Advertisement
Advertisement
Abn logo
Advertisement

కిలో కోత్తిమీర.. రూ.400

పంజాబ్‌, మహారాష్ట్ర నుంచి దిగుమతి   

పెరిగిన టమాట, పుదీనా రేటు  

భగ్గుమంటున్న కూరగాయలు.. 

వర్షాలతో పంటలు దెబ్బతిని రెట్టింపైన ధర

ఇబ్బందుల్లో సామాన్యులు, పేదలు


మహబూబాబాద్‌ టౌన్‌, అక్టోబరు 24 : కూరగాయల ధరలు మండుతున్నాయి. పేదలు, సామాన్యులు రేట్లను చూసి, హడలెత్తిపోతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు రాష్ట్రంతోపాటు.. మానుకోట జిల్లాలో కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. పూదీనా, కొత్తిమీర వేయగా పాడైపోయాయి. దీంతో వాటిని ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటుండడంతో అమాంతం  ధరలు రెట్టింపయ్యాయి. 

   

అలాగే పెట్రోల్‌, డిజీల్‌, గ్యాస్‌ ధరలు దినదినం పెరుగుతోండడం.. దీనికి తోడు వరుసవానలు ఆకుకూరలు, కూరగాయల పంటలకు తీవ్రనష్టం జరిగింది. పెట్రో ధరలపెంపు కూడా కూరగాయల ప్రభావం పడుతోంది. కాగా, స్థానికంగా కూరగాయలు లభించకపోవడంతో.. ఇతర ప్రాంతాల నుంచి వ్యాపారులు తేవడంతో.. ఈ భారం పేదలు, మధ్యతరగతి వారిపై పడుతోంది. అన్నింట్లో ఉపయోగించే టమాట, ప్రతీ కూరలోనే వేసే కొత్తిమీరను ప్రజలు విరివిగా మినియోగిస్తుంటారు. ఇవి రెండులేకుండా కూర ఉండదేమో అంటే అతిశయోక్తి కాదేమో! అందుకే వీటి వాడకం పెరగడంతో వినియోగదారులకు ధరల చుక్కలు చూపిస్తున్నాయి.


ఈ నేపథ్యంలో అన్నింటి ధరలు రెట్టింపు కాగా, పూదీన కిలో రూ. 100 ధర పలుకుతుండగా, ఇక కొత్తిమీరను మందలించేటట్టు లేదు. దీని ధర ఒకప్పుడు కిలో రూ. 30 ఇప్పుడు రూ. 400కు చేరుకుంది. దీంతో కూరగాయాలు కొనుగోలు చేసే సామాన్యులు ధరలు అందుబాటులో లేకుండాపోయి.. దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఇప్పటికే అన్నింటి ధరలు పెరుగుతూ ఆర్థిక భారం పడుతుంటే మరోపక్క నిత్యం వినియోగంలో ఉండే కూరగాయాల ధరలు సైతం అందకుండా పోయి మరింత భారం పడుతోందని చెప్పక తప్పదు.


పంజాబ్‌, మహారాష్ట్ర నుంచి దిగుమతి..

ఇటీవల కురిసిన వర్షాలతో మహబూబాబాద్‌ జిల్లా ప్రాంతంలో కూరగాయల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో కూరగాయల రేట్లకు రెక్కలొచ్చాయి. కొత్తిమీర, పూదీన మాత్రం ఇక్కడ పంట తక్కువగా ఉండడంతో ఇతర రాష్ట్రాలైన పంజాబ్‌, మహారాష్ట్ర నుంచి వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు. అక్కడి నుంచి విమానాల్లో హైదరాబాద్‌కుఆపై నేరుగా మహబూబాబాద్‌కు దిగుమతి చేసుకుని విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో ట్రావెలింగ్‌ (రవాణా) చార్జీలతో కలిపి ధరలు మండిపోతున్నాయి. ఎన్నడులేని విధంగా కొత్తిమీర ధర కిలో రూ.400 పలుకుతోంది. చికెన్‌ కిలో ధర కూడ అంతగా లేదంటే అతిశయోక్తి కాదు. కిలో చికెన్‌ ధర రూ.240 ఉంటే కొత్తిమీర ధర అంతకంటే ఎక్కువనా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఇక మటన్‌ ధరకు చేరువలో ఉందని చెప్పవచ్చు.


డబుల్‌ అయిన కూరగాయల ధరలు..

వర్షాల కుదుపుతో కూరగాయాల పంటలు దెబ్బతినడంతో ధరలు ఆకాశన్నంటుతున్నాయి. గతంలో ఉన్న ధరలు సరిగ్గా డబుల్‌ అయ్యాయి. ఇక్కడ పంటలు దెబ్బతినడంతో ఇతర ప్రాంతాల నుంచి కూరగాయలను దిగుమతులు చేసుకుంటున్నారు. గతంలో టమాట కిలో రూ. 20 ఉంటే ప్రస్తుతం రూ.40కి చేరుకుంది. ఇలా చిక్కుడుకాయ, క్యాబేజీ, దొండకాయ గతంలో రూ.20 ఉంటే ప్రస్తుతం రూ.40, మిర్చి, కాకరకాయ రూ.30కి బదులు రూ. 60కి చేరుకోగా, టమాట రూ. 10 ఉండగా అది రూ.30 నుంచి 40 ఽధరల పలుకుతోంది. భారీ వర్షాల దెబ్బ అన్నదాతలకే కాదు.. ఇటు వినియోగారులపై కూడ పడిందని చెప్పవచ్చు. మొత్తానికి అన్నింటి ధరలతో పాటు నిత్యం వంట చేసుకునే కూరగాయల ధరలు పెరిగి సామన్యుడిపై మరింత ఆర్థిక భారం పడుతోంది.


దూరప్రాంతాల నుంచి తేవడం వల్లే.. : మేదరిమెట్ల వెంకట్రావు, కూరగాయల వ్యాపారి, మానుకోట 

ఇటీవల కురిసిన వర్షాలతో పంటలు దెబ్బతిని కూరగాయల ధరలు పెరిగిపోయాయి. పంజాబ్‌, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల నుంచి కోతిమీరా, పూదీనాను దిగుమతి చేసుకోవడం వల్ల రవాణాచార్జీలతో ధరలు రెట్టింపు అయ్యా యి. దీంతో ధరలు అమాంతం పెరిగాయి. కూరగాయల ధరలు కూడ డబుల్‌ అయ్యాయి.


ధరల పెంపుతో ఆర్థిక భారం... : మందుల భారతి, గృహిణి, నడివాడ, మహబూబాబాద్‌ 

కూరగాయల ధరల పెంపుతో పేదలపై ఆర్థిక భారం పడుతోంది. అన్నింటి ధరలు రెట్టింపు కావడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజానీకానికి మోయలేని భారంగా మారింది. ఓ పక్క నిత్యావసర సరుకులతో పాటు వంటగ్యాస్‌, ప్రస్తుతం కూరగాయల ధరలు కూడ భగ్గుమంటున్నాయి. దీంతో ఏమి కోనాలో.. ఏం తినాలో అర్థంకానీ పరిస్థితి నెలకొంది. 

Advertisement
Advertisement