మిడత వాలితే మటాష్‌!

ABN , First Publish Date - 2020-05-29T08:06:33+05:30 IST

కరోనా మహమ్మారితో పండిన పంటకు సరైన ధర లేక బక్కచిక్కిపోయిన రైతాంగానికి మిడతల దండు రూపంలో మరో విపత్తు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

మిడత వాలితే మటాష్‌!

  • పచ్చటి పొలాలను నమిలేసే మిడతలు
  • దండుగా వాలితే ఏ పంటైనా నాశనమే
  • వేప సంబంధ మందులే శరణ్యం
  • సామూహిక చర్యలతోనే నిర్మూలన
  • అగ్రి వర్సిటీ ఎంటమాలజీ హెడ్‌ కృష్ణయ్య

అమరావతి, మే 28 (ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారితో పండిన పంటకు సరైన ధర లేక బక్కచిక్కిపోయిన రైతాంగానికి మిడతల దండు రూపంలో మరో విపత్తు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. లోకాస్ట్‌ అనే ఎడారి మిడతల దండు ఇప్పటికే రాజస్థాన్‌, గుజరాత్‌, హరియాణా, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రల్లో తమ ప్రతాపాన్ని చూపాయి. ఆ దండు ఇటు కూడా వచ్చేస్తోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటల్ని కాపాడుకునేందుకు రైతులు ముందుగానే సంసిద్ధం కావాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎంటమాలజీ విభాగం హెడ్‌ డాక్టర్‌ పీవీ కృష్ణయ్య అన్నారు. గురువారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. 


మిడతల దండు గతంలోనూ ఇటుగా వచ్చిందా? 

మన రాష్ట్రానికిగానీ దక్షిణాదికి గానీ గతంలో ఎప్పుడూ రాలేదు. లోకాస్ట్‌ ప్లేగ్‌ అనే మిడతల దండు ఎడారి ప్రాంతాల్లో 1962-97 వరకు 25 సార్లు వచ్చింది. తర్వాత అప్పుడప్పుడు పాక్‌-భారత్‌ సరిహద్దు రాష్ట్రాలకు వస్తుంటాయి. ఈసారి గతం కంటే 400% అధికంగా ఉన్నట్లు భారత ఆహార, వ్యవసాయశాఖ అంచనా వేసింది.  


అవి మన ప్రాంతంలో లేవా? 

మన ప్రాంతంలోనే మామూలు మిడతలు కొద్దిగా ఉంటాయి. వాటిని గ్రాసాఫర్స్‌ అంటాం. వీటితో పెద్దగా ప్రమాదం లేదు. ఇవి పంట అనే కాదు.. ఏది పచ్చగా కన్పిస్తే వాటిని గుంపుగా పండి నమిలిపారేస్తాయి.


వాటితోపాటు అంటువ్యాధులు ఏమైనా వస్తాయా?

ఫంగస్‌, వాసన రావచ్చు. ఆస్త్మా, ఎలర్జీ రోగులకు ఇబ్బంది కలగొచ్చు. కానీ నేరుగా ప్రమాదమని శాస్త్రీయంగా నిర్ధారణ కాలేదు.

 

వీటి నిర్మూలనకు ఏ చర్యలు తీసుకోవాలి? 

ఒకరిద్దరు రైతులు, ఒక గ్రామంలో తీసుకునే చర్యలు నిరుపయోగం. లోకాస్ట్‌ వార్మింగ్‌ ఆర్గనైజేషన్‌ సూచనల ప్రకారం సామూహిక చర్యలు చేపట్టాలి. మొక్కలు, చెట్లపై వేప సంబంధ మందులను పిచికారి చేయాలి. తుఫాన్‌ సమాచారం మాదిరిగానే వీటి గమనాన్ని గమనిస్తుండాలి. 


రసాయన మందులు వాడొచ్చా? 

రసాయన మందులు ఆఖరి చర్యగానే ఉంటే మంచిది. ఐసీఏఆర్‌, వ్యవసాయశాఖ సూచనలు పాటించాలి. కోట్లు, లక్షల సంఖ్యలో జంతువులను చుట్టుముడితే వాటికి కొద్దిగా ఇబ్బంది కలగొచ్చు. మనుషులకైనా ఎక్కువగా చుట్టిముడితే ఎలర్జీ వంటి సమస్యలు రావచ్చు. అయినా పొలాల్లోకి, రోడ్లపై వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం శ్రేయస్కరం. 

Updated Date - 2020-05-29T08:06:33+05:30 IST