సురేఖ పోటీపై సర్వత్రా ఆసక్తి

ABN , First Publish Date - 2021-08-23T05:14:53+05:30 IST

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక బరిలో..

సురేఖ పోటీపై సర్వత్రా ఆసక్తి

హుజూరాబాద్‌ అభ్యర్థిగా ఖరారైనట్టు ప్రచారం

పరకాల, వరంగల్‌ తూర్పు కాంగ్రెస్‌ శ్రేణుల్లో అయోమయం


వరంగల్‌(ఆంధ్రజ్యోతి): హుజూరాబాద్‌ ఉప ఎన్నిక బరిలో కాంగ్రెస్‌ తరపున మాజీ మంత్రి కొండా సురేఖ నిలువనున్నారనే ప్రచారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. సురేఖ ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని శాయంపేట, పరకాల, వరంగల్‌ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయం విధితమే. వైఎస్‌ కేబినెట్‌లో ఆమె మంత్రిగా కూడా పనిచేశారు. రాజకీయాల్లో ఫైర్‌బ్రాండ్‌గా పేరుపొందిన సురేఖ పేరును హుజూరాబాద్‌ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్‌ అధిష్ఠానం పరిశీలిస్తున్నట్టు వస్తున్న వార్తలు ఆసక్తి రేపుతున్నాయి. ఇప్పటికే అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ తమ అభ్యర్థిగా తెలంగాణ ఉద్యమ విద్యార్థి నాయకుడు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ను ఖరారు చేయగా, బీజేపీ తరపున తాజా మాజీ ఎమెల్యే ఈటల రాజేందర్‌ ఇప్పటికే ప్రచారం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో హుజూరాబాద్‌ నియోజకవర్గానికి నాన్‌లోకల్‌ అయినప్పటికీ  కొండా సురేఖ పేరును టీపీసీసీ దాదాపుగా ఖరారు చేసి అధిష్ఠానం అనుమతి కోసం పంపినట్టు తెలిసింది. 


బలమైన నేతగా గుర్తింపు

ఉమ్మడి వరంగల్‌ జిల్లా రాజకీయాల్లో కొండా సురేఖకు బలమైన నాయకురాలిగా పేరు ఉంది. శాయంపేట, పరకాల, వరంగల్‌ తూర్పు నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలంగాణ ఉద్యమం సమయంలో టీఆర్‌ఎస్‌ పార్టీని దీటుగా ఎదుర్కొని గట్టి పోటీని ఇచ్చారు. రాష్ట్ర ఆవిర్భావ అనంతరం రాజకీయ పునరేకీకరణలో భాగంగా సురేఖ తనకు రాజకీయ జన్మనిచ్చిన కాంగ్రెస్‌ పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరారు. తనకు గట్టి పట్టున్న పరకాల నియోజకవర్గాన్ని వదిలి వరంగల్‌ తూర్పు నియోజకవర్గానికి షిఫ్ట్‌ అయ్యారు. దీంతో అక్కడి కొండా క్యాడర్‌ పరకాల టీఆర్‌ఎస్‌ పార్టీలో కలిసిపోయారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి కొందరు అనుచరులుగా చలామణి కాగా, మరికొందరు పేరుకు టీఆర్‌ఎస్‌లో చేరినా తమ నాయకుడు కొండానే అంటూ పరకాలలో తిరిగారు. 


2018 డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో వరంగల్‌ తూర్పు నుంచి టీఆర్‌ఎస్‌ రాకపోవడంతో తిరిగి కాంగ్రెస్‌లో చేరి పరకాల నుంచి పోటీచేసి ఓడిపోయారు. అప్పటి నుంచి పరకాల, వరంగల్‌ తూర్పు నియోజకవర్గాల్లో అడపాదడపా కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. ఈ క్రమంలో సురేఖ పేరును హుజూరాబాద్‌ కోసం పరిశీలిస్తున్నట్టు జరుగుతున్న ప్రచారం ఆమె అనుచరశ్రేణుల్లో కొంత అయోమయాన్ని సృష్టిస్తోంది. మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు వస్తాయని భావిస్తున్న నేపథ్యంలో ఆమె హుజూరాబాద్‌కు మారితే పరకాల, తూర్పు నియెజకవర్గాల్లో పార్టీకి నష్టమేనని వారంటున్నారు.  


కాగా, సురేఖ అభ్యర్థిత్వంపై టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం తనదైన లెక్కలు వేసుకుంటున్నట్టు తెలిసింది. కొండా సురేఖ సామాజిక వర్గం పద్మాశాలి కాగా, ఆమె భర్త మురళి సామాజికవర్గం మున్నూరుకాపు. ఇద్దరూ బీసీ నేతలే కావడంతో సురేఖ బరిలోకి దిగితే  ఈటలకు పడే బీసీ ఓట్లలో చీలిక వస్తుందని, అది టీఆర్‌ఎస్‌ బీసీ అభ్యర్థిగా ఉన్న గెల్లు శ్రీనివాస్‌కు ఉపయోగపడుతుందని వారు భావిస్తున్నట్టు సమాచారం. మరోవైపు సురేఖను అభ్యర్థిగా నిలబెడితే పద్మశాలి, మున్నూరుకాపు సామాజిక వర్గాల ఓట్లను గంపగుత్తగా కొల్లగొట్టవచ్చనే ప్లాన్‌లో  కాంగ్రెస్‌ పార్టీ ఉంది. సురేఖ పేరును ఏఐసీసీ ఖరారు చేయకముందే రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చలు జరుగుతుండటం విశేషం. అయితే తన అభ్యర్థిత్వంపై సురేఖ ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.

Updated Date - 2021-08-23T05:14:53+05:30 IST