తెలంగాణ అటవీశాఖ పనితీరు భేష్: kerala forest అధికారులు

ABN , First Publish Date - 2022-05-28T22:07:09+05:30 IST

తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టిన పచ్చదనం పెంపు, అటవీ పునరుద్దరణ పనులు బాగున్నాయని కేరళ అటవీ శాఖ(kerala forest) అధికారులు కితాబునిచ్చారు.

తెలంగాణ అటవీశాఖ పనితీరు భేష్: kerala forest అధికారులు

 హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టిన పచ్చదనం పెంపు, అటవీ పునరుద్దరణ పనులు బాగున్నాయని కేరళ అటవీ శాఖ(kerala forest) అధికారులు కితాబునిచ్చారు. తెలంగాణలో రెండు రోజుల పాటు పర్యటించిన కేరళ ఐఎఫ్ఎస్ అధికారులు కీర్తి, మహమ్మద్ షాబాద్ వివిధ పచ్చదనం పెంపు కార్యక్రమాలను అధ్యయనం చేశారు. తెలంగాణకు హరితహారం,పట్టణ ప్రాంత అటవీ పార్కుల(అర్బన్ ఫారెస్ట్ పార్కులు) అభివృద్ది, అటవీ పునరుద్దరణ, అత్యున్నత ప్రమాణాలతో ఏర్పాటు చేసిన అటవీ కళాశాల, పరిశోధన సంస్థ చాలా బాగున్నాయని కేరళ అధికారులు అన్నారు. 


సిద్దిపేట జిల్లా ములుగు సెంట్రల్ నర్సరీతో పాటు, నర్సంపల్లి బ్లాక్ లో అటవీ పునరుద్దరణ, సింగాయపల్లిలో యాదాద్రి మోడల్ ప్లాంటేషన్, గజ్వేల్ పరిసరాల్లో అవెన్యూ ప్లాంటేషన్, కోమటిబండ మిషన్ భగీరథ ప్రాజెక్టు, పల్లె ప్రకృతి వనం, అర్బన్ ఫారెస్ట్ పార్కులను రెండు రోజుల పాటు కేరళ అధికారులు పరిశీలించారు. ముఖ్యంగా క్షీణించిన అటవీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మొక్కల నాటడం ద్వారా పరిరక్షించిన విధానం చాలా బాగుందని, అటవీ అధికారులు, సిబ్బంది పనితీరుకు నిదర్శనంగా నిలుస్తోందని కేరళ అధికారులు అభినందించారు.


ఔటర్ రింగు రోడ్డు వెంట పచ్చదనం పెంపు అద్భుతంగా ఉందన్నారు. అత్యున్నత ప్రమాణాలతో నెలకొల్పిన ఫారెస్ట్ కాలేజీ, రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ అటవీ విద్యను కొత్త పుంతలు తొక్కిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.కేరళ అధికారులు పర్యటనలో ముఖ్యమంత్రి ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, మెదక్ చీఫ్ కన్జర్వేటర్ శరవనన్, సిద్దిపేట జిల్లా అటవీ అధికారి శ్రీధర్, ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-05-28T22:07:09+05:30 IST