కేసీఆర్‌ నా శిష్యుడే!

ABN , First Publish Date - 2022-05-23T09:01:31+05:30 IST

ఆయనొక మత ప్రబోధకుడు, శాంతిదూత. ప్రజాశాంతి పేరిట పార్టీని స్థాపించి రాజకీయ నాయకుడు కూడా అయ్యారు.

కేసీఆర్‌ నా శిష్యుడే!

ఒకప్పుడు నా ఆశీర్వాదం కోసం వచ్చేవారు

ఇప్పుడు ఆయనకు కళ్లు నెత్తికెక్కాయి

ప్రజాశాంతి పార్టీయే ప్రత్యామ్నాయం..

3 నెలల్లో 3.70 లక్షల మంది పార్టీలో చేరారు

18 రాష్ట్రాల నేతలు నా మద్దతు కోరుతున్నారు.. 

నేను పిలుపునిస్తే 141 దేశాల అధినేతలు వస్తారు

2 రాష్ట్రాల సీఎంలు అడ్డుకుంటున్నారు.. 

కొన్ని చానళ్లు రేటింగ్స్‌ కోసం నన్ను కమెడియన్‌గా చిత్రీకరించాయి

గతంలో కన్నా నాకు ఇప్పుడే ఎక్కువ పలుకుబడి.. 

‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’లో కేఏ పాల్‌ వ్యాఖ్యలు 


హైదరాబాద్‌, మే 22 (ఆంధ్రజ్యోతి): ఆయనొక మత ప్రబోధకుడు, శాంతిదూత. ప్రజాశాంతి పేరిట పార్టీని స్థాపించి రాజకీయ నాయకుడు కూడా అయ్యారు. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో పోటీ చేసినా ఆ పార్టీకి ఎక్కడా డిపాజిట్‌ కూడా దక్కలేదు. అయినా.. తన పార్టీయే దేశానికి ప్రత్యామ్నాయం అంటున్నారు. ఈసారి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పోటీ చేస్తానంటున్నారు. దేశంలోనూ 18 రాష్ట్రాలకు చెందిన నేతలు తన మద్దతు కోరుతున్నారని చెబుతున్నారు. ప్రజలకు సేవ చేయాలని ఉన్నా.. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. తనకు అవకాశమిస్తే ఒక్కో రాష్ట్రానికి రూ.లక్ష కోట్ల చొప్పున పెట్టుబడులు తీసుకొస్తానని, లక్ష మందికి ఉపాధి కల్పిస్తానని అంటున్నారు. మీడియా రేటింగ్స్‌ కోసం తనను కమెడియన్‌గా చిత్రీకరించిందని, కానీ.. గతంలో కన్నా తనకు ఇప్పుడే ఎక్కువ పలుకుబడి ఉందని అన్నారు. తాను పిలుపునిస్తే 141 దేశాల అధినేతలు వస్తారని చెబుతున్నారు. ఆయనే.. కేఏ పాల్‌. ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’ కార్యక్రమంలో పలు అంశాలపై తనదైన శైలిలో అభిప్రాయాలు వెలిబుచ్చారు. ఆ విశేషాలు..


మత ప్రబోధకుడు, శాంతిదూత, రాజకీయ నాయకుడు.. మూడింట్లో ఏది ఇష్టం?

మూడు కాదు.. ఎనిమిది అంశాల్లో ప్రపంచంలో నంబర్‌వన్‌ అయ్యాను. 

ఒకప్పుడు రాజకీయ నేతలు మీకోసం వేచి చూసేవారు. మీ పతనానికి కారణమేంటి?

ఇప్పుడు కూడా వేచి చూస్తున్నారు. 2021 ఫిబ్రవరి 1న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను కలిశాను. నా పిలుపునందుకొని 141 మంది దేశాధినేతలు రష్యాకు వ్యతిరేకంగా నిలబడ్డారు. 

పాల్‌ కమెడియన్‌ అనే మాట ఎందుకొచ్చింది?

టీఆర్‌పీ రేటింగ్‌ కోసం, డబ్బులొస్తాయని కొన్ని యూట్యూబ్‌ చానళ్లు నన్ను అలా వాడుకున్నాయి. ఇటీవలే 26 మంది జాతీయ నేతలు నా హోటల్‌కు వచ్చారు. అమిత్‌షా ఇప్పటికి పదిసార్లు అధికారికంగా నన్ను కలిశారు. అనధికారికంగా ఎన్నోసార్లు కలిశారు.

గతంలో మీ కూటములకు వేలు, లక్షల మంది వచ్చేవాళ్లు కదా?

ఇప్పుడు కూడా వస్తారు. రెండు రాష్ట్రాల్లో నా కూటములకు అనుమతులు ఇవ్వడంలేదు. కేసీఆర్‌ను 80 సార్లు అడిగినా ఇవ్వలేదు. ఏపీలో అసలే ఇవ్వడంలేదు. 

ఉద్యమ సమయంలో కేసీఆర్‌ రూ.10 కోట్లు అడిగితే 15 కోట్లు ఇచ్చానన్నారు? 

ఆయన రూ.10 కోట్లు అడిగితే ఆశ్చర్యపోయాను. 10 వేల కోట్లు అడుగుతారేమో అనుకున్నాను. కానీ, 2008 లో ఆయన స్థాయి 10కోట్లేనని ఒక వ్యక్తి చెప్పాడు. 

2008లో మీ స్థాయి 10 వేల కోట్లు.. ఇప్పుడెంత?

