తిరుమలలో భక్తుడి కిడ్నాప్ కలకలం
ABN , First Publish Date - 2020-11-09T08:38:23+05:30 IST
తిరుమలలో ఆదివారం సాయంత్రం ఓ భక్తుడి కిడ్నాప్ కలకలం సృష్టించింది. కుటుంబీకుల సమాచారంతో పోలీసులు, టీటీడీ విజిలెన్స్ అధికారులు
అరగంటలోనే కిడ్నాపర్ల ఆటకట్టు
తిరుమల, (ఆంధ్రజ్యోతి): తిరుమలలో ఆదివారం సాయంత్రం ఓ భక్తుడి కిడ్నాప్ కలకలం సృష్టించింది. కుటుంబీకుల సమాచారంతో పోలీసులు, టీటీడీ విజిలెన్స్ అధికారులు అప్రమత్తమై కిడ్నాపర్లను అరగంటలోనే పట్టుకున్నారు. తిరుమల డీఎస్పీ ప్రభాకర్ కథనం మేరకు.. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన హనుమంతరావు ఆదివారం కుటుంబ సభ్యులతో శ్రీవారి దర్శనానికి వచ్చారు. దర్శనం ముగించుకుని ఎస్పీటీ అతిథిగృహానికి చేరుకోగానే.. నలుగురు వ్యక్తులు హనుమంతరావును బలవంతంగా ఓ కారులో ఎక్కించుకుని తిరుపతి వైపు దూసుకుపోయారు. దీన్ని గమనించిన కుటుంబీకులు కారు నంబరును పోలీసుల కు తెలియజేశారు.
పోలీసులు, టీటీడీ విజిలెన్స్ అధికారులు అప్రమత్తమై.. అలిపిరి చెక్‌పాయింట్ వద్ద కారును అడ్డుకున్నారు. అందులోని హనుమంతరావును రక్షించి.. కిడ్నా్‌పకు పాల్పడిన అనంతపురం జిల్లా పెనుగొండకు చెందిన శ్రీనివాస్, మారుతి, పుట్టపర్తికి చెందిన కుమార్, చిత్తూరుజిల్లా చౌడేపల్లెకు చెందిన సురే్‌షలను అదుపులోకి తీసుకున్నారు. పెనుగొండ కియా ప్లాంట్ ఎదుట క్యాటరింగ్ బిజినెస్ చేసేందుకు శ్రీనివాస్ వద్ద నుంచి రూ.20 లక్షలు తీసుకుని తిరిగి ఇవ్వక పోవడంతోనే కిడ్నాప్ చేసినట్లు దర్యాప్తులో తేలిందని డీఎస్పీ ప్రభాకర్ మీడియాకు తెలిపారు.