ఏపీ నుంచి రాజ్యసభకు కృష్ణయ్య

ABN , First Publish Date - 2022-05-18T08:55:34+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి సలహాదారులుగా తెలంగాణ వారికి పెద్దపీట వేసిన వైసీపీ..

ఏపీ నుంచి రాజ్యసభకు కృష్ణయ్య

  • జగన్‌ అక్రమాస్తుల కేసులను వాదిస్తున్న నిరంజన్‌రెడ్డికీ చాన్స్‌
  • వైసీపీ 4 సీట్లలో రెండింట తెలంగాణ వారికి అవకాశం
  • విజయ సాయిరెడ్డిని కొనసాగించాలని జగన్‌ నిర్ణయం
  • మరొక సీటుకు పారిశ్రామికవేత్త బీద మస్తాన్‌రావు ఎంపిక
  • మస్తాన్‌ రావు, కృష్ణయ్య ఇద్దరూ టీడీపీ మాజీ ఎమ్మెల్యేలే


హైదరాబాద్‌, మే 17 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి సలహాదారులుగా తెలంగాణ వారికి పెద్దపీట వేసిన వైసీపీ.. ఇప్పుడు రాజ్యసభ అభ్యర్థులుగానూ ‘తెలంగాణ పెద్దల’నే ఎంపిక చేసింది! ఏపీలో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ సీట్లలో రెండింటిని తెలంగాణ వారికే కేటాయించింది. వీరిలో ఒకరు.. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య అయితే.. మరొకరు జగన్‌ అక్రమాస్తుల కేసులను వాదిస్తున్న హైకోర్టు న్యాయవాది నిరంజన్‌ రెడ్డి! వీరిలో ఆర్‌.కృష్ణయ్యను అనూహ్యంగా అదృష్టం వరించింది. ఇప్పుడు ఈ అంశం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఏపీలో నాలుగు రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న తన కుటుంబ కంపెనీల ఆడిటర్‌ విజయ సాయి రెడ్డిని మరోసారి పెద్దల సభలో కొనసాగించాలని జగన్‌ నిర్ణయించారు. ఇక, మరొక సీటును టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన పారిశ్రామికవేత్త బీద మస్తాన్‌ రావుకు కేటాయించారు. మిగిలిన రెండు సీట్లకు తెలంగాణ వారిని ఎంపిక చేశారు. ఏపీలో టీడీపీకి తొలి నుంచీ వెన్నుదన్నుగా ఉన్న బీసీలను ఆకర్షించడమే ధ్యేయంగా ఆర్‌.కృష్ణయ్యను జగన్‌ ఎంపిక చేశారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే, సొంత రాష్ట్రంలో బీసీలను వదిలి తెలంగాణ నుంచి ఆర్‌.కృష్ణయ్యను ఎంపిక చేయడం రెండు రాష్ట్రాల్లోనూ రాజకీయ వర్గాలను నివ్వెరపరిచింది. నిజానికి, ఎనిమిదేళ్ల కిందట 2014 ఎన్నికల్లో టీడీపీ ఆయనను తెలంగాణలో సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. అప్పట్లో ఆయన ఎల్బీ నగర్‌ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచారు కూడా. అయితే, ఎమ్మెల్యేగా ఆయన గెలిచినా, టీడీపీ ఓడిపోయింది.


2014-18 మధ్య కాలంలో టీడీపీ ఎమ్మెల్యేగా ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరైనా.. వైసీపీ ఏపీలో నిర్వహించిన బీసీ సదస్సుకు వెళ్లడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఆ తర్వాత, 2018 ఎన్నికల్లో కృష్ణయ్య మహా కూటమి తరఫున కాంగ్రెస్‌ అభ్యర్థిగా మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే, అప్పట్లో మహా కూటమిలో బీసీ సంఘం భాగస్వామి అని, దాని తరఫునే తాను ఎన్నికల్లో పోటీ చేశానని కృష్ణయ్య చెప్పారు కూడా.


ఏపీ సీఎంవో నుంచి సోమవారమే పిలుపు

ఏపీ సీఎంవో నుంచి కృష్ణయ్యకు సోమవారమే పిలుపు వచ్చింది. అదే రోజు రాత్రి ఆయన విజయవాడ చేరుకున్నారు. రాజ్యసభ అభ్యర్థిగా మంగళవారం ఏపీ సీఎం జగన్‌ ఆయనను ప్రకటించారు. అయితే, దివంగత సీఎం వైఎస్‌తో ఉన్న సాన్నిహిత్యం కృష్ణయ్యకు ఇప్పుడు కలిసి వచ్చిందని ఆయన అనుచరులు చెబుతున్నారు. బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంటు, వారికి గురుకుల పాఠశాలల కోసం చేసిన డిమాండ్‌లను వైఎస్‌ ఆనాడు ఆమోదించారని గుర్తు చేస్తున్నారు. అప్పటి నుంచే జగన్‌తో కూడా సాన్నిహిత్యం ఏర్పడిందని చెబుతున్నారు. 


