ప్రేక్షకుల సమక్షంలో ఐపీఎల్.. కేకేఆర్ కెప్టెన్, కోచ్ స్పందన ఇదే

ABN , First Publish Date - 2021-09-17T00:10:40+05:30 IST

భారత్‌లో కరోనా కారణంగా ఆగిపోయిన ఐపీఎల్ ఆదివారం (19వ తేదీ) నుంచి తిరిగి ప్రారంభం కాబోతోంది

ప్రేక్షకుల సమక్షంలో ఐపీఎల్.. కేకేఆర్ కెప్టెన్, కోచ్ స్పందన ఇదే

దుబాయ్: భారత్‌లో కరోనా కారణంగా ఆగిపోయిన ఐపీఎల్ ఆదివారం (19వ తేదీ) నుంచి తిరిగి ప్రారంభం కాబోతోంది. కరోనా కారణంగా ఇన్నాళ్లు ప్రేక్షకులు లేకుండా వెలవెలబోయిన మ్యాచ్‌లు మళ్లీ కళ సంతరించుకోనున్నాయి. కరోనాను దృష్టిలో పెట్టుకుని పరిమిత సంఖ్యలో ప్రేక్షకులను అనమతిస్తామని నిర్వాహకులు నిన్న (బుధవారం) ప్రకటించారు. యూఏఈ ప్రభుత్వ మార్గదర్శకాలు, కొవిడ్ ప్రొటోకాల్స్ పాటిస్తూ అబుదాబి, దుబాయ్, షార్జాలలో ప్రేక్షకులను అనుమతిస్తామని తెలిపారు.


చాలాకాలం తర్వాత ప్రేక్షకుల ముందు ఆడనుండడంపై కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, కోచ్ బ్రెండన్ మెకల్లమ్ స్పందించారు. ఆ ఊహే చాలా ఉద్వేగంగా ఉందని పేర్కొన్నారు. ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్ అభిమానులు కేరింతలు విని చాలా కాలమైందని మోర్గాన్ అన్నాడు. నిజానికి హోం గ్రౌండ్ కాకపోయినా వారి కేరింతలు వినడం కోసం ఇంకా వేచి ఉండలేనిని పేర్కొన్నాడు. 


కేకేఆర్ హెడ్‌కోచ్ బ్రెండన్ మెకల్లమ్ కూడా ప్రేక్షకులకు అనుమతి ఇవ్వడాన్ని స్వాగతించాడు. ప్రేక్షకులు స్టేడియానికి ఎప్పుడు వస్తారని ఇప్పటి వరకు మాట్లాడుకున్నామని, ఇప్పుడా రోజు రానే వచ్చిందని అన్నాడు. కేకేఆర్ అభిమానులతో స్టేడియాలు కిక్కిరిసిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశాడు. వారి మద్దతు తప్పకుండా తమకు ఉంటుందన్నాడు. రెండుసార్లు ఐపీఎల్ చాంపియన్ అయిన కేకేఆర్ ప్రస్తుతం నాలుగు పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. 

Updated Date - 2021-09-17T00:10:40+05:30 IST