Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

ప్రపంచ తత్త్వాల పారంగతుడు

twitter-iconwatsapp-iconfb-icon
ప్రపంచ తత్త్వాల పారంగతుడు

ఆచార్య సచ్చిదానందమూర్తి జీవితం, తత్త్వశాస్త్రం రెండు పెనవేసుకుపోయిన విషయాలని భావించవచ్చు. దానికి కారణం ఆయనకు ఊహ తెలిసినప్పటి నుంచీ తండ్రి వీరభద్రయ్య ఏర్పరుచుకున్న ఇంటి గ్రంథాలయంలోని పురాణేతిహాసాలు, వివిధ మతగ్రంథాలు, అభ్యుదయ భావాలు గల పుస్తకాలతో పరిచయం ఏర్పడటమే. ఆయన నిరంతర అధ్యయనాభిలాష కొనసాగటానికి కారణం తల్లిదండ్రులైన రత్నమాంబ, వీరభద్రయ్యలే ప్రధాన కారకులు. ఆయన వారికి ఏకైక సంతానం. అధ్యయనం మినహా ఇతర వ్యాపకాలపట్ల వ్యామోహం లేకపోవడంతో జ్ఞానసంచయం పట్ల ఆచార్య మూర్తి జిజ్ఞాస బాల్యంలోనే సంపూర్ణంగా వికసించిందని చెప్పవచ్చు. వారిది వ్యవసాయాధారిత కుటుంబం. అప్పటివారు నిరాడంబర, సరళ జీవనానికి అత్యంత ప్రాధాన్యమిచ్చేవారు. విలువలతో కూడిన జీవితం వారిది. తమకున్న దానితో సంతృప్తికర జీవితం గడిపేవారు. ఆధ్యాత్మిక భావనలు ఉన్నప్పటికీ ఛాందసులు కాదు. ఇవి సచ్చిదానందమూర్తికి అలవడిన వారసత్వయోగ్యతలుగా పేర్కొనవచ్చు.


సచ్చిదానందమూర్తి తండ్రి వీరభద్రయ్యకు సంస్కృతం పట్ల మక్కువ ఎక్కువ. అడపాదడపా రచనలు చేసేవారు. సచ్చిదానందమూర్తి అక్షరాభ్యాసం అయిదవ ఏట సంస్కృతంతో ప్రారంభమయింది. దాదాపు పది సంవత్సరాలు దానిని నిరంతరంగా శివయ్య శాస్త్రి, పల్లెపూర్ణ ప్రజ్ఞాచార్యుల ఆచార్యత్వంలో కొనసాగించారు. అప్పటికే ఆయన వేదాలు, ఉపనిషత్తులు, షడ్దర్శనాలలోని లోతులకు వెళ్ళగలిగారు. వలసవాద రాజ్యంగా అణగారిపోయిన భారతదేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వ సంపద విలువలను సంస్కృత విద్యాభ్యాసం ద్వారా తన కుమారుడు నేర్చుకోవాలనేది వీరభద్రయ్య సంకల్పం. సంస్కృత విద్యాభ్యాసం ఆయనలో శాస్త్రీయతకు దగ్గరదారి, వివేచనకు పునాదులు ఏర్పరచింది.


సంస్కృత విద్యాభ్యాసంతో పాటు హిందీ కూడా అభ్యసించి, ఆచార్యమూర్తి 12వ ఏటకే విశారదలో ఉత్తీర్ణులైనారు. ఆచార్య మూర్తికి ఆంగ్లభాషతో పరిచయం 7 సంవత్సరాల ప్రాయంలో కలిగింది. ఆ తరువాత ఆ భాషపై మక్కువ ఏర్పరుచుకోవడంతో పాటు, అచిరకాలంలోనే తెలుగు భాషపై కూడా పట్టు సాధించారు. పాఠశాల, కాలేజీ విద్యాభ్యాసం గుంటూరు హిందూ కళాశాలల్లో కొనసాగించారు. ఈ విద్యాభ్యాసం కొనసాగుతున్న సమయంలోనే ఆయన 14వ ఏట హనుమద్విజయం, 16వ ఏట శ్రీమద్భగవద్గీత వ్యాఖ్యానం రాశారు. భగవద్గీతను అద్వైతపరంగానూ, సాంఖ్య జ్ఞాన, భక్తి, కర్మలలోని నిష్కామకర్మకు అధిక ప్రాధాన్యాన్ని కల్పించారు. అదేవిధంగా ఆ తరువాత వెలువరించిన ఈశోపనిషత్తు అనువాదంలో కూడా నిగూఢతతో కూడిన అధిభౌతిక చింతనను చూడవచ్చు. సచ్చిదానందమూర్తి విద్యావిషయక జీవనగమనం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వికాసం చెందిందని చెప్పవచ్చు. అక్కడ పనిచేస్తున్నప్పుడే చరిత్ర, మానసిక, సామాజిక, మానవ శాస్త్రాలను విస్తృతంగా స్వాధ్యయనం చేశారు. వాటితో పాటు క్రైస్తవ ధర్మశాస్త్రవేత్తలతో పరిచయం, మధ్యయుగ తత్త్వప్రావీణ్యులైన ఆన్‌స్లెమ్‌, బోన్‌వెంచురా, ఆక్వినాస్‌ వంటి పాశ్చాత్య రచయితల రచనలను కూడా అధ్యయనం చేశారు. ప్రపంచవ్యాప్తంగా తత్త్వశాస్త్రంలో సంభవిస్తున్న పరిణామాలను కూడా ఆయన ఎప్పటికప్పుడు ఆకళింపుచేసుకునే వారు.