వంద ట్రిలియన్లు.. ఇప్పటికే 62 బిలియన్‌ డాలర్లు ప్రజలకు ఇచ్చాను. ప్రభుత్వం ద్వారా, ప్రజాప్రతినిధుల ద్వారా, స్వచ్ఛంద సంస్థల ద్వారా ఇచ్చాను. 38 వేల గ్రామాలకు రూ.5 లక్షల కోట్లు ఇచ్చాను. 

ఇంత చేస్తే గ్రామానికి 10 ఓట్లు కూడా రాలేదే?

మేం అసలు పోటీయే చేయలేదు. మా మద్దతు కావాలని 18 రాష్ట్రాల్లో వివిధ పార్టీల నేతలు అడిగారు. 

మీ మాట విని ప్రజలు ఓటు వేస్తారా?

కేసీఆర్‌ కావాలా? కేఏ పాల్‌ కావాలా? అని పోల్‌ పెట్టండి.. తెలుస్తుంది.  

నరసాపురంలో మీకు వచ్చిన ఓట్లు 3 వేలే కదా?

నరసాపురంలో పోటీపై వారం ముందు మాత్రమే ప్రకటించాను. ఎన్టీఆర్‌, చిరంజీవి ఎన్నికలకు 18నెలల ముందు తమ పార్టీలను ప్రకటించారు. ఈసారి రెండు రాష్ట్రాల్లోనూ పోటీ చేస్తాం.

ప్రజలు మీకు ఓట్లు వేస్తారా?

ప్రజలంతా ప్రజాశాంతి పార్టీకి మద్దతిస్తారు. కాంగ్రెస్‌ పార్టీ గాంధీ కుటుంబాన్ని పక్కనపెడితే జాతీయ స్థాయిలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటాం. రాజకీయ నాయకులంతా ఒకప్పుడు నా వద్దకు వచ్చినవారే. కేసీఆర్‌ డబ్బుల కోసం, ఆశీర్వాదం కోసం, తెలంగాణ కోసం నా వద్దకు వచ్చారు.

మీకు ఇంత కెపాసిటీ ఉందని రెండు రాష్ట్రాల్లో కలిపి వెయ్యి మందితో చెప్పించగలరా?

మూడు వారాల్లో 3లక్షల 70 వేల మంది ప్రజాశాంతి పార్టీలో జాయిన్‌ అయ్యారు. కేసీఆర్‌ నా శిష్యుడే. కానీ, ఆయనకు కళ్లు నెత్తికెక్కాయి. ప్రజలు బుద్ది చెబుతారు.

ఒకప్పటి కేఏ పాల్‌.. ఇప్పుడు నవ్వులపాలు ఎందుకయ్యాడు?

అదేం లేదు. దేవుని ఆశీస్సులు ఇప్పుడే ఎక్కువగా పొందాను.  

అప్పులు, ఆస్తులు ఉన్నాయా?

ఏమీ లేవు. సేవా కార్యక్రమాలకు వేల కోట్లు తెచ్చాను. చాన్సిస్తే ఇప్పుడూ తెస్తాను. 

శాంతి బోధనలు చేయక రాజకీయాలు ఎందుకు?

దేశాన్ని అప్పుల బారి నుంచి కాపాడాలనుకుంటున్నాను. తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేయాలి. అన్ని ప్రజాస్వామ్య దేశాలతో భారత్‌కు మంచి సంబంధాలు ఏర్పడాలి. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అవకాశమిస్తే రెండు రాష్ట్రాలకు చెరో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు తీసుకొస్తాను. లేదా లక్షమందికి ఉద్యోగాలు ఇప్పిస్తాను. లేదంటే నాపై కేసు పెట్టి జైల్లో వేయండి. 

ఒకప్పుడు పవర్‌ఫుల్‌ పర్సన్‌గా ఉన్న మీరు ఇలా ఎందుకయ్యారు? 

కొన్ని చానళ్లు రేటింగ్స్‌ కోసం నన్ను తప్పుగా చూపించాయి. నేను పిలిస్తే 141 దేశాల అధినేతలు వస్తారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ నేను ఎప్పుడు పిలిచినా రావడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ, మనవాళ్లు రానివ్వడంలేదు.

బైడెన్‌ వస్తానంటే రానివ్వడంలేదా? 

రావద్దన్నారు. ఒకప్పుడు సోనియాగాంధీ కూడా 56 మంది నేతలను రాకుండా అడ్డుకున్నారు. నేను దైవాంశసంభూతుడినని, నా కార్యక్రమాలకు అనుమతి ఇస్తే.. కాంగ్రెస్‌ భూస్థాపితమవుతుందని వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అప్పట్లో సోనియాగాంధీకి లేఖలు రాశారు.

వైఎస్‌ మిమ్మల్ని భూస్థాపితం చేశారంటారు?

నన్ను చేయలేదు. ఆయనే భూస్థాపితమైపోయాడు.


మీ తమ్ముడిని మీరే చంపారని వార్తలు వచ్చాయి కదా?

అది మీడియా వక్రీకరణ. డబ్బులు తీసుకొని తప్పుడు రిపోర్టు రాశానని సీఐ శ్రీనివాస్‌ కోర్టులో అంగీకరించారు. అప్పటి డీజీపీ చాలా మంచివారు. వాస్తవాన్ని తెలుసుకున్నారు. తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి ఒకప్పుడు మంచివారు. ఇప్పుడు మారిపోయారు. ముఖ్యమంత్రి చెప్పిందే చేస్తున్నారు. 

Updated Date - 2022-05-23T09:01:31+05:30 IST