చెంగల్‌ మహా శివుడు

ABN , First Publish Date - 2020-11-20T05:54:40+05:30 IST

కార్తీక మాసం రాగానే శివాలయాలన్నీ భక్తజనసందోహంతో నిండిపోతాయి. దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాల నుంచి ఆంధ్ర రాష్ట్రంలోని పంచారామాలు, శ్రీశైలం, శ్రీకాళహస్తి, తెలంగాణలోని వేములవాడ, కొమరవెల్లి, కాళేశ్వరం, కీసరగుట్ట... ఇలా ప్రతి క్షేత్రంలో శివనామస్మరణ మిన్నంటుతుంది...

చెంగల్‌ మహా శివుడు

కార్తీక మాసం రాగానే శివాలయాలన్నీ భక్తజనసందోహంతో నిండిపోతాయి. దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాల నుంచి ఆంధ్ర రాష్ట్రంలోని పంచారామాలు, శ్రీశైలం, శ్రీకాళహస్తి, తెలంగాణలోని వేములవాడ, కొమరవెల్లి, కాళేశ్వరం, కీసరగుట్ట... ఇలా ప్రతి క్షేత్రంలో శివనామస్మరణ మిన్నంటుతుంది. అయితే కేరళలోని మహేశ్వరానికి మరెక్కడా లేని ప్రత్యేకత ఉంది. ప్రపంచంలోనే అతి పెద్ద శివలింగం అక్కడ కొలువుతీరింది.


కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం సమీపంలో ఉన్న  చెంగల్‌ గ్రామంలో శివపార్వతుల ఆలయం సుప్రసిద్ధం. ఆ ఆలయ ప్రాంగణంలో 111 అడుగుల ఎత్తులో నిర్మించిన శివలింగం ఇప్పుడు భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. రూ. పదికోట్ల రూపాయలతో చేపట్టిన ఈ శివలింగం నిర్మాణం 2012లో ప్రారంభమై, ఆరేళ్ళ తరువాత పూర్తయింది. అరవై అయిదు చదరపు అడుగుల విస్తీర్ణంలో... ఎనిమిది అంతస్థుల్లో నిర్మితమైన ఈ శివలింగానికి ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. దీనిలో నూట ఎనిమిది చిన్న శివలింగాలను ప్రతిష్ఠించారు. అరనైనాలుగు శివరూపాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి. అలాగే ఒక అంతస్థులో కైలాసాన్ని పునఃసృష్టించారు. ఈ శివలింగం నిర్మాణం కోసం ధనుష్కోటి, గోముఖం, కాశీ, బదరీనాథ్‌, రామేశ్వరం, గంగోత్రి, రుషీకేశ్‌ తదితర పవిత్ర ప్రదేశాల నుంచి నీటిని, మట్టినీ తీసుకువచ్చారు. ఆలయం ఆవరణలో భక్తులు ధ్యానం చేసుకోవడానికి మంటపాలను కూడా ఏర్పాటు చేశారు. మహాశివరాత్రికి శివపార్వతుల ఆలయంలో విశేష పూజలను నిర్వహిస్తారు. అలాగే కార్తీకమాసంలో కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఈ ఆలయానికి తరలివస్తారు. కర్ణాటకలోని కోలార్‌ జిల్లాలో ఉన్న కోటిలింగేశ్వర ఆలయంలో శివలింగం ఎత్తు 108 అడుగులు. దానికన్నా ఎత్తుగా నిర్మించిన చెంగల్‌ మహేశ్వరం శివలింగం ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్ట్స్‌, ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లోకి ఎక్కింది.

Updated Date - 2020-11-20T05:54:40+05:30 IST