కృష్ణా బోర్డు తీరు అభ్యంతరకరం!

ABN , First Publish Date - 2022-05-17T10:32:25+05:30 IST

రాజోలిబండ మళ్లింపు పథకం(ఆర్డీఎస్‌) వ్యవహారంలో కృష్ణానదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) తీరుపై తెలంగాణ ఆగ్రహంగా ఉంది.

కృష్ణా బోర్డు తీరు అభ్యంతరకరం!

  • ఆర్డీఎస్‌ అధ్యయన నిబంధనలపై తెలంగాణ ఆగ్రహం
  • సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌ స్టడీ టర్మ్‌ అండ్‌ రిఫరెన్స్‌పై నారాజ్‌


హైదరాబాద్‌, మే 16 (ఆంధ్రజ్యోతి): రాజోలిబండ మళ్లింపు పథకం(ఆర్డీఎస్‌) వ్యవహారంలో కృష్ణానదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) తీరుపై తెలంగాణ ఆగ్రహంగా ఉంది. కేంద్ర జల, విద్యుత్‌ పరిశోధన కేంద్రం (సీడబ్ల్యూపీఆర్‌ఎ్‌స)తో అధ్యయనం కోసం ఇచ్చిన టర్మ్స్‌ అండ్‌ రిఫరెన్స్‌(టీవోఆర్‌)పై తెలంగాణ నారాజ్‌గా ఉంది. ఆర్డీఎస్‌ నుంచి నీళ్లు రాకపోవడానికి కారణాలేంటో చెప్పాలని తాము కోరుతుంటే.. కేసీ(కర్నూలు, కడప) కెనాల్‌కు తుంగభద్ర నుంచి నీళ్లు రావడం లేదనే ఏపీ అభ్యంతరాలను తీసుకొని అధ్యయనానికి సిఫారసు చేయడమేంటని తప్పుపడుతోంది. ఏపీ అధీనంలో ఉన్న ఆర్డీఎస్‌ ఆనకట్ట నుంచి తెలంగాణకు 15.9 టీఎంసీలు, కర్ణాటకకు 1.2 టీఎంసీల నీటి కేటాయింపులు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆర్డీఎస్‌ హెడ్‌రెగ్యులేటర్‌ వద్ద 850 క్యూసెక్కుల నీరు విడుదల కావడం లేదనేది తెలంగాణకు ఉన్న ప్రధాన అభ్యంతరం. ఆర్డీఎస్‌ వద్ద 850 క్యూసెక్కులు విడుదలై.. మధ్యలో కర్ణాటక తనవంతు 1.2 టీఎంసీలు వాడుకున్నాక 42.60 కిలోమీటర్ల వద్ద (తెలంగాణకు నీళ్లిచ్చే ప్రాంతం ప్రారంభమయ్యే చోట) కెనాల్‌లో 770 క్యూసెక్కుల నీరు విడుదల కావాల్సి ఉంటుంది. అలా విడుదలైతేనే తమ వాటా మేరకు 15.9 టీఎంసీలు తమకు వస్తాయని తెలంగాణ పదే పదే గుర్తు చేస్తోంది. అయితే ఆర్డీఎస్‌ ఆనకట్ట కుడివైపు ఒక షట్టర్‌ను గతంలో పేల్చివేయగా.. ఇతర షట్టర్‌లు పూర్తిస్థాయిలో కాకుండా పైభాగంలో కొంత మేర తెరిచి ఉండటాన్ని తెలంగాణ తప్పుపడుతోంది. అయితే ఈ వివాదాన్ని పరిష్కరించడానికి వీలుగా సీడబ్ల్యూపీఆర్‌ఎ్‌సతో అధ్యయనం చేయించి.. ఆర్నెల్లలోపు నివేదిక తెప్పించుకొని, ముందుకెళ్లాలని యోచిస్తోంది. అయితే అధ్యయనం కోసం ఇచ్చిన టర్మ్స్‌ అండ్‌ రిఫరెన్స్‌లపై తెలంగాణ ఆగ్రహంతో ఉంది. కేసీ కెనాల్‌కు తుంగభద్ర నుంచి నీళ్లు రావడం లేదనే ఏపీ అభ్యంతరాలపై అధ్యయనానికి సిఫారసు చేయడాన్ని తప్పుపడుతోంది. 


తెలంగాణ విజ్ఞప్తులు ఇవీ.

ఆర్డీఎస్‌ ఆధునికీకరణ చేపట్టాలి. ఎఫ్‌ఎ్‌సఎల్‌ (పూర్తి సరఫరా స్థాయి) ప్రకారం కట్టకు క్రస్ట్‌ గేట్లు పెట్టాలి. 

వాటా ప్రకారం 15.9 టీఎంసీల నీటిని వాడుకునే విధంగా ఆర్డీఎస్‌ ఆనకట్ట ఎత్తును పెంచాలి. 

బచావత్‌ ట్రైబ్యునల్‌ అవార్డు ప్రకారం 31.9 టీఎంసీల కన్నా ఎక్కువ నీటిని కేసీ కెనాల్‌కు తరలించకుండా అడ్డుకోవాలి. 

కృష్ణా జలాలను తరలించే మల్యాల, ముచ్చుమర్రి, ఎస్కేప్‌ చానల్‌ కేసీ కెనాల్‌ ద్వారా తరలించకుండా అడ్డుకోవాలి. 

ఏపీవైపున ఉన్న షట్టర్లను పూర్తిగాపెట్టాలి. కట్ట అడుగుభాగంలోని స్ట్రక్చరల్‌ స్లూయి్‌సను మూసేయాలి. 

Updated Date - 2022-05-17T10:32:25+05:30 IST