కేసీఆర్‌ తెల్లవారుజాము 3 దాకా తాగుతూనే ఉంటాడు

ABN , First Publish Date - 2022-01-01T06:32:29+05:30 IST

‘‘కేటీఆర్‌ లిక్కర్‌ విషయంలో నన్ను ఏదో

కేసీఆర్‌ తెల్లవారుజాము 3 దాకా తాగుతూనే ఉంటాడు

  • తెలంగాణలో మద్యం ద్వారా 60 వేల కోట్ల ఆదాయం: సోము వీర్రాజు
  •  కేటీఆర్‌ నన్ను విమర్శించడమా?:వీర్రాజు

అమరావతి/రాజమహేంద్రవరం అర్బన్‌, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): ‘‘కేటీఆర్‌ లిక్కర్‌ విషయంలో నన్ను ఏదో విమర్శించాడు. వాళ్ల నాన్న కేసీఆర్‌ తెల్లవారుజాము 3 గంటల వరకూ తాగుతూనే ఉంటాడు. తెలంగాణలో రూ.60 వేల కోట్ల ఆదాయం మద్యంపైనే వస్తోంది. ఒక్కొక్కరికి తగలవలసిన చోట తగులుతోంది. పేదల రక్తం తాగుతారా అని ప్రశ్నిస్తే ఇబ్బందా? నేను పేదవాడిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడిన అంశమే అది. బాటిల్‌తో కలిపి లిక్కర్‌ ఖరీదు రూ.6. దాన్ని మీరు రూ.250కు అమ్ముతుంటే నేను  ప్రోత్సహించను. తల్లులు అర్థం చేసుకోవాలి.  రూ.50కు ఇస్తే రోజుకు రూ.400 మిగులుతాయి. సంవత్సరానికి ఒక్కొక్కరికి రూ.1.80 లక్షలు మిగులుతాయి’’ అని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.


విజయవాడలో ప్రజాగ్రహ సభలో ఆయన చేసిన లిక్కర్‌ ధరల వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. సోషల్‌ మీడియాలో సోము వైన్స్‌, సారాయి వీర్రాజు అంటూ ట్రోలింగ్‌ చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆయన స్పందించారు.  రాజమహేంద్రవరంలో ఆయన మాట్లాడారు. రూ.50కి లిక్కర్‌ విక్రయిస్తే ప్రతి పేద కుటుంబానికి ఏటా రెండు లక్షల రూపాయలు మిగులుతాయని అన్నారు. తాను చేసే ప్రతి వ్యాఖ్యను 2024 ఎన్నికల్లో బీజేపీ మేనిఫెస్టోలో పెట్టి తీరుతామని స్పష్టం చేశారు.


‘‘ఇక జిన్నా విగ్రహం గుంటూరులో చాలా కాలంగా ఉందని వైసీపీ వాళ్లంటున్నారు. ఆ విగ్రహం గురించి నేనెందుకు మాట్లాడుతున్నానని వారు ప్రశ్నిస్తున్నారు. మేం ఎప్పుడైనా మాట్లాడతాం. జిన్నా విగ్రహాన్ని మీరు (వైసీపీ నేతలు) తీస్తారా? మమ్మల్ని తీయమంటారా? జిన్నా టవర్‌ను మీరు మారుస్తారా? మమ్మల్ని మార్చమంటారా?’’ అని వీర్రాజు ప్రశ్నించారు. కాగా రోజుకు రూ.200 మిగిలితే ఏడాదికి రూ.72 వేలు మిగలాలి కదా అంటూ మరోసారి ఆయనపై సోషల్‌ మీడియాలో పలువురు ట్రోల్‌ చేస్తున్నారు. ‘‘ఇక ఇప్పటికే చేసిన నష్టం చాలు. ఇక నోరు మూయించండి ’’ అంటూ ఢిల్లీ పెద్దలకు పలువురు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.


Updated Date - 2022-01-01T06:32:29+05:30 IST