జల విద్యుదుత్పత్తిపై గరంగరం

ABN , First Publish Date - 2021-09-02T08:11:33+05:30 IST

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాడీవేడిగా జరిగింది. శ్రీశైలంలో జల విద్యుదుత్పత్తే హాట్‌ టాపిక్‌గా మారింది. తెలుగు రాష్ట్రాల మధ్య వివాదానికి ప్రధాన కారణమైన శ్రీశైలం..

జల విద్యుదుత్పత్తిపై గరంగరం

  • శ్రీశైలంలో విద్యుదుత్పత్తిని ఆపాల్సిందే..
  • కృష్ణా బోర్డు ఆదేశం.. తెలంగాణ ఆగ్రహం
  • సమావేశం నుంచి రజత్‌కుమార్‌ వాకౌట్‌
  • బచావత్‌ ట్రైబ్యునల్‌ అవార్డు మేరకే ఉత్పత్తి
  • విద్యుదుత్పత్తిని ఆపే ప్రసక్తే లేదని స్పష్టీకరణ
  • 66:34 నిష్పత్తితో కృష్ణా జలాల 
  • పంపిణీకి తెలంగాణ, ఏపీ అంగీకారం
  • ఉదయం 11 నుంచి సాయంత్రం 6 దాకా భేటీ
  • గోదావరిపై మూడు ప్రాజెక్టుల 
  • సమగ్ర నివేదికలు అందించిన తెలంగాణ
  • గెజిట్‌ అమలు సాధ్యాసాధ్యాలపై ఉప కమిటీ
  • అధ్యయనం తర్వాతే సంస్థాగత నిర్మాణ 
  • నోటిఫికేషన్‌.. ఉమ్మడి బోర్డుల భేటీలో నిర్ణయం
  • అక్రమ నీటి తరలింపును అడ్డుకోవడంలో బోర్డు విఫలం: తెలంగాణ


బోర్డుల సమావేశంపై సీఎం కేసీఆర్‌ ఆరా

బోర్డుల సమావేశంలో తెలంగాణ వాదనలపై ఢిల్లీలో ఉన్న సీఎం కేసీఆర్‌ నిరంతరం ఆరా తీశారు. ఢిల్లీ నుంచే రజత్‌కుమార్‌కు దిశానిర్దేశం చేశారు. నెల రోజుల ముందు నుంచే తెలంగాణ వాదనలపై అధికారులకు స్పష్టం చేసిన ఆయన.. బుధవారం కూడా పర్యవేక్షిస్తూనే ఉన్నారు.


హైదరాబాద్‌, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాడీవేడిగా జరిగింది. శ్రీశైలంలో జల విద్యుదుత్పత్తే హాట్‌ టాపిక్‌గా మారింది. తెలుగు రాష్ట్రాల మధ్య వివాదానికి ప్రధాన కారణమైన శ్రీశైలం జలవిద్యుదుత్పత్తిపై ఏపీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. జలవిద్యుదుత్పత్తిని ఆపేయాలని కృష్ణా బోర్డు(కేఆర్‌ఎంబీ) స్పష్టం చేయగా.. తెలంగాణ ఆగ్రహం వ్యక్తం చేసింది. సమావేశం నుంచి వాకౌట్‌ చేసింది! కృష్ణా జలాలపై చర్చించడానికి గాను బుధవారం జలసౌధలో బోర్డు సమావేశం జరిగింది. బోర్డు చైర్మన్‌ మహేంద్ర ప్రతాప్‌ సింగ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ నుంచి నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌, ఈఎన్‌సీ సి.మురళీధర్‌రావు, ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఈఎన్‌సీ నారాయణరెడ్డితో పాటు ఇరు రాష్ట్రాల అధికారులు హాజరయ్యారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా వాడీవేడిగా ఈ సమావేశం జరిగింది.


