి కార్మికులు తరలివచ్చి కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.


తమకు కనీస వేతనాలను అమలు చేయాలని, ప్రభుత్వమే గ్యాస్‌ సిలిండర్లు, కోడిగుడ్లు సరఫరా చేయాలని కోరారు. దీంతోపాటు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వంట చార్జీలు పెంచాలని, కిరాణా సరుకులు ప్రభుత్వమే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలంలోని హిమాయత్‌నగర్‌ జడ్పీ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్మికులు సమ్మెకు దిగడంతో జిల్లా విద్యాశాఖ బుధవారం ‘అక్షయపాత్ర’ ద్వారా విద్యార్థులకు భోజనం పెట్టేందుకు వాహనాన్ని పంపించింది. అయితే ఈ వాహనాన్ని మధ్యాహ్న భోజన కార్మికులు పాఠశాల వద్ద అడ్డుకున్నారు.


కార్మికులకు వేతనాలు, సక్రమంగా బిల్లులు చెల్లించాలని కోరితే.. వారి పొట్టగొట్టే విధంగా ప్రభుత్వం విద్యార్థులకు రెడిమేడ్‌ భోజనాన్ని అందించాలనుకోవడం దారుణమని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అయితే తమకు జిల్లా విద్యాశాఖ నుంచి ఆదేశాలు వచ్చినందునే భోజనాన్ని తీసుకువచ్చామని అక్షయపాత్ర సిబ్బంది తెచ్చారు. కానీ, కార్మికులు అడ్డుకోవడంతో విద్యార్థులకు అందించకుండానే వెనుదిరిగారు. అనంతరం కార్మికులు తమ సొంత ఖర్చుతో విద్యార్థులకు భోజనాన్ని వండి పెట్టారు. 


Updated Date - 2021-12-09T07:20:16+05:30 IST