కొత్త ట్రిబ్యునల్ వస్తే కొంప కొల్లేరే

ABN , First Publish Date - 2021-10-12T06:42:02+05:30 IST

నదీజలాల వివాదాల పరిష్కారంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలు వాదనలు చేస్తోంది. ఎదురు దెబ్బలు తిన్నా కింద పడ్డా తనదే పైచేయి అన్నట్లు వ్యవహరిస్తోంది. సకల ఆయుధాలను ప్రయోగిస్తోంది...

కొత్త ట్రిబ్యునల్ వస్తే కొంప కొల్లేరే

నదీజలాల వివాదాల పరిష్కారంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలు వాదనలు చేస్తోంది. ఎదురు దెబ్బలు తిన్నా కింద పడ్డా తనదే పైచేయి అన్నట్లు వ్యవహరిస్తోంది. సకల ఆయుధాలను ప్రయోగిస్తోంది. ట్రిబ్యునల్ తుది తీర్పు వచ్చేంత వరకు బోర్డుల పరిధి నోటిఫై చేయకూడదని ఏడేళ్ల కాలం మోకాలడ్డింది. తీరా అక్కడ విఫలమైన తర్వాత కూడా చట్టవిరుద్ధంగా నీటి పంపకం ఫిఫ్టీ ఫిఫ్టీ పద్ధతిలో ఉండాలని వాదించి తోక ముడిచింది. తొట్ట తొలుత పోతురెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ పనులను కోర్టు ద్వారా నిలువరించి తుదకు తాను అదే ఉచ్చులో పడింది. అప్పటికీ తన దాడి ఆపలేదు. కాగా కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు బోర్డు అధీనంలోనికి వెళ్లే క్రమంలో జూరాల ఉమ్మడి ప్రాజెక్టు కాదని మినహాయింపు పొంది, అదే సమయంలో పెన్నా బేసిన్‍ లోని బనకచర్ల క్రాస్ రెగ్యులేటరును బోర్డు అధీనంలోని వెళ్లునట్లు కృషి చేస్తోంది.


ఇప్పుడు తాజాగా మరో బ్రహ్మాస్త్రాన్ని ఆంధ్రప్రదేశ్‌కు వ్యతిరేకంగా సంధించేందుకు సిద్ధమౌతోంది. తెలంగాణ కోరుతున్నట్లు, 1956 అంతర్ రాష్ట్ర జల వివాద చట్టం సెక్షన్ 3 కింద, కృష్ణ నదీ జలాలను రెండు తెలుగు రాష్ట్రాల మధ్యనే పంపిణీ చేయటానికి కేంద్ర ప్రభుత్వం ట్రిబ్యునల్ నియమిస్తే ఆంధ్ర ప్రదేశ్‌కు అపార నష్టం జరుగుతుంది. ప్రధానంగా గొంతెండిపోతున్న రాయలసీమకు మరో మారు సరిదిద్దలేని అపకారం జరుగుతుంది. గోదావరి జలాలతో డెల్టా సరిపడితే మిగిలిన నీరు రాయలసీమకు తరలించే ప్రక్రియకు తెరపడుతుంది. ఇది కూడా మన స్వయంకృతాపరాధమే! అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనే తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనను గట్టిగా అడ్డుకొని ఉంటే ఇంత దాకా రాకపోదును.


గత సంవత్సరం అక్టోబరులో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యర్థన పైన కేంద్ర మంత్రి షెకావత్ స్పందిస్తూ సుప్రీంకోర్టులో ఉన్న కేసును ఉపసంహరించుకుంటే కొత్త ట్రిబ్యునల్ నియమిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ అంశంపై అభ్యంతరం వ్యక్తం చేసి అడ్డుకొని ఉండాల్సింది. వాస్తవంలో మినిట్స్ లో డిసెంట్ నోటు పెట్టి వుండాలి. అలా చేసివుంటే కేంద్ర మంత్రి షెకావత్ అంత ధారాళంగా తెలంగాణ ముఖ్యమంత్రికి హామీ ఇచ్చి ఉండేవారు కాదేమో. లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని జీతాలుగా తీసుకొంటూన్న అధికారులు, సలహాదారులు ఈ విషయంపై ముఖ్యమంత్రికి ఎందుకు ఫీడ్ బ్యాక్ ఇవ్వలేదు? రేపు కొత్త ట్రిబ్యునల్ ఏర్పడి ఆంధ్ర ప్రదేశ్‌కు జరగరాని నష్టం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? ఆ రోజు అపెక్స్ కౌన్సిలు సమావేశంలో ఏం జరిగిందీ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించాలి. 


