పంజాబ్‌.. బల్లే బల్లే

ABN , First Publish Date - 2021-05-01T09:04:49+05:30 IST

మొదట కేఎల్‌ రాహుల్‌ చివరి బంతి వరకు రాజీలేని పోరాటం.. ఆ తర్వాత బౌలర్ల క్రమశిక్షణాయుత బౌలింగ్‌.. వెరసి పంజాబ్‌ కింగ్స్‌కు అదిరిపోయే విజయం.

పంజాబ్‌.. బల్లే బల్లే

 రాహుల్‌ అర్ధసెంచరీ 

స్పిన్నర్‌ హర్‌ప్రీత్‌కు మూడు వికెట్లు బెంగళూరు చిత్తు

మొదట కేఎల్‌ రాహుల్‌ చివరి బంతి వరకు రాజీలేని పోరాటం.. ఆ తర్వాత బౌలర్ల క్రమశిక్షణాయుత బౌలింగ్‌.. వెరసి పంజాబ్‌ కింగ్స్‌కు అదిరిపోయే విజయం. ముఖ్యంగా స్పిన్నర్‌ హర్‌ప్రీత్‌ వరుస బంతుల్లో కోహ్లీ, మ్యాక్స్‌వెల్‌ను బౌల్డ్‌ చేయడంతో పాటు ఆ తర్వాత డివిల్లీర్స్‌నూ అవుట్‌ చేసి వహ్వా అనిపించాడు. యువ స్పిన్నర్‌ బిష్ణోయ్‌ కూడా ప్రభావం చూపడంతో ఆర్‌సీబీ ఏ దశలోనూ ఛేదన వైపు పయనించలేకపోయింది. 


అహ్మదాబాద్‌: పంజాబ్‌ కింగ్స్‌ ఆల్‌రౌండ్‌ షోతో మురిపించింది. శుక్రవారం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (57 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 91 నాటౌట్‌) వీరోచిత పోరాటంతో పంజాబ్‌ను ఆదుకోగా, ఆ తర్వాత స్పిన్నర్లు హర్‌ప్రీత్‌ బ్రార్‌ (4-1-19-3), రవి బిష్ణోయ్‌ (2/17) ఆర్‌సీబీని వణికించారు. మొదట పంజాబ్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 179 పరుగులు చేసింది. గేల్‌ (24 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 46), హర్‌ప్రీత్‌ బ్రార్‌ (17 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్సర్లతో 25 నాటౌట్‌) రాణించారు. జేమిసన్‌కు 2 వికెట్లు దక్కాయి. ఛేదనలో బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లకు 145 రన్స్‌కే పరిమితమైంది. విరాట్‌ కోహ్లీ (34 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 35), రజత్‌ పటీదార్‌ (30 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 31), హర్షల్‌ పటేల్‌ (13 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 31) మాత్రమే ఆకట్టుకున్నారు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా హర్‌ప్రీత్‌ బ్రార్‌ నిలిచాడు. 


బ్రార్‌ భయపెట్టాడు..:

ఛేదనలో బెంగళూరు మూడో ఓవర్‌లోనే ఓపెనర్‌ దేవ్‌దత్‌ పడిక్కళ్‌ (7) వికెట్‌ను కోల్పోయింది. రజత్‌ సహకారంతో కెప్టెన్‌ కోహ్లీ ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. పవర్‌ప్లేలో 36/1 స్కోరు సాధించిన ఆర్‌సీబీకి కోహ్లీ ఏడో ఓవర్‌లో ఓ సిక్సర్‌ అందించాడు. కానీ స్పిన్నర్లు బిష్ణోయ్‌, హర్‌ప్రీత్‌ బ్రార్‌ ఓవర్లలో పరుగులతో పాటు వికెట్లు కాపాడుకోలేక ఇబ్బందిపడ్డ ఆర్‌సీబీ.. తొలి 10 ఓవర్లలో 62 పరుగులే చేసింది. 11వ ఓవర్‌లో బ్రార్‌ ఆర్‌సీబీకి ఝలక్‌ ఇచ్చాడు. మెయిడిన్‌తో పాటు వరుస బంతుల్లో కోహ్లీ, మ్యాక్స్‌వెల్‌ (0)లను బౌల్డ్‌ చేశాడు. ఐపీఎల్‌లో అతడికివే తొలి రెండు వికెట్లు కావడం విశేషం. అంతేకాకుండా తన మరుసటి ఓవర్‌లోనే ప్రమాదకర డివిల్లీర్స్‌ (3)ను సైతం బోల్తా కొట్టించి ఈ మ్యాచ్‌ను చిరస్మరణీయం చేసుకున్నాడు. అటు కుదురుకున్న రజత్‌ 14వ ఓవర్‌లో 4,6 బాదినా ఎక్కువ సేపు నిలువలేకపోయాడు. చివరి 5 ఓవర్లలో 88 రన్స్‌ అవసరమవగా, అప్పటికే ఆర్‌సీబీ 5 వికెట్లు కోల్పోయింది. ఇక హర్షల్‌, జేమిసన్‌ (16 నాటౌట్‌) బౌండరీల జోరుతో చివరి 3 ఓవర్లలో 43 పరుగులు వచ్చినా లాభం లేకపోయింది. 


