కొవ్వాడలోనే అణువిద్యుత్‌ ప్రాజెక్టు: కేంద్రం

ABN , First Publish Date - 2020-09-23T10:11:33+05:30 IST

శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో అణువిద్యుత్‌ ప్రాజెక్టు ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు ఉన్నమాట నిజమేనని కేంద్ర ప్రజా ఫిర్యాదుల శాఖ మంత్రి జితేందర్‌సింగ్‌ వెల్లడించారు.

కొవ్వాడలోనే అణువిద్యుత్‌ ప్రాజెక్టు: కేంద్రం

న్యూఢిల్లీ, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో అణువిద్యుత్‌ ప్రాజెక్టు ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు ఉన్నమాట నిజమేనని కేంద్ర ప్రజా ఫిర్యాదుల శాఖ మంత్రి జితేందర్‌సింగ్‌ వెల్లడించారు. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన ప్రశ్నకు మంగళవారం రాజ్యసభలో లిఖితపూర్వక జవాబిచ్చారు. ఈ ప్రాజెక్టు ఏర్పాటుపై అమెరికా కంపెనీ మెస్సర్స్‌ వెస్టింగ్‌ హౌస్‌ ఎలక్ర్టిక్‌ కార్పొరేషన్‌తో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. ఏపీలోని గ్రామపంచాయతీలకు భారత్‌ నెట్‌ ద్వారా బ్రాడ్‌ బ్యాండ్‌ సౌకర్యాన్ని దశలవారీగా కల్పించనున్నట్లు కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి సంజయ్‌ ధోత్రే వెల్లడించారు.


విశాఖకు ‘క్యాట్‌’ బెంచి, ట్రిపుల్‌ఐటీ ఇవ్వండి: సాయిరెడ్డి

విశాఖపట్నంలో సెంట్రల్‌ అడ్మినిస్ర్టేటివ్‌ ట్రైబ్యునల్‌(క్యాట్‌) బెంచిని ఏర్పాటు చేయాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర న్యాయశాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం రాజ్యసభ జీరో అవర్‌లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. విశాఖలో ట్రిపుల్‌ ఐటీని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో ఫోరెన్సిక్‌ వర్సిటీ ఏర్పాటును పరిశీలించాలని కోరారు. 


పీఎంఏవై కింద ఏపీకి 8,013 కోట్లు విడుదల

ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన(పట్టణ) కింద గత ఆరేళ్లలో ఏపీలో 3 లక్షల 46 వేల ఇళ్లను నిర్మించినట్టు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి వెల్లడించారు. 2015-16 నుంచి ఇప్పటి వరకు ఈ పథకం కింద రాష్ట్రానికి రూ.30,540.2 కోట్లు మంజూరు చేశామని, దీనిలో రూ.8013.65 కోట్లు విడుదల చేశామని వివరించారు. విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను ప్రైవేటీకరించే ప్రతిపాదనలు లేవని పౌర విమానయాన మంత్రి హర్దీప్‌ సింగ్‌ లోక్‌సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌కు తెలియజేశారు.


సీబీఐ విచారణంటే భయం ఎందుకు: వైసీపీ

అమరావతి భూములు, ఫైబర్‌నెట్‌ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తును కోరుతుంటే.. టీడీపీ నేతలకు ఎందుకంత భయమని వైసీపీ ఎంపీలు బ్రహ్మానందరెడ్డి, తలారి రంగయ్య ధ్వజమెత్తారు. మంగళవారం పార్లమెంటు ప్రాంగణంలో వారు మీడియాతో మాట్లాడారు.

Updated Date - 2020-09-23T10:11:33+05:30 IST