ప్రస్తుతం బచావత్ ట్రిబ్యునల్ అవార్డు అమల్లో వుంది. బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తుది తీర్పును 2013లో ఇచ్చినప్పుడు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ తమకు తీవ్ర నష్టం కలుగుతుందని దానిపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసి స్టే తీసుకువచ్చింది. ఈ కేసు ఇంకా సుప్రీంకోర్టులోనే ఉంది. 


కాగా మరో వేపు రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 89 మేరకు విభజన నాటికి పంపకం కాని నీరు ఉంటే దాన్ని రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయాలని నీటి ఎద్దడి రోజుల్లో ప్రొటోకాల్‌ను నిర్ణయించే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునలుకు అప్పగించగా విచారణ జరుగుతోంది. ఇవన్నీ కాదని కేంద్ర ప్రభుత్వం మూడవ ట్రిబ్యునలును ఏవిధంగా నియమిస్తుంది? ఇందుకు న్యాయపరమైన ప్రాతిపదిక ఉంటుందా? 


అక్టోబర్ 5వ తేదీన సుప్రీంకోర్టులో తెలంగాణ వేసిన కేసు ఉపసంహరణకు ధర్మాసనం అనుమతి ఇస్తూ నీటి కేటాయింపులు చేయమని తాము కేంద్ర ప్రభుత్వానికి ఎట్టి ఆదేశాలు ఇవ్వడం లేదని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ధర్మాసనానికి ఉన్న న్యాయపరమైన పరిజ్ఞానం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి లేకపోవడం విచారకరమే. అంతే కాదు. ఈ సందర్భంలో తెలంగాణ అడ్వకేట్ తాము సుప్రీంకోర్టు నుంచి కేసు ఉపసంహరించుకుంటే కొత్తగా ట్రిబ్యునల్ నియామకం జరుగుతుందని అపెక్స్ కౌన్సిలు సమావేశంలో మినిట్స్ లో రికార్డ్ అయి వుందని ధర్మాసనం ముందు వివరించారు. అత్యంత కీలకమైన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో వాస్తవంలో ఏం జరిగిందన్నదీ, ఏపీ హక్కులు కాపాడేందుకు ఇప్పుడు మన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నదీ ఇప్పుడు వెల్లడించాలి.


తెలంగాణకు నీటి కేటాయింపుల్లో అన్యాయం జరిగి వుంటే అది బేసిన్ లోని అన్ని రాష్ట్రాల మధ్య నీటి పంపకం జరగినపుడే జరిగిందనీ, ఒక వేళ కొత్త ట్రిబ్యునలును నియమించాల్సి వస్తే అది బేసిన్ లోని అన్ని రాష్ట్రాల మధ్య నీటి పంపకాలకు సంబంధించి మాత్రమే నియమించాలని అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో మన వైపు నుంచి వాదన వినిపించి ఉండాల్సింది. అంతేకాదు బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు ఒకటి త్రిశంకు స్వర్గంలో ఉండగా దాని అతీగతీ తేలిన తర్వాత కదా మరో ట్రిబ్యునల్ గురించి ఆలోచించాలని కూడా అభ్యంతరం వ్యక్తం చేసి ఉండాల్సింది. మన వైపు నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయివుంటే కేంద్ర మంత్రి షెకావత్ కూడా అంత గట్టిగా తెలంగాణ ముఖ్యమంత్రికి హామీ ఇచ్చివుండే వారు కాదేమో. మన వైపు నుంచి ఏ అభ్యంతరం లేనందున తెలంగాణ రొట్టె విరిగి నేతిలో పడింది.