శ్రీశైలంలో జలవిద్యుత్తును ఉత్పత్తి చేయడానికి వీల్లేదని ఏపీ పట్టుబట్టగా.. బచావత్‌ ట్రైబ్యునల్‌ ప్రకారమే ఉత్పత్తి చేస్తున్నామని, నాగార్జునసాగర్‌ పరిధిలో సాగు, తాగునీటి అవసరాలు తీర్చడానికే విద్యుదుత్పత్తి చేస్తున్నామని, ఎట్టి పరిస్థితుల్లోనూ నిలిపివేసే ప్రసక్తే లేదని తెలంగాణ స్పష్టం చేసింది. శ్రీశైలంలో జలవిద్యుదుత్పత్తితో 100 టీఎంసీల నీరు సముద్రంలో కలిసిందని, దీనికి తెలంగాణే కారణమని ఏపీ వాదించింది. బచావత్‌ ట్రైబ్యునల్‌ అవార్డు ప్రకారమే చేస్తున్నామని తెలంగాణ బదులిచ్చింది. ఈ క్రమంలో శ్రీశైలంలో తాము అనుమతిచ్చేదాకా విద్యుదుత్పత్తి చేయడానికి వీల్లేదని, వెంటనే నిలిపివేయాలని కేఆర్‌ఎంబీ ఆదేశించింది. ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ తెలంగాణ వాకౌట్‌ చేసింది. సమావేశంలో ఏపీ, కేఆర్‌ఎంబీ తీరును తీవ్రంగా తప్పుపట్టిన రజత్‌కుమార్‌.. ఉమ్మడి బోర్డు సమావేశం ముగిసే క్రమంలో కూడా జలవిద్యుత్తుపై అనవసర వాదనలు లేవనెత్తినా, పదే పదే అభ్యంతరాలు వ్యక్తం చేసినా ఇకపై బోర్డుల సమావేశానికి వచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 


తేలిన వాటా

ఆరునూరైనా కృష్ణా జలాల్లో 50:50 నిష్పత్తితో వాటా ఇవ్వాల్సిందేనని పట్టుబట్టిన తెలంగాణ, ఎట్టకేలకు 66:34 నిష్పత్తితో నీటిని పంచుకోవడానికి అంగీకరించింది. నీటి వాటా తేల్చే అధికారం తమకు లేదని, దీనిపై ట్రైబ్యునల్‌ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని కేఆర్‌ఎంబీ స్పష్టం చేయగా.. గత ఏడాది తీసుకున్న నిర్ణయమే ఈ నీటి సంవత్సరంలోనూ అమలు చేయడానికి తెలంగాణ అంగీకరించింది. ప్రస్తుత నీటి సంవత్సరంలో వాడుకోకుండా మిగిలిన జలాలను వచ్చే ఏడాదికి క్యారీ ఓవర్‌ చేయాలనే తెలంగాణ విజ్ఞప్తికి బోర్డు అంగీకరించలేదు. 


గెజిట్‌ అమలుపై ఉప కమిటీ

గోదావరి, కృష్ణా జలాలపై ఉన్న ప్రాజెక్టుల నిర్వహణ బోర్డులకు శిరోభారంగా మారుతుందని తెలంగాణ స్పష్టం చేసింది. స్థానికంగా పొలాలకు నీళ్లు కావాలని రైతులు కోరితే ఆ విజ్ఞప్తితో ఎమ్మెల్యేలు నివేదిస్తే ఏం నిర్ణయం తీసుకుంటారని? వాస్తవ స్థితిగతులపై అధ్యయనం చేసిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ సర్కారు గోదావరి, కృష్ణా బోర్డులను కోరింది. దాంతో గెజిట్‌ అమలు చేయడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడానికి వీలుగా రెండు బోర్డులు ఉప కమిటీ లు వేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. కృష్ణా బోర్డు సమావేశం అనంతరం ఉ మ్మడి బోర్డుల సమావేశం రాత్రి 9:30 గంటల దాకా జరిగింది. ఈ అంశంపై తెలంగాణ వాదనకు బోర్డు లు అంగీకారం తెలిపాయి. మరోవైపు బోర్డులు కమిటీ నివేదిక ఇచ్చాక ఇరు రాష్ట్రాలకు అందించనున్నాయి. ఆ తర్వాతే సంస్థాగత నిర్మాణం (ఆర్గనైజేషనల్‌ స్ట్రక్చర్‌)పై నోటిఫికేషన్‌ను వెలువరించనున్నాయి. ఇక గెజిట్‌ అమలుకు సహకరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.


