పీవీ స్ఫూర్తితో కేసీఆర్ పాలన

ABN , First Publish Date - 2020-07-02T06:02:16+05:30 IST

దివంగత పీవీ నరసింహారావు దార్శనికుడు, కార్యదక్షుడు. ముఖ్యమంత్రిగా భూసంస్కరణలనూ, ప్రధానమంత్రిగా ఆర్థికసంస్కరణలను అమలుపరచిన పాలనాదక్షుడు. దేశంపట్టని మహామేధావి పీవీ. తెలంగాణ బిడ్డ కావడం తెలంగాణ వారందరికీ గర్వకారణం...

పీవీ స్ఫూర్తితో కేసీఆర్ పాలన

కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల గోదావరి జలాలు ఉత్తర తెలంగాణ పొలాలలో జలజలా ప్రవహిస్తున్నాయి. ఈ పరిస్థితిని ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు ఊహించలేదు. పీవీ నరసింహారావు ఇప్పుడు జీవించి వుంటే నిండు మనస్సుతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను దీవించి వుండేవారు.


దివంగత పీవీ నరసింహారావు దార్శనికుడు, కార్యదక్షుడు. ముఖ్యమంత్రిగా భూసంస్కరణలనూ, ప్రధానమంత్రిగా ఆర్థికసంస్కరణలను అమలుపరచిన పాలనాదక్షుడు. దేశంపట్టని మహామేధావి పీవీ. తెలంగాణ బిడ్డ కావడం తెలంగాణ వారందరికీ గర్వకారణం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విద్యాశాఖామంత్రిగా పేదలకు ఆశ్రమ పాఠశాలలను తొలిసారిగా ప్రారంభించిన ఘనత పీవీదే. కేంద్రంలో మానవవనరుల మంత్రిగా వున్నప్పుడు ఈ ఆలోచనకు కొనసాగింపుగా జాతీయ స్థాయిలో నవోదయా విద్యాలయాలకు రూపకల్పన చేసిన ఘనత కూడా పీవీదే. దాదాపు 14 భాషలలో నిష్ణాతుడు కావడమే కాక, ఆర్ధిక శాస్త్రం, పాలనా చట్టాలు, రాజకీయాలు, సాహిత్యంలో కూడా ఆయనకు ప్రావీణ్యం అపారంగా ఉండేది.


స్థితప్రజ్ఞతకు, మూర్తీభవించిన తెలుగుతనానికి నిలువెత్తు నిదర్శనమైన స్వాతంత్య్ర సమరయోధుడు, సాహితీవేత్త పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా గద్దెనెక్కిన సమయంలో దేశ ఆర్ధిక వ్యవస్థ గాడితప్పి వుంది. ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే ఈ విషమ పరిస్థితిని చాకచక్యంగా పరిష్కరించి, జాతి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసి, అంతర్జాతీయ సమాజంలో భారత్ గౌరవాన్ని కాపాడిన మహా మనీషి నరసింహారావు.


చిన్ననాటి నుంచి స్వర్గస్తులయ్యే వరకు ఏ పార్టీకైతే త్రికరణశుద్ధిగా అండగా నిలిచారో, ఆ కాంగ్రెస్ పార్టీయే, ప్రధానమంత్రి పదవి నుంచి దిగిపోయిన వెంటనే ఆయనను చిన్నచూపు చూసింది. ఇదెంతయినా దురదృష్టకరం. అంతేకాదు గర్హనీయం కూడా. ప్రధానమంత్రులుగా పనిచేసిన వారందరికీ మరణానంతరం దక్కవలసిన మర్యాదకు కూడా కాంగ్రెస్ పార్టీ ఆయనను దూరం చేసింది. స్వర్గస్తులైన అందరు ప్రధానుల మాదిరి పీవీకి కూడా అంత్యక్రియలు ఢిల్లీలోనే జరగవలసివుండగా, ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వుండి కూడా ఆ పని చేయలేదు సరికదా ఆయన పార్థివ దేహాన్ని ఏఐసిసి ప్రధాన కార్యాలయం ప్రాంగణంలోకి తీసుకురావడానికి కూడా అనుమతించలేదు. అంత్యక్రియలకు ఆయన భౌతిక కాయాన్ని హైదరాబాద్ తీసుకువచ్చినప్పటికీ, ఇక్కడ కూడా తగిన గౌరవం లభించలేదు. 


తెలంగాణ మాన్య ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పీవీ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా ప్రతి యేటా ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. పీవీ శతజయంతి ఉత్సవాలను ఏడాది పాటు అపూర్వమైన రీతిలో ప్రపంచవ్యాప్తంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీని కోసం రాజ్యసభ సభ్యులు కే.కేశవరావు గారి అధ్యక్షతన ఒక కమిటీని కూడా నియమించారు. అంతేకాక పీవీకి ‘భారతరత్న’ ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపాలని కూడా నిర్ణయించారు. ప్రపంచవ్యాప్తంగా ఆయన శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి గానూ 51 దేశాలలోని ఎన్ఆర్ఐలతో మంత్రివర్యులు కే.తారకరామారావు సమావేశమై చర్చలు జరిపారు. పీవీ శతజయంతి ఉత్సవాలను సంవత్సరం పాటు అత్యంత ఘనంగా సమన్వయంతో అన్ని దేశాల్లోని తెలుగువారిని కలుపుకొని నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. శతజయంతి ఉత్సవాల ఏర్పాట్లు ఘనంగా ఉండాలని ఎలాంటి లోటు రాకుండా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. 


తెలంగాణ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టగానే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని ‘బంగారు తెలంగాణ’గా మార్చి, దేశానికే ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగా తెలంగాణ తల్లికి పచ్చలహారంగా ‘హరితహారం’ కార్యక్రమాన్ని రూపొందించారు. రైతులకు భరోసా ఇస్తూ, రైతు రుణాల మాఫీ, వ్యవసాయానికి ఉచిత కరెంటు, రైతుబంధు పథకాలను ప్రవేశపెట్టారు. సమాజంలోని ప్రతి సామాజిక వర్గానికి, ప్రతిపౌరుడికి అందేవిధంగా సంక్షేమ పథకాలను రూపొందించారు.‘మిషన్ కాకతీయ’ పథకం ద్వారా గ్రామాల్లోని చెరువుల పూడిక తీసి, వాటికి జలకళను సంతరింపజేశారు. అపర భగీరథునిగా తెలంగాణలో లక్ష ఎకరాలకు, వ్యవసాయానికి నీళ్ళిచ్చే బృహత్ కార్యక్రమాన్ని చేపట్టి, అందులో భాగంగా ‘కాళేశ్వరం ప్రాజెక్ట్’కు రూపకల్పన చేసి, అతి శీఘ్ర కాలంలోనే పూర్తి చేశారు. ఇది ప్రపంచ ఇరిగేషన్ రంగంలోనే ఒక ‘ఇంజనీరింగ్ మర్వెల్’ అని నీటిపారుదల రంగ నిపుణులంతా కొనియాడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల ఈనాడు గోదావరి జలాలు ఉత్తర తెలంగాణ పొలాలలో జలజలా ప్రవహిస్తున్నాయి. ఈ పరిస్థితిని ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు ఊహించలేదు. ఈనాడు పీవీ నరసింహారావు జీవించి వుంటే నిండు మనస్సుతో ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను దీవించి వుండేవారు. ఆయన దీవెనలు స్వర్గం నుంచైనా ఎల్లప్పుడూ కేసీఆర్‌కు వుంటాయని ఆశిస్తున్నాము.

కోలేటి దామోదర్

Updated Date - 2020-07-02T06:02:16+05:30 IST