కొడుకుని సీఎం చేయాలనే కేసీఆర్‌ తపన

ABN , First Publish Date - 2022-07-04T08:33:57+05:30 IST

తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా బీజేపీ అధికారంలోకి వచ్చి తీరుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అన్నారు.

కొడుకుని సీఎం చేయాలనే కేసీఆర్‌ తపన

  • ఇక సచివాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు
  • ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీజేపీదే అధికారం
  • బీజేపీ విజయ సంకల్ప సభలో అమిత్‌షా


హైదరాబాద్‌, జూలై 3 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా బీజేపీ అధికారంలోకి వచ్చి తీరుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అన్నారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయమన్నారు. ఆదివారం సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగిన విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడారు. నీళ్లు, నియామకాలు, నిధుల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేరడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్న కేసీఆర్‌.. ప్రజలు అడుగుతున్న  లెక్కలు చూపాలన్నారు. యువతకు ఉపాధి కల్పించడంలో కేసీఆర్‌ విఫలమయ్యారని, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేయడంలేదని విమర్శించారు. రాత్రింబవళ్లు తన కుమారుడిని ముఖ్యమంత్రిని చేయాలనే ఆలోచిస్తారు తప్ప.. ప్రజల గురించి కాదన్నారు. తెలంగాణ ఉద్యమానికి బీజేపీ మద్దతిచ్చిందని అమిత్‌షా గుర్తు చేశారు. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందనే భయంతో కాంగ్రెస్‌ పలు సమస్యలకు పరిష్కారం చూపకుండానే ఆంధ్రప్రదేశ్‌ను విభజించిందని ఆరోపించారు. ఉద్యమ సందర్భంలో హైదరాబాద్‌ విమోచన దినాన్ని జరుపుకోవాలని డిమాండ్‌ చేసిన కేసీఆర్‌.. అధికారంలోకి వచ్చాక ఒవైసీ భయంతో జరపడం లేదని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వస్తే విమోచన దినాన్ని జరుపుకోవచ్చన్నారు. ఎనిమిదేళ్లుగా కేసీఆర్‌ సచివాలయానికి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. ఇకపై ఆయన వెళ్లాల్సిన అవసరం ఉండదని, వచ్చే ఎన్నికల తరువాత బీజేపీ సీఎం వెళతారని అన్నారు. తెలంగాణలో అభివృద్ధి నిలిచిపోయిందని, దేశం వేగంగా దూసుకువెళుతుంటే తెలంగాణ వెనక్కి వెళుతోందని వ్యాఖ్యానించారు. బీజేపీకి ఒక్కసారి అవకాశం కల్పించాలని, ఎన్నికల హామీలు, ప్రజల ఆంకాంక్షలు నెరవేర్చని టీఆర్‌ఎస్‌ అధికారాన్ని పెకిలించాలని పిలుపునిచ్చారు.


 కేసీఆర్‌కు ఏటీఎంలా కాళేశ్వరం: నడ్డా

కేసీఆర్‌ అవినీతికి కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎంగా మారిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్దా అన్నారు. రూ.32 వేల కోట్లతో ప్రతిపాదించిన కాళేశ్వరం వ్యయాన్ని కమీషన్ల కోసం ఏకంగా రూ.1.32 లక్షల కోట్లకు పెంచారని ఆరోపించారు. తెలంగాణప్రజలు చైతన్యవంతులని, అవినీతి అక్రమాలను సహించరని అన్నారు. కేసీఆర్‌ను ఇంటికి పంపి బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని నిర్ణయించారని పేర్కొన్నారు. యూపీ సీఎం యోగి  మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణలో సక్రమంగా అమలు కావడంలేదన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల ప్రచారం సందర్భంగా బీజేపీ బలమేంటో తనకు తెలిసిందన్నారు.


గాయని మాళవికకు గౌరవం

బర్కత్‌పుర: హైదరాబాద్‌ బర్కత్‌పురకు చెందిన గాయని మాళవిక ఆనంద్‌కు అరుదైన గౌరవం లభించింది. పరేడ్‌ గ్రౌండ్‌ సభలో ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంల సమక్షంలో ఆమె ప్రార్థనా గీతం ఆలపించారు.


పలుచోట్ల ట్రాఫిక్‌ జామ్‌.. 

బీజేపీ సభకు తరలిన జనానికి తోడు నగర రోడ్ల పైకి వచ్చిన వాహనదారులతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌జామ్‌ ఏర్పడింది. మధ్యాహ్నం తర్వాత పరేడ్‌ గ్రౌండ్‌కు తరలేందుకు రోడ్లపైకి వచ్చిన జనం.. జిల్లాల నుంచి నగరంలోకి ప్రవేశించిన వారు సికింద్రాబాద్‌ వైపు వెళ్లడంతో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ అధికంగా కనిపించింది. బహిరంగ సభ నేపథ్యంలో.. పరేడ్‌ గ్రౌండ్‌కు మూడు కిలోమీటర్ల పరిధిలో ట్రాఫిక్‌ సమస్యలు ఉంటాయని పోలీసులు ముందే చెప్పినప్పటికీ.. ఇతర ప్రాంతాల్లోనూ ఇబ్బంది కనిపించింది. ఇందిరాపార్కు వద్ద ఎమ్మార్పీఎస్‌ నిరసనలతో అశోక్‌నగర్‌, లోయర్‌ట్యాంక్‌ బండ్‌ ప్రాంతాలు కూడా రద్దీగా కనిపించాయి. హెచ్‌ఐసీసీలో కార్యవర్గ సమావేశాల తర్వాత ప్రముఖులందరూ పరేడ్‌ గ్రౌండ్‌ బాట పట్టడంతో బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ రోడ్లపై ట్రాఫిక్‌ సమస్య ఏర్పడింది. ఇక సభ తర్వాత ఒక్కసారిగా జనం బయటకు రావడంతో పరేడ్‌గ్రౌండ్‌ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ నెలకొంది. 

ఎనిమిదేళ్లుగా కేసీఆర్‌ సచివాలయానికి ఎందుకు వెళ్లడం లేదు. ఇకపై ఆయన వెళ్లాల్సిన అవసరం ఉండదు. తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా బీజేపీ అధికారంలోకి వచ్చి తీరుతుంది. వచ్చే ఎన్నికల తరువాత బీజేపీ ముఖ్యమంత్రి వెళతారు.   

- అమిత్‌షా

Updated Date - 2022-07-04T08:33:57+05:30 IST