కేసీఆర్‌ను చెట్టుకు కట్టేసి.. మూసీ నీటితో స్నానం చేయించాలి

ABN , First Publish Date - 2022-08-06T08:23:04+05:30 IST

మూసీ నదిని రూ.4 వేల కోట్లతో ప్రక్షాళన చేస్తానని, హుస్సేన్‌సాగర్‌ను కొబ్బరినీటిలా మారుస్తానని చెప్పి.

కేసీఆర్‌ను చెట్టుకు కట్టేసి.. మూసీ  నీటితో స్నానం చేయించాలి

  • అప్పుడైనా మూసీని ప్రక్షాళన చేస్తారేమో.. 
  • 4 వేల కోట్లతో ప్రక్షాళన చేస్తానన్న హామీ ఏమైంది?
  • 1.3 లక్షల కోట్లతో ఫాంహౌస్‌కు కాళేశ్వరం నీళ్లు 
  • ప్రజలకు మాత్రం కలుషిత నీటితో అనారోగ్యం
  • ప్రజాసంగ్రామ యాత్రలో  సంజయ్‌ ఆరోపణలు
  • మూసీ రివర్‌ ప్రాజెక్టుకు తక్షణమే 4వేల కోట్లు కేటాయించి ప్రక్షాళన చేపట్టాలని సీఎంకు లేఖ

యాదాద్రి/బీబీనగర్‌, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): మూసీ నదిని రూ.4 వేల కోట్లతో ప్రక్షాళన చేస్తానని, హుస్సేన్‌సాగర్‌ను కొబ్బరినీటిలా మారుస్తానని చెప్పి.. సీఎం కేసీఆర్‌ మాట తప్పారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. సీఎంను చెట్టుకు కట్టేసి మూసీ నీటితో స్నానం చేయించాలని, అప్పుడైనా మూసీ ప్రక్షాళన చేస్తారేమోనని వ్యాఖ్యానించారు. ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా నాలుగో రోజు శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ మండలం భట్టుగూడెం నుంచి భూదాన్‌ పోచంపల్లి మండలానికి సంజయ్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా భట్టుగూడెం-పెద్దరావులపల్లి మధ్య ఉన్న మూసీ వంతెన వద్ద కాలుష్యంతో విషతుల్యమై కంపుకొడుతున్న మూసీ జలాలను, పంట పొలాల్లో వేసిన వరినాట్లను ఆయన పరిశీలించారు. మూసీ కాలుష్య నీటిని బాటిళ్లలో పట్టి చూపిస్తూ పరివాహక ప్రాంత ప్రజలు తమ బాధలను వివరించారు. 


అనంతరం పెద్దరావులపల్లిలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో గ్రామస్థులు మాట్లాడుతూ.. మూసీ నీటి కారణంగా తినే తిండి, గాలి, నీరు అంతా కలుషితమైందని, తమ ప్రాంతాల్లో పెళ్లి చేద్దామంటే అమ్మాయిని ఇచ్చేందుకు కూడా ఎవరూ ముందుకు రావడంలేదని వాపోయారు. ‘‘మూసీని ప్రక్షాళన చేస్తానన్న సీఎం కేసీఆర్‌ ఈసారి మీ వద్దకు వస్తే చెట్టుకు కట్టేసి మూసీ నీటితో స్నానం చేయించండి. ఫినాయిల్‌ పోసి కడగండి. అప్పటికైనా బుద్ధి వచ్చి మూసీ ప్రక్షాళన చేస్తాడేమో’’ అని సంజయ్‌ వ్యాఖ్యానించారు. మూసీ రివర్‌ ఫ్రంట్‌ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి రూ.4 వేల కోట్లు కేటాయిస్తామన్నారని, సబర్మతి నది తరహాలో సుందరీకరిస్తామన్నారని, కానీ.. ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. పరిశ్రమల వ్యర్థాలను మూసీలో కలుపుతున్నారని, దీంతో మూసీ పరివాహక ప్రాంత ప్రజలు, రైతులు కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కేసీఆర్‌ మాత్రం తన 300 ఎకరాల ఫాంహౌ్‌సకు 200 కిలోమీటర్ల దూరం నుంచి కాళేశ్వరం నీళ్లను రప్పించుకున్నారని, ఇందుకు రూ.1.30 లక్షల కోట్లు ఖర్చు చేశారని ధ్వజమెత్తారు.


రుణాలు తీసుకొని మింగేస్తున్నారు..

ముఖ్యమంత్రి వివిధ కార్పొరేషన్లను ఏర్పాటుచేసి, వాటి ద్వారా రూ.వేల కోట్ల రుణాలు తీసుకుని ఆ నిధులను మింగేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలోని పేదల కోసం కేంద్రం రూ.2 లక్షల ఇళ్లను మంజూరు చేస్తే, కేసీఆర్‌ వాటిని కట్టడం లేదన్నారు. ఉపాధి హామీ పథకంలో రోజుకు రూ.257 కేంద్రం ఇస్తుందని, వేసవిలో అదనంగా రూ.20 ఇస్తున్నప్పటికీ.. కేసీఆర్‌ ఇక్కడ కూలీలకు పంచడం లేదని అన్నారు. మూసీ రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టుకు వెంటనే రూ.4 వేల కోట్లు కేటాయించి మూసీ ప్రక్షాళన చేపట్టాలంటూ సీఎం కేసీఆర్‌కు సంజయ్‌ బహిరంగ లేఖ రాశారు. కలుషిత జలాల వల్ల అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఆ ప్రాంత ప్రజలకు తగిన వైద్య సహాయం అందించాలని లేఖలో కోరారు.  కాగా, బండి సంజయ్‌ ప్రజాసంగ్రామ యాత్ర నాలుగో రోజు 9.8 కిలోమీటర్లు కొనసాగింది. శనివారం ఉప రాష్ట్రపతి ఎన్నిక జరగనుండటంతో సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్రను రద్దు చేసుకుని ఢిల్లీ వెళ్లనున్నారు. తిరిగి 7న యాత్ర ప్రారంభం కానుంది. 


21న రాజగోపాల్‌ బీజేపీలో చేరిక 

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి ఈ నెల 21న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సమక్షంలో బీజేపీలో చేరుతున్నట్టు బండి సంజయ్‌ తెలిపారు.  ఏఐసీసీ అధికార ప్రతినిధి పదవికి, కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన దాసోజు శ్రవణ్‌నూ బీజేపీ చేరాలని సంజయ్‌ కోరారు. దాసోజు శ్రవణ్‌ జాతీయ భావాలున్న వ్యక్తి అని, గతంలో ఏబీవీపీలో పనిచేసిన నాయకుడని అన్నారు. తెలంగాణపై పూర్తి అవగాహన ఉన్న శ్రవణ్‌ను తట్టుకోలేక కేసీఆర్‌ అణగదొక్కారని విమర్శించారు. ఇక కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తమతో టచ్‌లో ఉన్నారని తాను అనలేదని సంజయ్‌ తెలిపారు.

Updated Date - 2022-08-06T08:23:04+05:30 IST