‘కాళేశ్వర’ సం‘దర్శనం’

ABN , First Publish Date - 2021-01-19T05:33:40+05:30 IST

‘కాళేశ్వర’ సం‘దర్శనం’

‘కాళేశ్వర’ సం‘దర్శనం’

నేడు సీఎం కేసీఆర్‌ రాక
ముక్తీశ్వర ఆలయంలో పూజలు
ఆలయ అభివృద్ధి పనుల పరిశీలన
మేడిగడ్డ బ్యారేజీ సందర్శన
యాసంగి పంటలకు నీటి ఎత్తిపోతలపై అధికారులతో సమీక్ష
నాలుగు గంటల పాటు సుదీర్ఘ చర్చ


భూపాలపల్లి,  జనవరి 18 (ఆంధ్రజ్యోతి) : ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంగళవారం కాళేశ్వరాన్ని సందర్శించనున్నారు. ముక్తీశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మేడిగడ్డ బ్యారేజీ వద్దకు వెళ్లి నీటిని పరిశీలిస్తారు. సుమారు నాలుగు గంటల పాటు అధికారులతో  సమీవేశమవుతారు. యాసంగి పంటలకు నీటిని లిఫ్టు చేయడం తదితర అంశాలను చర్చించనున్నారు. సీఎం పర్యటన అధికారికంగా ఖరారు కావడంతో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లను చేపట్టారు.  

దైవదర్శనం..
ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌ నుంచి నేరుగా కాళేశ్వర ముక్తీశ్వరాలయానికి ఉదయం 11 గంటలకు చేరుకోనున్నారు. గోదావరి త్రివేణి సంగమాన్ని సందర్శించి గోదావరి మాతకు మొక్కులు చెల్లించనున్నారు. అనంతరం కాళేశ్వర ముక్తీశర ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేయనున్నారు.   పూజల అనంతరం ఆలయంలో మొదటి విడతగా చేపట్టిన రూ.25 కోట్ల అభివృద్ధి పనులను సమీక్షించనున్నారు. నిధుల కొరతతో పలు పనులు అసంపూర్తిగా ఉండటంతో వాటిపై కేసీఆర్‌ సమీక్షించిన తర్వాత పూర్తి చేసేలా ఆదేశాలు జారీ చేయడంతో పాటు నిధులు మంజూరు చేసే అవకాశాలున్నాయి. గతంలో కాళేశ్వరం అభివృద్ధికి వంద ఎకరాల భూసేకకరణ హామీపై అధికారులతో సమీక్షించనున్నారు. ఇప్పటికే వంద ఎకరాల భూసేకరణకు సంబంధించి డీపీఆర్‌ను అధికారులు సీఎంకు సమర్పించారు. దీనిపై మరోసారి సమీక్షించి మరోసారి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధకారులు భావిస్తున్నారు.

అలాగే రూ. వంద కోట్లతో కాళేశ్వరంలో వేదపాఠశాల, యాగశాల, గోషాలలు, ఘాట్ల నిర్మాణం తదితర పనులు చేపట్టనున్నట్టు గతంలో కేసీఆర్‌ హామీ ఇచ్చారు. వీటికి సంబంధించిన డీపీఆర్‌లు (డిటేల్‌ ప్రాజెక్టు రిపోర్టులు)ను అధికారులు  కేసీఆర్‌కు అందించారు. ఈ రూ. వంద కోట్లకు సంబంధించి కూడా సీఎం సమీక్షించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మొత్తానికి కాళేశ్వరం సందర్శనతో ఆలయాభివృద్ధికి భారీగా నిధులు మంజూరయ్యే అవకాశం ఉందని భక్తులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

సమీక్ష..
కాళేశ్వర ముక్తీశ్వర ఆలయ సందర్శన అనంతరం నేరుగా సీఎం మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు. సుమారు నాలుగు గంటల పాటు మేడిగడ్డ బ్యారేజీ వద్దే అధికారులతో గడపనున్నారు. ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజీ వద్ద 16.17 టీఎంసీల నీటి సామర్థ్యానికి గానూ 16 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అయితే ఆదివారం రెండు మోటర్లతో పదివేల క్యూసెక్కుల నీటిని లిఫ్టు చేస్తున్నారు.  అయితే ఎగువనున్న రిజర్వాయర్లలో కూడా నీటి సామర్థ్యం ఎక్కువగా ఉండటంతో ఏపాటి నీటిని కన్నెపల్లి పంప్‌హౌజ్‌ నుంచి లిప్టు చేయాలనే అంశంపై అఽధికారులతో చర్చించే అవకాశం ఉంది.

