కృష్ణపట్నం టు హైదరాబాద్‌ పైప్‌లైన్‌

ABN , First Publish Date - 2022-04-14T08:16:59+05:30 IST

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు నుంచి హైదరాబాద్‌ సమీపంలోని మాధవరం వరకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌) పైప్‌లైన్‌ ఏర్పాటు చేస్తోంది. ఇతర ప్రాంతాల నుంచి

కృష్ణపట్నం టు హైదరాబాద్‌ పైప్‌లైన్‌

రూ.1926 కోట్ల వ్యయంతో బీపీసీఎల్‌ ఏర్పాటు

2 తెలుగు రాష్ట్రాల్లో 451 కి.మీ. మేర నిర్మాణం 

హైదరాబాద్‌ సమీపంలోని మాధవరం టెర్మినల్‌కు

ఇంధనం సరఫరా.. 2024 నాటికి ప్రాజెక్టు పూర్తి 

ఆరడుగుల లోతున పైపులైన్‌.. దారి పొడవునా సెన్సర్లు

రైతులకు భూమి విలువలో 10 శాతం పరిహారం 

ఒంగోలులో ప్రాజెక్టు పర్యవేక్షణ కార్యాలయం 


ఒంగోలు, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు నుంచి హైదరాబాద్‌ సమీపంలోని మాధవరం వరకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌) పైప్‌లైన్‌ ఏర్పాటు చేస్తోంది. ఇతర ప్రాంతాల నుంచి కృష్ణపట్నం పోర్టుకు వచ్చే ఇంధనాన్ని మాధవరం వద్ద ఉన్న టెర్మినల్‌కు సరఫరా చేసేందుకు ఈ పైపులైన్‌ను ప్రతిపాదించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం రూ.451 కి.మీ. దూరం ఈ పైప్‌లైన్‌ ఏర్పాటు చేయడానికి రూ.1926 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. ఏపీలో రూ.1062 కోట్లు, తెలంగాణలో రూ.864 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు.


ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలో ఇప్పటికే సమగ్ర సర్వే పూర్తి చేశారు. ప్రస్తుతం రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో కీలక సర్వే సాగుతోంది. ఉమ్మడి ప్రకాశంలో 133.51 కి.మీ. దూరం ఈ పైపులైన్‌ ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వ భూములు పోనూ 5,253 మంది రైతుల పొలాల్లో పైపులైన్‌ వెళ్తుందని నిర్ధారించారు. ఈ మార్గంలో రాళ్లు పాతడంతో పాటు రైతులకు ముందస్తు నోటీసులు జారీ చేస్తున్నారు. అనంతరం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో ఈ ప్రక్రియ సాగనుంది. రాష్ట్రంలో 27 మండలాల పరిధిలో 99 గ్రామాల నుంచి పైపులైన్‌ వెళ్తుంది. పునర్విభజన జిల్లాలు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు జిల్లాల నుంచి తెలంగాణాలోని నల్గొండ, యాదాద్రి, భువనగిరి, మేడ్చల్‌ జిల్లాల గుండా మాధవరం టెర్మినల్‌ వరకు నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టును 2024 నాటికి పూర్తి చేయాలన్నది బీపీసీఎల్‌ లక్ష్యం. కృష్ణపట్నం పోర్టు నుంచి మాధవరం టెర్మినల్‌కు ఈ పైపులైన్‌ ద్వారా మోటార్‌ స్పిరిట్‌, హైస్పీడ్‌ డీజల్‌, కిరోసిన్‌, ఏవియేషన్‌ టర్బర్‌ ఇంధనం సరఫరా చేస్తారు. 