రాహుల్‌ అంతా తానై..:

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌ దిగిన పంజాబ్‌ ఇన్నింగ్స్‌ ఆద్యంతం రాహుల్‌ హవా కనిపించింది. తొలి ఐదు ఓవర్లలో ఓపెనర్‌ ప్రభ్‌సిమ్రన్‌ (7) వికెట్‌ కోల్పోయి 29 పరుగులే చేయగా, గేల్‌ ఒక్క ఓవర్‌లో పరిస్థితిని మార్చాడు. జేమిసన్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్‌లో గేల్‌ వరుసగా 4,4,4,4,0,4తో హోరెత్తించి 20 రన్స్‌ రాబట్టాడు. తర్వాతి ఓవర్‌లో రెండు సిక్సర్లతో చాహల్‌ను ఆడుకున్నాడు. అటు కెప్టెన్‌ రాహుల్‌ కూడా జోరు చూపిస్తూ 4,6 బాదాడు. ఈ ఇద్దరి ఆటతో జట్టు మొదటి 10 ఓవర్లలో 90 రన్స్‌ చేసింది. కానీ 11వ ఓవర్‌లో సామ్స్‌.. గేల్‌ వికెట్‌ తీయడంతో రెండో వికెట్‌కు 80 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇక ఎప్పటిలాగే పంజాబ్‌ మిడిలార్డర్‌ చెత్త ప్రదర్శన కనబరిచింది. నాలుగు ఓవర్ల వ్యవధిలోనే పూరన్‌ (0), దీపక్‌ హుడా (5), షారుక్‌ (0) వెనుదిరిగారు. అయితే రాహుల్‌ ఒంటరి పోరాటం చేస్తూ 35 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివర్లో హర్‌ప్రీత్‌ అండగా నిలిచాడు. 18వ ఓవర్‌లో హర్‌ప్రీత్‌ బ్రార్‌ 4,6.. రాహుల్‌ మరో ఫోర్‌తో 18 పరుగులు వచ్చాయి. చివరి ఓవర్‌లో రాహుల్‌ బ్యాట్‌ ఝుళిపిస్తూ 4,6,4 బాదగా ఆరో బంతిని బ్రార్‌ సిక్సర్‌గా మలచడంతో జట్టు 22 పరుగులు రాబట్టింది. ఆరో వికెట్‌కు అజేయంగా ఈ ఇద్దరి మధ్య 32 బంతుల్లో 61 పరుగులు జత చేరాయి. చెన్నైపై చివరి ఓవర్‌లో 37 పరుగులిచ్చిన పేసర్‌ హర్షల్‌.. ఈసారి ఆఖరి ఓవర్‌లో 22 పరుగులు సమర్పించుకున్నాడు.  


స్కోరుబోర్డు

పంజాబ్‌: రాహుల్‌ (నాటౌట్‌) 91; ప్రభ్‌సిమ్రన్‌ (సి) కోహ్లీ (బి) జేమిసన్‌ 7; గేల్‌ (సి) డివిల్లీర్స్‌ (బి) సామ్స్‌ 46; పూరన్‌ (సి) షాబాజ్‌ (బి) జేమిసన్‌ 0; హుడా (సి) రజత్‌ (బి) షాబాజ్‌ 5; షారుక్‌ (బి) చాహల్‌ 0; హర్‌ప్రీత్‌ (నాటౌట్‌) 25; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 20 ఓవర్లలో 179/5. వికెట్ల పతనం: 1-19, 2-99, 3-107, 4-117, 5-118. బౌలింగ్‌: సామ్స్‌ 4-0-24-1; సిరాజ్‌ 3-0-24-0; జేమిసన్‌ 3-0-32-2; చాహల్‌ 4-0-34-1; హర్షల్‌ 4-0-53-0; షాబాజ్‌ 2-0-11-1.


బెంగళూరు: కోహ్లీ (బి) హర్‌ప్రీత్‌ 35; పడిక్కళ్‌ (బి) మెరిడిత్‌ 7; పటిదార్‌ (సి) పూరన్‌ (బి) జోర్డాన్‌ 31; మ్యాక్స్‌వెల్‌ (బి) హర్‌ప్రీత్‌ 0; డివిల్లీర్స్‌ (సి) రాహుల్‌ (బి) హర్‌ప్రీత్‌ 3; షాబాజ్‌ (సి) హర్‌ప్రీత్‌ (బి) బిష్ణోయ్‌ 8; సామ్స్‌ (బి) బిష్ణోయ్‌ 3; జేమిసన్‌ (నాటౌట్‌) 16; హర్షల్‌ (సి) బిష్ణోయ్‌ (బి) షమి 31; సిరాజ్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: 20 ఓవర్లలో 145/8; వికెట్ల పతనం: 1-19, 2-62, 3-62, 4-69, 5-91, 6-96, 7-96, 8-144; బౌలింగ్‌: మెరిడిత్‌ 3.2-0-29-1; షమి 3.4-0-28-1; బిష్ణోయ్‌ 4-0-17-2; హర్‌ప్రీత్‌ 4-1-19-3; జోర్డాన్‌ 4-0-31-1; దీపక్‌ హుడా 1-0-13-0. 

Updated Date - 2021-05-01T09:04:49+05:30 IST