అంతేకాదు. అసలు అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఏం జరిగిందో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైపు నుంచి కించిత్తు సమాచారం వెల్లడికావడం లేదు. మరో వైపు సుప్రీంకోర్టు నుంచి తెలంగాణ కేసు ఉపసంహరణ జరిగిపోయింది. కేంద్ర జల శక్తి శాఖలో ఉన్న తెలంగాణ లాబీ కొత్త ట్రిబ్యునల్ నియామకం కోసం సకల యత్నాలు చేస్తుంది. నిజానికి అసలు అలాంటి లాబీనే ఏపీకి ఉన్నట్లు లేదు. ఇంత జరుగుతున్నా ట్రిబ్యునలు నియామకాన్ని వ్యతిరేకిస్తూ మన ప్రభుత్వం నుంచి ఇప్పటికైనా కేంద్ర జల శక్తి శాఖకు లేఖ వెళ్ళిన దాఖలా లేదు. గోదావరి కృష్ణ నదీ బోర్డుల పరిధి గురించి జరుగుతున్న చర్చల్లో ఆంధ్ర ప్రదేశ్ అధికారులు తలమునకలై ఉండగా, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వం కొత్త ట్రిబ్యునల్ నియామకం పైనే దృష్టి కేంద్రీకరిస్తూ నేరుగా ఏనుగు కుంభ స్థలంపైనే కొట్టే యత్నాల్లో ఉంది.


కొత్త ట్రిబ్యునలు నియామకం జరిగితే ఎంత నష్టం జరుగుతుందో ఒక ఉదాహరణ చాలు. ఈ నెల మొదటి వారంలో ఢిల్లీలో బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ సాగించింది. ఈ విచారణలో తెలంగాణ తరపున సాక్షిగా కేంద్ర సిడబ్ల్యూసి మాజీ చైర్మన్ ఘన్ శ్యామ్ ఝాను ఆంధ్ర ప్రదేశ్ లాయర్ క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. కృష్ణ డెల్టాకు సాగర్ పులిచింతల నుంచి నీరు అవసరం లేదనే వాదనను తెలంగాణ సాక్షి వినిపించారు. ఖరీఫ్ కాలంలో డెల్టాకు 131.73టియంసిలు రబీలో 20.4 టియంసిల చాలని, పోలవరం నుంచి 80 టియంసిలు పట్టిసీమ నుంచి 80 టియంసిలు సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు 75 టియంసిలు లభ్యమౌతాయని, కాబట్టి ఆ నీరు సరిపోతుందని తెలంగాణ సాక్షి ట్రిబ్యునల్ ముందు సాక్ష్యం చెప్పారు. అంటే ప్రస్తుతం బచావత్ ట్రిబ్యునల్ డెల్టాకు కేటాయించిన 150 టియంసిల నీరు ఇక అక్కర్లేదని, ఆ నీటిని తమకు కేటాయించమని తెలంగాణ అప్పుడే వాదన మొదలుపెట్టింది. అదే విధంగా కెసి కెనాలుకు ఎక్కువ కేటాయింపులు ఉన్నాయని ఇదివరకటి విచారణలో వాదించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఫల్యం వలన, లేదా కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష వైఖరి వలన కొత్త ట్రిబ్యునల్ నియామకం జరిగితే ఏమవుతుందన్న దానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. కేంద్రం సాహసించి ట్రిబ్యునల్ నియామకం చేస్తే ఆంధ్ర ప్రదేశ్ న్యాయ స్థానాలకు మొరపెట్టుకోవటం తప్ప మరో మార్గం లేదు. 

వి. శంకరయ్య

విశ్రాంత పాత్రికేయులు

Updated Date - 2021-10-12T06:42:02+05:30 IST