‘ఖేల్‌రత్న’లు నీరజ్‌, మిథాలీ

ABN , First Publish Date - 2021-11-14T08:54:48+05:30 IST

టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్‌ త్రో స్వర్ణంతో భారత పతాకాన్ని రెపరెపలాడించిన యువకెరటం నీరజ్‌ చోప్రా, వెటరన్‌ మహిళా క్రికెటర్‌ మిథాలీ రాజ్‌, ఫుట్‌బాలర్‌ సునీల్‌ ఛెత్రి ‘మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న’ అవార్డును.. ..

‘ఖేల్‌రత్న’లు నీరజ్‌, మిథాలీ

 ధవన్‌, భవానీకి అర్జున

వైభవంగా క్రీడా అవార్డుల ప్రదానం 

న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్‌ త్రో స్వర్ణంతో భారత పతాకాన్ని రెపరెపలాడించిన యువకెరటం నీరజ్‌ చోప్రా, వెటరన్‌ మహిళా క్రికెటర్‌ మిథాలీ రాజ్‌, ఫుట్‌బాలర్‌ సునీల్‌ ఛెత్రి  ‘మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న’ అవార్డును.. క్రికెటర్‌ శిఖర్‌ ధవన్‌, ఫెన్సర్‌ భవానీ దేవి, హాకీ ప్లేయర్‌ వందనా కటారియా ‘అర్జున’ అవార్డులను అందుకొన్నారు. శనివారం రాష్ట్రపతి భవన్‌లో వైభవంగా జరిగిన జాతీయ క్రీడా అవార్డుల కార్యక్రమంలో గతంలో ఎన్నడూ లేని విధంగా మొత్తం 12 మంది క్రీడాకారులకు ఖేల్‌రత్న, 35 మందికి అర్జున అవార్డులతోపాటు ద్రోణాచార్య, ధ్యాన్‌చంద్‌ జీవిత సాఫల్య పురస్కారాలను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రదానం చేశారు. 23 ఏళ్ల నీరజ్‌ చోప్రా ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అతడు అవార్డు స్వీకరిస్తున్నప్పుడు హాజరైన అతిథులంతా కరతాళ ధ్వనులతో అభినందించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర క్రీడామంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ప్రతి ఏడాది జాతీయ క్రీడా దినోత్సవం ఆగస్టు 29న క్రీడా అవార్డుల ప్రదాన కార్యక్రమం జరగడం ఆనవాయితీ. అయితే, ఒలింపిక్స్‌ కారణంగా వాయిదాపడ్డ ఆ వేడుకను ఇప్పుడు నిర్వహించారు. ఖేల్‌రత్న అవార్డు గ్రహీతకు రూ. 25 లక్షలు, పతకం, ప్రశంసాపత్రం.. అర్జున విజేతలకు రూ. 15 లక్షలు, ప్రశంసాపత్రం, జ్ఞాపికను అందజేశారు. 

Updated Date - 2021-11-14T08:54:48+05:30 IST