తాను తత్త్వవేత్తను కానని, అనేక దేశాలలో అనేక రూపాలలో వ్యక్తమవుతున్న తాత్త్విక చింతనల అధ్యయనం వల్ల తత్త్వశాస్త్ర సమస్యలపట్ల లోతైన అవగాహనకు అవకాశం ఏర్పడి, ఆ దిశగా తత్త్వశాస్త్ర సమస్యల పరిష్కారానికి కృషిచేసే ప్రయత్నశీలినేనని ఆచార్య సచ్చిదానందమూర్తి చెప్పుకున్నారు. పాశ్చాత్య, ప్రాచ్య ఇస్లామిక్‌, జపనీస్‌, చైనీస్‌ తత్త్వాలలో ఆయనకు ప్రగాఢమైన పాండిత్యం ఉంది. ఆయన రచనలు వైవిధ్యభరితంగానూ, సూక్ష్మ వివరణలతోనూ కూడి ఉంటాయి. తత్త్వశాస్త్ర అంశాలతో పాటు ఇండియన్‌ ఫారిన్‌ పాలసీ; ద క్వెస్ట్‌ ఫర్‌ పీస్‌; జనరల్‌ ఎడ్యుకేషన్‌ రీ కన్సిడర్డ్‌; ఎథిక్స్‌, ఎడ్యుకేషన్‌, ఇండియన్‌ యూనిటీ అండ్‌ కల్చరల్‌ వంటి గ్రంథాలకు సంపాదకత్వం వహించడమో లేదా రచించడమో చేశారు.


‘అనేక ప్రభావాల పరంపరల కారణంగానే నా చిత్తం సంపర్కమైపోయిందని. అయినా తాను వాటిలో ఏ ఒక వ్యవస్థకో, సిద్ధాంతానికో అనుయాయిని కాదని’ ఆచార్య సచ్చిదానందమూర్తి తెలిపారు. తత్త్వశాస్త్ర లక్ష్యాల గురించి ఫ్రాంక్‌ఫర్ట్‌ నుంచి వెలువడే ‘తత్త్వేత్తలు’ అనే తత్త్వశాస్త్ర పత్రికలో సచ్చిదానందమూర్తి రాసిన ఒక వ్యాసం ఆయన చింతనను అర్థం చేసుకునేందుకు తోడ్పడుతుందని చెప్పవచ్చు. ఆయన తర్కించిన అంశాలు: (1) సామాన్య, శాస్త్రీయ విజ్ఞానాలకు అంతు


బట్టని యథార్థతను లేదా బ్రహ్మన్‌ను తెలుసుకోవడం ద్వారా అధిమానవ అస్తిత్వాన్ని అర్థవంతం చేసుకోవడానికి అవసరమైన జ్ఞానం అందుకోవడానికి దోహదపడుతుందా? (2) ప్రాచీనకాలం నుంచి వస్తున్న భావజాలాలను, విశ్వాసాలను, విలువలను హేతుపూర్వకంగా పరీక్షించి వ్యాఖ్యానించడం ద్వారా వాటిని సంస్కరించటానికి లేదా మరో నూతన దృక్పథాన్ని అవలంబించటానికి తోడ్పడుతుందా? (3) మానవులందరూ సమానులేననే నిర్ణయానికి చేరుకోవటానికి తత్త్వశాస్త్రం ఎంతవరకు దోహదపడుతుంది? (4) వ్యక్తిగత, సామూహిక విశ్వప్రవర్తనల సహేతుకతను పరిశీలించి సమైక్యం కావించటానికి తత్త్వశాస్త్రం ఏవిధంగా సహకరిస్తుందా? ఈ నాలుగు ప్రశ్నలు ఆయన తాత్విక చింతన లక్ష్యాలుగా అర్థం చేసుకోవచ్చు. ఆచార్య మూర్తి రచనల విస్తృత నిడివిని పరిగణనలోనికి తీసుకున్నట్లయితే ఆయన సావధానత ప్రధానంగా పై సంశ్లిష్టతలపై ఆధారపడి ఉంటుందనేది స్పష్టమవుతుంది.