10 కి.మీ.కు ఒక వాచ్‌ పాయింట్‌ 

ఈ పైపులైన్‌ నిర్మాణం కోసం భూసేకరణ చేయడం లేదు. పైపులైన్‌ వేసేందుకు రూ.451 కి.మీ పొడవునా 16మీటర్ల వెడల్పున భూమి స్వాధీనం చేసుకుంటారు. అందులో రెండు మీటర్ల వెడల్పున ఆరు అడుగుల లోతు తవ్వుతారు. పైపులైన్‌కు ఒక వైపున మూడు మీటర్లు, మరోవైపు 11 మీటర్ల మేర ఖాళీ ఉంచుతారు. లైన్‌ కోసం తవ్విన మట్టిని ఒకవైపు పోసి, మెటీరియల్‌ను మరో వైపునుంచి తీసుకెళ్తారు. 16 అంగుళాల పైపు వేసి తిరిగి ఆ మట్టిని పూడ్చేస్తారు. అనంతరం ఆ భూమిని రైతులకు అప్పగిస్తారు. ప్రతి 10 కి.మీకు ఒకచోట చెకింగ్‌ పాయింట్‌తో పాటు లైన్‌ పొడవునా సెన్సార్‌లు ఏర్పాటు చేయనున్నారు. పనులు పూర్తయిన తర్వాత రైతులు ఎప్పటిలా పంటలు సాగు చేసుకోవచ్చు. అయితే సాధారణ వ్యవసాయ పంటలు తప్ప వేర్లు బాగా లోపలికి వెళ్లి పైపును డ్యామేజీ చేసే మామిడి, జామాయిల్‌ వంటివి సాగు చేసే అవకాశం లేదు. 16 మీటర్ల వెడల్పున సాగు చేయడానికి వీలు కాకపోవడం, మామిడి తోటలు, ఇతరత్రా పెద్ద పెద్ద చెట్లు తొలగించాల్సి ఉండటం వల్ల రైతులకు పరిహారం ఇవ్వనున్నారు. భూముల విలువలో 10 శాతాన్ని సంబంధిత రైతులకు నష్టపరిహారంగా బీపీసీఎల్‌ చెల్లిస్తుంది.  


రైతులకు నోటీసులు 

పైపులైన్‌ వెళ్లే మండలాలు, గ్రామాలు, సర్వే నెంబర్లకు సంబంధించి బీపీసీఎల్‌ తరఫున 3(1) సర్వే పూర్తి చేశారు. దాని ఆధారంగా ప్రస్తుతం ఒంగోలులో ఏర్పాటు చేసిన అధీకృత అధికారి (ఎస్‌డీసీ) పర్యవేక్షణలో రెవెన్యూ సిబ్బంది ఆయా సర్వే నెంబర్లలో నిర్మాణాలు, రోడ్లు, వాగులు, వంకలు, కాలువలు ఉన్నాయా?.. రైతుల పట్టా భూములా లేక ప్రభుత్వానివా తదితర అంశాలపై సర్వే ప్రారంభించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పైపులైన్‌ వెళ్లే మార్గంలో 5,253 మంది రైతుల భూములు ఉన్నట్లు గ్రామాల వారీగా నిర్ధారించి వారికి నోటీసులు ఇస్తున్నారు. వారికి నష్టపరిహారం చెల్లించనున్నారు. ప్రస్తుతం 6(1) సర్వే ఉమ్మడి ప్రకాశంలో పూర్తి చేసి రైతులకు నోటీసులు ఇస్తున్నారు. నెల్లూరు జిల్లాలోనూ 6(1) సర్వే మూడొంతులు పూర్తయినట్లు సమాచారం.


సాగుకు ఇబ్బంది ఉండదు

పైపులైన్‌ నిర్మాణం కోసం గుర్తించిన సర్వే నెంబర్లలోని రైతులకు ప్రకాశం జిల్లా పరిధిలో పీఎంపీ చట్టం ప్రకారం నోటీసులు ఇచ్చాం. పైపులైన్‌ నిర్మాణం తర్వాత ఆ ప్రాంతంలో పంటలు వేసుకోవచ్చు. అయితే పైపులైన్‌ దెబ్బతినే స్థాయిలో పెద్దపెద్ద వృక్షాలు పెంచకూడదు. భూమి విలువలో పది శాతంతో పాటు సాగు పనులు జరుగుతుంటే ఆ సీజన్‌ పంటకు కూడా పరిహారం అందుతుంది.  


ఎం.శ్రీదేవి, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌, పైపులైన్‌ ప్రాజెక్టు అధికారి

Updated Date - 2022-04-14T08:16:59+05:30 IST