అక్రమాస్తుల కేసుల్లో న్యాయవాదిగా...

నిర్మల్‌ జిల్లాకు చెందిన నిరంజన్‌ రెడ్డి తెలంగాణ హైకోర్టులో గుర్తింపు పొందిన (డిజిగ్నేటెడ్‌) సీనియర్‌ న్యాయవాది. సుప్రీం కోర్టు న్యాయవాదిగానూ ఆయన వ్యవహరిస్తున్నారు. జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన కేసుల్లో 2011 నుంచి  నిరంజన్‌ రెడ్డి జగన్‌ తరఫు న్యాయవాదిగా పనిచేస్తున్నారు. హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టు ఇలా వివిధ స్థాయిల్లో జగన్‌ తరఫున న్యాయవాదిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1970 జూలై 22న వ్యవసాయ కుటుంబంలో జన్మించిన నిరంజన్‌ రెడ్డి..  పుణెలోని సింబయాసిస్‌ లా కాలేజీలో ఐదేళ్ల లా కోర్సు పూర్తి చేశారు. ఉమ్మడి ఏపీ హైకోర్టులో సీనియర్‌ న్యాయవాదులు ఒ.మనోహర్‌రెడ్డి, కె.ప్రతాప్‌ రెడ్డి వద్ద జూనియర్‌గా పనిచేశారు. 2016లో ఉమ్మడి ఏపీ హైకోర్టు ఆయనకు సీనియర్‌ న్యాయవాది హోదాను కల్పించింది.  తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల తరఫున పలు కేసుల్లో స్పెషల్‌ సీనియర్‌ కౌన్సిల్‌గా సేవలందించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా ఆయనను నియమించారు కూడా. ఇక, నిరంజన్‌రెడ్డి సినీ నిర్మాత కూడా. సినీనటులు చిరంజీవి, రాంచరణ్‌ నటించిన ‘ఆచార’ సినిమాకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. ఘాజీ, క్షణం, వైల్డ్‌డాగ్‌ వంటి చిత్రాలనూ నిర్మించారు.


నన్ను ఏ పార్టీ గుర్తించలేదు: ఆర్‌.కృష్ణయ్య

రాజ్యసభకు ఎంపిక చేసినందుకు సీఎం జగన్మోహన్‌ రెడ్డికి ఆర్‌.కృష్ణయ్య కృతజ్ఞతలు తెలిపారు. ‘‘దాదాపు 47 ఏళ్లుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల కోసం పోరాడుతున్నాను. నన్ను ఏ రాజకీయ పార్టీ గుర్తించలేదు. ఒకవేళ గుర్తించినా అవకాశం ఇవ్వడానికి భయపడ్డారు. కానీ.. నా సేవ, నిబద్ధత, అంకితభావాన్ని  జగన్‌ గుర్తించారు’’ అని ఆయన తెలిపారు. ఇది తనకు లభించిన గుర్తింపుగా భావించడం లేదని, బీసీల పోరాటాలకు లభించిన గుర్తింపుగా భావిస్తున్నట్లు ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో చెప్పారు. వికారాబాద్‌ జిల్లా మొయిన్‌పేట మండలం రాళ్లడుగుపల్లికి చెందిన కృష్ణయ్య, విద్యార్థి దశ నుంచే ఉద్యమ నేతగా గుర్తింపు పొందారు.  


అలీకి ప్రస్తుతానికి నిరాశ

‘తీపి కబురు’ కోసం ఎదురు చూస్తున్న సినీ నటుడు అలీకి మరోసారి నిరాశ ఎదురైంది. రాజ్యసభ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలు జరగనున్న సందర్భంలో ఇటీవల తాడేప్గల్లిలోని క్యాంపు కార్యాలయంలో జగన్‌ను అలీ కుటుంబ సభ్యులతో సహా కలిశారు. త్వరలోనే వైసీపీ కార్యాలయం నుంచి తీపి కబురు వస్తుందని సీఎం చెప్పారని అలీ వెల్లడించారు. దీంతో... ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఖాయమైనట్లేనని అంతా భావించారు. కానీ... అలీకి ఆ అవకాశం దక్కలేదు. మైనారిటీ వర్గానికి చెందిన వారెవరికీ చాన్స్‌ లభించలేదు.

Updated Date - 2022-05-18T08:55:34+05:30 IST