కొవాగ్జిన్‌ రెండో డోసు బంద్‌..

ABN , First Publish Date - 2021-05-17T09:06:27+05:30 IST

రాష్ట్రంలో కొవాగ్జిన్‌ రెండో డోసు పంపిణీని ప్రభుత్వం నిలిపివేసింది. నిల్వ తగినంత లేదని..

కొవాగ్జిన్‌ రెండో డోసు బంద్‌..

కొవాగ్జిన్‌ రెండో డోసు బంద్‌

హైదరాబాద్‌, మే 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొవాగ్జిన్‌ రెండో డోసు పంపిణీని ప్రభుత్వం నిలిపివేసింది. నిల్వ తగినంత లేదని.. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కొత్తగా స్టాక్‌ రానందున 45 ఏళ్లు పైబడినవారికి కొవాగ్జిన్‌ మలి డోసు పంపిణీని ఆపివేస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం తెలిపింది. మళ్లీ ఎప్పుడు ప్రారంభించేదీ తర్వాత తెలియజేస్తామని పేర్కొంది. రాష్ట్రంలో శని, ఆదివారాలు వ్యాక్సినేషన్‌ సాగలేదు. సోమవారం నుంచి పునఃప్రారంభం కావాల్సి ఉంది. మరోవైపు కొవాగ్జిన్‌ పంపిణీ నిలిచిపోవడంతో.. కొవిషీల్డ్‌ మొదటి డోసు తీసుకున్నవారికి రెండో డోసు పంపిణీ మాత్రమే కొనసాగనున్నట్లు స్పష్టమవుతోంది. తెలంగాణ వద్ద ఇంకా 6.93 లక్షల డోసులున్నాయని కేంద్రం లెక్కలు చెబుతున్నాయి. శనివారం నాటికి రాష్ట్రాలకు 20 కోట్లపైగా డోసులను కేటాయించినట్లు కేంద్రం తెలిపింది. ఇందులో తెలంగాణకు 61.41 లక్షల డోసులు ఇచ్చినట్లు పేర్కొంది. కాగా, తెలంగాణ ప్రభుత్వం 54.47 లక్షల డోసుల ను (వృథాతో కలిపి) వినియోగించింది. ఇలా చూస్తే రాష్ట్రంలో 6.94 లక్షల డోసులు ఉన్నట్లు. కొవాగ్జిన్‌ తగినంత స్టాక్‌ లేని కారణంగా పంపిణీ నిలిపివేశామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు ఉన్న స్టాక్‌ అంతా కొవిషీల్డ్‌గానే పరిగణించాల్సి వస్తోంది.


తెలంగాణకు 70 వేల రెమ్‌డెసివర్‌ వయల్స్‌

కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు 70 వేల రెమ్‌డెసివిర్‌ వయల్స్‌ కేటాయించింది. సోమవారం నుంచి ఈ నెల 23 వరకు పంపిణీ చేయనుంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఆదివారం ట్విటర్‌లో వెల్లడించారు. తెలంగాణకు మొత్తం 2.15 లక్షలు కేటాయించినట్లు వివరించారు. ఏప్రిల్‌ 21 నుంచి ఈ నెల 23 మధ్య 76 లక్షల వయల్స్‌ పంపిణీ లక్ష్యంలో.. తాజాగా తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలకు కేంద్రం 23 లక్షల వయల్స్‌ను పంపనుంది. కాగా, రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్ల కొరత రాష్ట్రంలో అధికంగా ఉంది. బ్లాక్‌ మార్కెట్‌లో అధిక ధరకు విక్రయిస్తున్నారు. పోలీసులు పలుచోట్ల కేసులు నమోదు చేశారు. కేంద్రం తాజా కేటాయింపుతో ఈ దందాకు అడ్డుకట్ట పడే అవకాశాలున్నాయి.

Updated Date - 2021-05-17T09:06:27+05:30 IST