కేసీఆర్‌ చూపవలసిన చొరవ

ABN , First Publish Date - 2020-07-16T06:11:18+05:30 IST

కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకీ అధికమవుతున్నది. ఇలాంటి విపత్సమయంలో పరిమితంగా వున్న వనరుల్ని వాడుకుంటూ, వినూత్నమైన పద్ధతుల్లో కొత్త వనరుల్ని...

కేసీఆర్‌ చూపవలసిన చొరవ

కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకీ అధికమవుతున్నది. ఇలాంటి విపత్సమయంలో పరిమితంగా వున్న వనరుల్ని వాడుకుంటూ, వినూత్నమైన పద్ధతుల్లో కొత్త వనరుల్ని, వసతులని వెతుకుకుంటూ ముందుకు నడవాల్సిన సమయంలో సెక్రటేరియేట్ భవనాన్ని కూల్చివేయడం లాంటి కార్యక్రమాల్ని చేపట్టడం చూస్తుంటే అంతులేని ఆవేదన కలుగుతున్నది. హాస్పిటల్స్, బెడ్స్ తక్కువగా ఉన్న కారణంగా, 13 సంవత్సరాలుగా నిరుపయోగంగా వున్న గచ్చిబౌలీ స్టేడియం భవనాన్ని అందుబాటులోకి తీసుకురావటం ముదావహం. ఇటువంటి మంచి పని చేసిన ప్రభుత్వం, 25 ఎకరాల స్థలంలో, మంచి ప్రదేశంలో అందరికీ అందుబాటులో ఉన్న సచివాలయ భవనాన్ని కూడా తాత్కాలికంగా ఒక హాస్పిటల్‌గా ఎందుకు మార్చలేదు? అలా చేసివుంటే కనీసం 1500 నుండి 2000 పడకలతో ప్రజలకి ఉపయోగపడుతుంది కదా. కేంద్ర ప్రభుత్వం 500 రైల్వే కోచ్‌లను 8000 మంది పేషెంట్స్‌కి పనికివచ్చేలా మార్చింది. అలాగే ప్రపంచంలోనే అతి పెద్దది అయిన ఆసుపత్రిని రాధా స్వామి స్పిరిట్యుయల్ సెంటర్‌లో యుద్ధ ప్రాతిపదిక మీద నిర్మిస్తున్నారు. అలాగే ఎగ్జిబిషన్ సెంటర్స్, హోటల్స్‌ని కొవిడ్ వార్డులుగా మారుస్తున్నారు.


మహారాష్ట్ర ప్రభుత్వం విప్రో కంపెనీ పూణే ఆఫీస్ బిల్డింగ్‌ని 450 పడకల ఆసుపత్రిగా మార్చింది. ముంబైలో ప్రఖ్యాత బిల్డర్ జి.శరన్ డెవెలపర్స్ సహాయంతో మలాద్‌లోని వారి కాంప్లెక్స్‌ని కొవిడ్ ఆసుపత్రి కింద మార్చటం జరిగింది. కేరళ రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉన్న ప్రతి సదుపాయాన్ని కొవిడ్ హాస్పిటల్స్, ఐసొలేషన్ వార్డ్స్ కింద మారుస్తోంది. టూరిజంకి పనికివచ్చే హౌస్ బోట్స్‌ని కూడా ఐసొలేషన్ వార్డ్స్ కింద మార్చివేసింది. గుజరాత్‌లోని ఆనంద్ యూనివర్సిటీకి చెందిన సెంటర్ ఫర్ సస్టైనబిలిటీ టీం సహాయంతో కేరళ ప్రభుత్వం ఈ అద్భుతమైన చర్యలు చేపట్టింది. ఈ సెంటర్ ఫర్ సస్టైనబిలిటీ టీం కేరళ రాష్ట్రానికి ఉచితంగా ఈ సహాయం అందించింది. ఇతర రాష్ట్రాలకూ సహాయమందించడానికి సిద్ధంగా వున్నారు. ఐటి మంత్రి కల్వకుంట్ల తారక రామారావు హైదరాబాద్‌లో ఉన్న ఐటి కంపెనీలతో మాట్లాడితే కొన్ని లక్షల చదరపు అడుగుల స్థలం వున్న భవనాలను కొవిడ్ పేషెంట్స్‌కి పనికివచ్చేవిధంగా మార్చవచ్చు. ప్రస్తుతం ఈ భవనాలు ఉద్యోగుల వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంతో ఖాళీగా వున్నాయి. ఆయన చొరవ చూపితే ఈ భవనాల్లోనే కాన్ఫరెన్స్ హాల్స్, కెఫెటేరియస్ లాంటి ప్రదేశాలని తాత్కాలిక ప్రాతిపదిక మీద తీసుకోవచ్చు. అలాగే మహారాష్ట్ర ప్రభుత్వం చేసినట్లుగా ప్రఖ్యాత బిల్డర్స్ దగ్గర వున్న భవంతులు మరిన్ని రానున్న రోజుల్లో కొవిడ్ పేషెంట్స్‌కి ఉపయోగపడేలా మార్చవచ్చు. 

బసవేంద్ర సూరపనేని, డిట్రాయిట్, అమెరికా

Updated Date - 2020-07-16T06:11:18+05:30 IST