కిళ్లీ కొట్టు కుర్రాడు.. పతకం పట్టేశాడు

ABN , First Publish Date - 2022-07-31T08:41:22+05:30 IST

కిళ్లీ కొట్టు కుర్రాడు సంకేత్‌ మహదేవ్‌ సర్గార్‌.. కామన్వెల్త్‌లో పతకంతో అదరగొట్టాడు.

కిళ్లీ కొట్టు కుర్రాడు.. పతకం పట్టేశాడు

కిళ్లీ కొట్టు కుర్రాడు సంకేత్‌ మహదేవ్‌ సర్గార్‌.. కామన్వెల్త్‌లో పతకంతో అదరగొట్టాడు. అధిక బరువు ఎత్తే ప్రయత్నంలో చేతికి గాయమైనా వెరవకుండా.. మరోసారి ప్రయత్నించాడు. అందులోనూ విఫలమైనా.. దేశానికి స్వర్ణం అందించాలనే అతడి తపనకు ప్రజలు జేజేలు పలుకుతున్నారు. మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాకు చెందిన లిఫ్టర్‌ సంకేత్‌ కుటుంబం పాన్‌షాప్‌తో పాటు హోటల్‌ నడుపుతోంది. చిన్నపాటి వ్యాపారంలో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూనే.. స్కూల్‌కు వెళ్లి, మిగిలిన సమయంలో ప్రాక్టీస్‌ చేసేవాడు సంకేత్‌. కష్టాలు ఎదురైనా.. ధైర్యంగా ఎదుర్కొంటూ.. దేశం గర్వించే లిఫ్టర్‌గా ఎదిగాడు. 


పేద కుటుంబం నుంచి..: సంకేత్‌ తండ్రి మహదేవ్‌కు ఆటలంటే ఆసక్తి. దీంతో కొడుకును ఆ దిశగా ప్రయత్నించాడు. మొదట్లో బండిపై పండ్లు అమ్మిన మహదేవ్‌.. సంకేత్‌ను ‘దిగ్విజయ్‌ వ్యాయామశాల’లో చేర్చాడు. 12 ఏళ్ల వయసులో శిక్షణ ఆరంభించిన సర్గార్‌.. అంచెలంచెలుగా కెరీర్‌లో ఎదిగాడు. అయితే, 


అతడిని ఈస్థాయికి తీసుకురావడానికి సంకేత్‌ తండ్రి కృషి ఎంతో ఉందని సంకేత్‌ చిన్ననాటి కోచ్‌ మయూర్‌ సిన్హాసనే చెప్పాడు. స్పాన్సర్లు లేకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా..అప్పుచేసి మరీ  కుమారుడి అవసరాలు తీర్చేవాడని తెలిపాడు. 2020లో కోల్‌కతాలో జరిగిన సీనియర్‌ నేషనల్స్‌లో స్వర్ణంతో గుర్తింపులోకి వచ్చాడు. తర్వాతి ఏడాది మరో బంగారు పతకం గెలిచాడు. కానీ, సంకేత్‌ పాన్‌ షాప్‌లో పని చేయడం మాత్రం మానలేదు.


అన్న బాటలో సోదరి..: సంకేత్‌ సోదరి కాజల్‌ కూడా అన్న బాటలో నడుస్తూ లిఫ్టింగ్‌లో ఎదగాలని చూస్తోంది. తన కొడుకు పతకం సాధించడంతో.. ఇన్నేళ్ల శ్రమకు తగిన ప్రతిఫలం దక్కిందని సంకేత్‌ తండ్రి మహదేవ్‌ ఆనందం వ్యక్తం చేశాడు. 

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)

Updated Date - 2022-07-31T08:41:22+05:30 IST