గోదావరి బోర్డుకు మూడు డీపీఆర్‌లు 

కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మూడో టీఎంసీ తరలిం పు పథకంతో పాటు సీతారామ, తుపాకులగూడెం ప్రా జెక్టుల సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)లను రాష్ట్ర అధికారులు ఈ సమావేశంలో గోదావరి బోర్డుకు సమర్పించారు. గెజిట్‌లో గోదావరిపై రాష్ట్రంలో 10 ప్రాజెక్టు లు ఆమోదంలేని జాబితాలో ఉండగా.. అందులో కీలకమైన మూడు ప్రాజెక్టుల డీపీఆర్‌లు అందించారు. ఇక మరో నాలుగు ప్రాజెక్టులను పరిగణనలోకి తీసుకోరాదని, మూడు ప్రాజెక్టుల్లోనే ఇవీ భాగమని గుర్తు చేశా రు. మిగిలిన మూడు ప్రాజెక్టులు (చనాఖా-కొరాటా, మొండికుంటవాగుతో పాటు మరో ప్రాజెక్టు) డీపీఆర్‌లు త్వరలోనే అందిస్తామని అధికారులు తెలిపారు.


50:50 నిష్పత్తితో నీటిని కేటాయించాలి: తెలంగాణ లేఖ

బ్రిజే్‌షకుమార్‌ ట్రైబ్యునల్‌ ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేసేదాకా తాత్కాలిక పద్ధతిలో కృష్ణా జలాలను 50:50 నిష్పత్తితో తెలుగు రాష్ట్రాలకు పంచాలని రజత్‌కుమార్‌కు కృష్ణా బోర్డుకు లేఖను అందించా రు. 2018 నుంచే 50:50 నిష్పత్తిలో నీటి పంపిణీ జ రగాలని డిమాండ్‌ చేస్తున్నామని గుర్తుచేశారు. తాగునీటికి కేటాయించిన నీటి లో 20 శాతాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని ట్రైబ్యునల్‌ తీర్పులు ఉన్నాయని తెలిపా రు. ‘మైనర్‌ ఇరిగేషన్‌ కోసం కేటాయించిన 90.833 టీఎంసీల్లో వాస్తవ వినియో గం 48.833 టీఎంసీలే. మిగిలిన 42 టీఎంసీలను ఇతర ప్రాజెక్టుల అవసరాల కోసం వినియోగించుకుంటున్నాం. శ్రీశైలం లో జల విద్యుదుత్పత్తి ద్వారా 180 టీఎంసీలను నాగార్జునసాగర్‌కు పంపాల్సిన అవసరం ఉంది’ అని పేర్కొన్నారు.  


66:34 నిష్పత్తికి అంగీకారం 

ప్రస్తుత నీటి సంవత్సరంలోనూ 66:34 నిష్పత్తిలో జలాల పంపిణీకి అంగీకారం కుదిరింది. శ్రీశైలం జలవిద్యుదుత్పత్తితో 100 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిశాయి. ప్రకాశం బ్యారేజీ తర్వాత నీటిని నిల్వ చేయడానికి అవకాశమే లేదు. ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండిన తర్వాతే జలవిద్యుత్తును ఉత్పత్తి చేయాలని బోర్డును కోరాం. దీనికి బోర్డు అంగీకరించింది. విద్యుదుత్పత్తిని ఆపాలని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో ఆరు ప్రాజెక్టులకు రక్షణ కల్పించారు. అందులో నాలుగు ఏపీకి చెందినవి, రెండు తెలంగాణకు చెందినవి. అయితే వెలిగొండకు ఆ రక్షణ లేకుండా గెజిట్‌ ఇచ్చారు. దీనిపై అభ్యంతరం తెలుపుతూ కేంద్రానికి లేఖ రాశాం. 