అంతేకాకుండా మేడిగడ్డ బ్యారేజీకి మహారాష్ట్ర వైపు కొంత అసంపూర్తిగా ఉన్న రిబిట్‌మెంట్‌ పనులను సైతం పరిశీలించే అవకాశం ఉంది. బ్యారేజీతో పూర్తి సామర్థ్యం నీరు చేరితే చుట్టు పక్కల రైతుల పంటలు నీట మునగతున్నాయి. దీనిపై ఇప్పటికే రైతులు ఆందోళనకు దిగారు. 50 నుంచి 100 ఎకరాల వరకు భూసేకరణ చేయాలని అధికారులు ఇప్పటికే ప్రాథమిక అంచనాను తయారు చేశారు. దీనిని కేసీఆర్‌ పరిశీలించి అధికారులతో చర్చించే అవకాశం ఉంది. ఇక కేంద్ర జలశక్తి శాఖ మంత్రి షేకావత్‌ కాళేశ్వరం మూడో టీఎంసీ పనులు చేపట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అనుమతులు, డీపీఆర్‌ లేకుండా మూడో టీఎంసీ పనులు చేపట్టొద్దని స్పష్టం చేయడంతో దీనిపై ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై ఇంజనీర్లు, జల వనరుల అధికారులు, నిపుణులతో కేసీఆర్‌ సమీక్షించనున్నారు. మొత్తానికి సుమారు నాలుగు గంటల పాటు కేసీఆర్‌ మేడిగడ్డ వద్దే పర్యటించనుండటంతో అధికారుల్లో ఉత్కంఠ నెలకొంది.

భారీ బందోబస్తు...
ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటన నేపథ్యంలో అధకారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. మహారాష్ట్ర సరిహద్దుల్లోని కాళేశ్వరం, మేడిగడ్డ బ్యారేజీలు ఉండటంతో సోమవారం నుంచే పోలీసులు రహదారులను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. భూపాలపల్లి ఇన్‌చార్జి ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌ మేడిగడ్డ వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. రామగుండం సీపీ సత్యనారాయణ కాళేశ్వరం వద్ద భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి జిల్లాల డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో పాటు వేయి మందికిపైగా సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఈఎన్‌సీ నల్ల వెంకటేశ్వర్లు నేతృత్వంలో ఇంజనీరింగ్‌ అధికారులు మేడిగడ్డ బ్యారేజీ, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలతో నివేదికలను సిద్ధం చేశారు. కేసీఆర్‌ పర్యటన ఖరారు కావడంతో అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు మహారాష్ట్ర నుంచి భూపాలపల్లి జిల్లాకు వచ్చే అన్ని రహదారులను పోలీసులు దిగ్బంధించారు.

సీఎం పర్యటన ఇలా..
ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌ ప్రగతిభవన్‌ నుంచి కాళేశ్వరానికి బయల్దేరుతారు.
ఉదయం 11 గంటలకు కాళేశ్వరం చేరుకుంటారు.
ఉదయం 11 గంటల నుంచి ఉదయం 11.40 వరకు కాళేశ్వర ముక్తీశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు.
ఉదయం 11.40 గంటలకు కాళేశ్వరం నుంచి మేడిగడ్డ బ్యారేజీకి బయల్దేరుతారు.
ఉదయం 11.50 గంటలకు  మేడిగడ్డకు చేరుకుని బ్యారేజీని పరిశీలిస్తారు.
మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఇంజనీరింగ్‌ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు.
మధ్యాహ్నం 3 గంటలకు మేడిగడ్డ బ్యారేజీ నుంచి తిరిగి హైదరబాద్‌ బయల్దేరి వెళ్లిపోతారు.

Updated Date - 2021-01-19T05:33:40+05:30 IST