కేసీఆర్‌.. దేశానికి టార్చ్‌బేరర్‌!

ABN , First Publish Date - 2022-04-28T09:04:42+05:30 IST

మోదీ ఏడేళ్ల పాలనలో దేశాన్ని అంధకారంలోకి నెట్టారని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు.

కేసీఆర్‌.. దేశానికి టార్చ్‌బేరర్‌!

  • దిశానిర్దేశం చేయగలిగిన నాయకుడు..
  • బీజేపీ చేతిలో అధికారం.. 
  • దేశానికే అంధకారం.. 
  • టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వ్యాఖ్యలు
  • పార్టీ ప్లీనరీలో 13 తీర్మానాలకు ఆమోదం


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): మోదీ ఏడేళ్ల పాలనలో దేశాన్ని అంధకారంలోకి నెట్టారని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. బీజేపీ చేతిలో అధికారం దేశానికే అంధకారమని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశానికి దిశానిర్దేశం చేయగలిగిన నాయకుడి అవసరం ఎంతో ఉందని చెప్పారు. బుధవారం హెచ్‌ఐసీసీలో నిర్వహించిన టీఆర్‌ఎస్‌ ప్లీనరీలో.. దేశ విస్తృత ప్రయోజనాల రీత్యా జాతీయ రాజకీయాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ కీలక భూమిక పోషించాలంటూ కేటీఆర్‌ రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని వర్గాల అభివృద్ధికి పాటుపడేలా ‘మేరా భారత్‌ మహాన్‌’ అనే నాయకుడు దేశానికి కావాలన్నారు. దేశానికి విజనరీ కావాలని.. కేసీఆర్‌ లాంటి టార్చ్‌బేరర్‌ అవసరమని చెప్పారు. ఎంతో మంది రాజకీయ పార్టీలు పెట్టినా, ఎన్నో ప్రయత్నాలు చేసినా.. ఎన్టీఆర్‌, కేసీఆర్‌ మాత్రమే చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. ఎన్టీఆర్‌ చరిత్రను సృష్టిస్తే.. కేసీఆర్‌ చరిత్రతోపాటు జాగ్రఫీని కూడా క్రియేట్‌ చేశారని కేటీఆర్‌ ప్రశంసించారు. రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తే తెలంగాణకు సీఎం కావడం గొప్ప విషయమన్నారు. కేంద్రంలో ఉన్నది ఎన్డీయే ప్రభుత్వం కాదని.. అది నాన్‌ పెర్ఫార్మింగ్‌ అసెట్స్‌ (ఎన్‌పీఏ) ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. మతపిచ్చి, కులపిచ్చి లేకుండా తెలంగాణకు కేసీఆర్‌ బంగారంలాంటి పాలనను అందిస్తున్నారని.. ఇలాంటి పాలనను దేశ ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్‌ లాంటి వ్యక్తి దేశ రాజకీయాలకు అత్యవసరమని తీర్మానం చేస్తున్నట్లు కేటీఆర్‌ వెల్లడించారు. మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎనిమిదేళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుత ప్రగతివైపు నడిపించిన కేసీఆర్‌ లాంటి విజన్‌ ఉన్న నాయకుడి కోసం దేశం ఎదురు చూస్తోందన్నారు.


రాష్ట్రాల వాటా ఇవ్వడం లేదు

‘పేదలను దంచాలి.. పెద్దలకు పంచాలి’ అన్న నినాదంతోనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న కేంద్రం వారి పెట్టుబడులను మాత్రం రెట్టింపు చేసిందని అన్నారు. రాష్ట్రాల ఆదాయాన్ని గండికొడుతూ కేంద్ర పన్నుల రూపంలో కాకుండా సెస్‌ల రూపేణా వసూలు చేయడం మానుకోవాలని, డివిజబుల్‌ పూల్‌లోనే పన్నులు వసూలు చేయాలన్న తీర్మానాన్ని హరీశ్‌ ప్రవేశపెట్టారు. ఏడేళ్ల బీజేపీ పాలన అంతా వైఫల్యమేనని హరీశ్‌ ఆరోపించారు. ఏడేళ్లలో ఆర్థిక వృద్ధిరేటు 5.7 శాతానికి పడిపోయిందన్నారు. రూ.3.50 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ రంగ సంస్థల్ని కేంద్రం అమ్మేసిందన్నారు. పన్నుల రూపంలో కేంద్రం నుంచి రావాల్సిన రూ.54 వేల కోట్లను ఇవ్వకుండా బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసిందన్నారు.  రాష్ట్రాల వాటాల గురించి దేశంలోని బీజేపీయేతర సీఎంలందరితోనూ కేసీఆర్‌ మాట్లాడాలని హరీశ్‌ కోరారు. 


రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలి

తెలంగాణ ప్రధానంగా బలహీన వర్గాల రాష్ట్రమని, 90 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మెనారిటీ వర్గాలకు రిజర్వేషన్‌ శాతం పెంచుతూ కేంద్రం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని రాష్ట్ర హోం మంత్రి మహమూద్‌ అలీ డిమాండ్‌ చేశారు. తెలంగాణ రాష్ట్ర సామాజిక పరిస్థితులకు అనుగుణంగా కేంద్రం రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలన్న డిమాండ్‌తో ఆయన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలని కోరుతూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడంతోపాటు గవర్నర్‌ ఆమోదంతో కేంద్రానికి ప్రతిపాదన పంపామని, దీనిపై స్పందించడం లేదని ఆరోపించారు. 


దేశవ్యాప్తంగా దళితబంధు 

తెలంగాణలో ఎస్సీల ఆర్థిక ప్రగతి కోసం అమలు చేస్తున్న దళితబంధు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని కోరుతూ సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తీర్మానం ప్రవేశపెట్టారు. అన్ని రాష్ట్రాల్లోని దళితుల ప్రయోజనం దృష్ట్యా కేంద్రం ఈ పథకాన్ని అమలు చే యాలని డిమాండ్‌ చేశారు. 