ఆచార్య సచ్చిదానందమూర్తి 1950 దశకంలో పలు దేశాలలో పర్యటించి ప్రముఖ దార్శనికులతో సమావేశమయ్యారు. బెర్ట్రాండ్‌ రస్సెల్‌తో సమావేశమైనపుడు, వారిరువురు మానవుని నాగరికత, సంస్కృతులను కాపాడుకోవడం ఎలాగ అనే వాటిపై సమాలోచనలు చేశారు. అలాగే మనోవిజ్ఞాన శాస్త్రాన్ని మతం, కవిత్వం, స్వప్నాలతో విశ్లేషించిన కార్ల్‌ యాంగ్‌, ప్రసిద్ధ గణితాత్మక తర్కవేత్త అయిన బోహిన్‌స్కీని కలిశారు. ప్రసిద్ధ తత్త్వవేత్తలైన మూర్‌, కారల్‌ జాస్పర్స్‌ వంటివారితోనూ ప్రభావితమయ్యారు. రెండవ ప్రపంచయుద్ధ కాలం వరకూ ప్రాచీన భారతీయతత్త్వాలను సమకాలీన పరిస్థితులకు అన్వయింపచేసేవారు. ఆ తరువాతనే మిగతా సామాజిక శాస్త్రాలతోపాటు, విజ్ఞానశాస్త్రాల ప్రభావం కూడా తత్త్వశాస్త్ర రచనలలో కనబడుతుంది. అదే తీరు ఆచార్య మూర్తి రచనలలో కూడా ప్రస్ఫుటమయిందని మనం గుర్తించగలం. ఇంకో ముఖ్యవిషయం ఈనాడు సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను తార్కికంగా ఆలోచించటం కూడా ఆచార్య మూర్తి రచనలలో గోచరమౌవుతుంది. తాను రచించిన ‘ఇవల్యూషన్‌ ఆఫ్‌ ఫిలాసఫీ ఇన్‌ ఇండియా’ అనే గ్రంథంలో ఆయన ఈ విధంగా పేర్కొన్నారు, ‘నా ఆలోచన వేదాంతంలోనూ, అలాగే కొంతవరకు బుద్ధుని బోధనలలోనూ పాదుకొని ఉన్నప్పటికీ సమకాలీన తత్త్వశాస్త్ర పరిస్థితి గురించి కూడా నాకు తెలుసు. అస్తిత్వవాద రచనలతో ప్రభావితం అయ్యాను. చివరిపరిణామం మాత్రం వేదాంతను పునర్‌వ్యాఖ్యానించడం కానీ, అస్తిత్వవాదాన్ని పునరారంభం చేయడం కానీ కాదు. మానసిక, సాంస్కృతిక మానవశాస్త్రాల ప్రభావంతో భాషాసంబంధశాస్త్ర పాఠాలు మరవకుండా అవకాశమున్న సంశ్లేషణకు కాదగిన భావధారను రూపొందించడం’’. బుద్ధునిపైన, ఆచార్య నాగార్జున పైన విస్తృత పరిశోధనలు చేసి పలు పరిశోధనాపత్రాలు, గ్రంథాలు ప్రచురించిన దర్శనాచార్యుడు ఆచార్య సచ్చిదానంద మూర్తి. బోధనపట్ల అపరిమిత నిబద్ధతతోనూ, విశ్వవిద్యాలయ నిర్వహణాపరంగానూ, రచనలలోనూ సృజనాత్మకతను కనబరచి అలనాటి తత్త్వవేత్తలలో ప్రాముఖ్యత సంతరించుకున్న విశిష్టుడు ఆచార్య సచ్చిదానందమూర్తి. యునెస్కో, కేంద్ర ప్రభుత్వ విద్యాసంబంధ కమిటీలలో ఛైర్మన్‌ లేదా సభ్యులుగా తత్త్వశాస్త్ర వికాసానికీ, విద్యావిషయకంగా మానవాభ్యుదయానికి ఆయన చేసిన సేవలు అనుపమానమైనవి.

మండలి బుద్ధప్రసాద్‌ 

(రేపు సచ్చిదానందమూర్తి వర్ధంతి)

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement

ప్రత్యేకంLatest News in Telugu మరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.