 శ్యామలరావు, ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శి


నేడు ఢిల్లీకి అధికారులు

గెజిట్‌తో పాటు అనుమతి లేని ప్రాజెక్టులకు అనుమతి, కొత్త ట్రైబ్యునల్‌ అంశాలపై కేంద్ర జలశక్తి మంత్రికి వినతిపత్రాన్ని అందించడానికి గురువారం నీటిపారుదల శాఖ అధికారుల బృందం ఢిల్లీ వెళ్లనుంది. కృష్ణా బోర్డు చైర్మన్‌ తీరుపైనా ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం.


కేఆర్‌ఎంబీ వైఫల్యం కృష్ణా జలాలను బేసిన్‌ అవతలికి తరలించకుండా అడ్డుకోవడంలో కేఆర్‌ఎంబీ విఫలమైంది. కృష్ణా జలాలను 50:50 నిష్పత్తితో కేటాయించాలని సమావేశంలో కోరాం. బ్రిజే్‌షకుమార్‌ ట్రైబ్యునల్‌లో కేసు ఉన్నందున గత ఏడాది ఏ నిష్పత్తితో (66:34) నీటిని పంచుకున్నామో అదే నిష్పత్తితో కేటాయింపులకు నిర్ణయం తీసుకున్నాం. ఎస్‌ఎల్‌బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలో మంజూ రై పూర్తయ్యాయి. ఆ ప్రాజెక్టులను అనుమతి లేని జాబితాలో పెట్టి, నిలిపివేయాలని కోరడమేంటి?  బచావత్‌ ట్రైబ్యునల్‌ ప్రకారమే శ్రీశైలంలో జలవిద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నాం. జలవిద్యుత్తును ఆపే ప్రసక్తే లేదు. గోదావరిలో నికర జలాల కేటాయింపులున్నందున ఆ నదిపై ఉన్న ప్రాజెక్టుల డీపీఆర్‌లన్నీ సమర్పిస్తున్నాం. కృష్ణాపై కూడా త్వరలో ప్రాజెక్టుల డీపీఆర్‌లు అందిస్తాం. తుపాకులగూడెం లో అంతర్భాగంగా రామప్ప-పాకాల లింకు ఉంది. కడెం టెయిల్‌ఎండ్‌ కోసం ప్రతిపాదించిన ప్రాజెక్టును అనుమతి లేని జాబితాలో పెట్టారు. ఆ ప్రాజెక్టులపై అనుమానాలు నివృత్తి చేశాం. మిగులు జ లాలు లెక్కించాలని కోరగా బోర్డు అంగీకరించింది. 

రజత్‌కుమార్‌, తెలంగాణ సాగునీటి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి


ఢిల్లీకి 3 సాగునీటి పథకాల డీపీఆర్‌లు

నేడు కేంద్ర మంత్రికి అందించనున్న సీఎం కేసీఆర్‌

గోదావరి నదిపై ఉన్న మూడు సాగు నీటి ప్రాజెక్టుల సవివర నివేదిక (డీపీఆర్‌)లను గురువారం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌కు సమర్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాళేశ్వరం అదనపు టీఎంసీ, సీతారామ, తుపాకులగూడెం డీపీఆర్‌లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ గురువారం ప్రత్యేక విమానంలో ఢిల్లీ తీసుకెళ్తారు. అనంతరం సీఎం కేసీఆర్‌.. వాటిని కేంద్రమంత్రికి అందించనున్నారు. ఇప్పటికే గోదావరి బోర్డుకు ఈ డీపీఆర్‌లను తెలంగాణ సమర్పించింది. కాగా, కృష్ణా, గోదావరి ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తెస్తూ నిర్ణయం తీసుకున్న కేంద్రం..  గోదావరి పరిధిలో 10 ప్రాజెక్టులు అనుమతి లేని జాబితాలో  చేర్చగా.. ప్రస్తుతం మూడింటి డీపీఆర్‌లను ప్రభుత్వం సమర్పించనుంది.

Updated Date - 2021-09-02T08:11:33+05:30 IST