రాష్ట్రాల అధికారాలను కబళిస్తోంది

కేంద్రంలో బీజేపీ సర్కారు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు, అధికారాలను కబళించే ప్రయత్నం చేస్తోందని టీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్ష నాయకుడు నామా నాగేశ్వరరావు ఆరోపించారు. సమాఖ్య విలువలను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలన్న అంశంపై ఆయన తీర్మానం ప్రవేశపెట్టారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు, హక్కులను హరించేలా రాజ్యాంగ సవరణలు చేస్తూ మోసపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 


కృష్ణా జలాల వివాదాన్ని పరిష్కరించాలి

కేంద్రంలోని బీజేపీ నిర్లక్ష్యం వల్ల వివాదాలు పెరగడంతోపాటు తెలంగాణకు కృష్ణా జలాల్లో రావాల్సిన వాటాను పొందలేకపోతున్నామని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పేర్కొన్నారు. నదీజలాల వివాద చట్టంలోని సెక్షన్‌ 3 ప్రకారం కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా నిర్ణయించాలని, బ్రిజే్‌షకుమార్‌ ట్రైబ్యునల్‌కు కేంద్రం సిఫారసు చేయాలని కోరుతూ ఆయన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 


బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ

బీసీల సంక్షేమం కోసం కేంద్రంలో ప్రత్యేకంగా బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో ఎమ్మెల్సీ మధుసూదనాచారి తీర్మానం ప్రవేశపెట్టారు. బీసీ అయిన మోదీ ప్రధానిగా ఉన్నా కూడా బీసీ శాఖను ఏర్పాటు చేయకపోవడం దురదృష్టకరమన్నారు.


మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాటం

మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలని, భారతదేశ వారసత్వ సంస్కృతి, సంప్రదాయాలు, పరమత సహనం, సామరస్య ధోరణులు కాపాడుకోవాలన్న అంశంపై రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రస్తుత పరిస్థితుల్లో మత  సామరస్యాన్ని కాపాడే కేసీఆర్‌ లాంటి నాయకుడు జాతీయ రాజకీయాల్లో ప్రవేశించడం అత్యవసరమని చెప్పారు. 


మహిళలకు 33ు రిజర్వేషన్‌ 

దేశవ్యాప్తంగా చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలని రాష్ట్రం నుంచి పంపిన ప్రతిపాదనను కేంద్రం పట్టించుకోవడం లేదని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లును పార్లమెంటులో ఆమోదింపజేయాలన్న డిమాండ్‌తో ఆమె తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 


చేనేతపై జీరో జీఎస్టీ

కేంద్రం చేనేత రంగంపై జీఎస్టీ విధించడం వల్ల నేత వృత్తిదారులు నష్టపోతున్నారని, కేంద్రం ఈ రంగంపై జీరో జీఎస్టీ అమలు చేయాలని ఎల్‌.రమణ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దేశంలో ఏ ప్రభుత్వమూ ఈ రకంగా చేనేతపై పన్నులు విధించలేదన్నారు. 


అన్ని జిల్లాలకు నవోదయ పాఠశాలలు..

తెలంగాణలో కొత్తగా ఏర్పడిన అన్ని జిల్లాల్లో కేంద్ర సర్కారు నవోదయ పాఠశాలలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కేంద్రం సహకరించకపోయినా భవిష్యత్‌ తరాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఆంగ్ల బోధనకు సీఎం కేసీఆర్‌ ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. 


ధరలను అదుపు చేయాలి

రోజురోజుకూ పెరిగిపోతున్న ధరలను అదుపులో పెట్టాలన్న డిమాండ్‌తో రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. గతంలో ధరలను నియంత్రించలేని ప్రభుత్వాలు అధికారం కోల్పోయిన సందర్భాలున్నాయన్నారు. తమకు అధికారం ఇస్తే నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తామన్న మోదీ.. అధికారంలోకి వచ్చాక చేసిందేమిటని ఆయన ప్రశ్నించారు. 

21 సంవత్సరాల టీఆర్‌ఎస్‌ ప్రస్థానాన్ని తెలియజేసేలా ‘ఆరోహణ’ పేరిట సీనియర్‌ జర్నలిస్ట్‌ టంకశాల అశోక్‌ రాసిన పుస్తకాన్ని సీఎం కేసీఆర్‌ ఆవిష్కరించారు. 


అదానీ, అంబానీల కోసమే ధాన్యం కొనలేదు

అదానీ, అంబానీల కోసమే కేంద్రం ధాన్యం కొనుగోలు చేయడం లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనకపోతే రైతులు తక్కువ రేటుకు అదానీకి అమ్ముకుంటారన్న ఉద్దేశంతోనే బీజేపీ సర్కారు ఈ పని చేసిందన్నారు. యాసంగిలో వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే కొంటున్నందుకు మంత్రి నిరంజన్‌రెడ్డి అభినందన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దాన్ని బలపరుస్తూ మంత్రి గంగుల మాట్లాడారు. బీజేపీ పాలిత రాష్ట్రమైన హరియాణాలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయొద్దని అక్కడి ప్రభుత్వమే అధికారికంగా లేఖ ఇచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. వాస్తవానికి రాష్ట్రాలు ధాన్యం ఉత్పత్తి చేయాలని, సేకరణ బాధ్యత కేంద్రానిదేనని చెప్పారు. భారత ఆహార సంస్థ ఎందుకు ధాన్యం కొనుగోలు చేయడం లేదో చెప్పాలని గంగుల డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-04-28T09:04:42+05:30 IST