Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

ఫలితం ఏదైనా, పాఠం నేర్పి తీరుతుంది!

twitter-iconwatsapp-iconfb-icon
ఫలితం ఏదైనా, పాఠం నేర్పి తీరుతుంది!

కారణాలేవో నిర్దిష్టంగా చెప్పలేము కానీ, తెలంగాణ ప్రజలలో రాష్ట్ర ప్రభుత్వం మీద విముఖత పెరిగింది. అట్లాగని, అది మొత్తంగా నిరాకరించేంత పెద్దస్థాయిది కాకపోవచ్చు. కానీ, ఈ ప్రభుత్వానికి ఒక సందేశం వెళ్లాలి, ఒక దెబ్బ తగలాలి, తెలిసిరావాలి- అన్న పద్ధతిలో ప్రజలు ఆలోచిస్తున్నట్టు కనిపించింది. అట్లా అనిపించినప్పుడు, ఏదైనా ప్రత్యామ్నాయం కనిపిస్తే అటు ఆసక్తి కలగడం సహజమే కదా? బిజెపి ప్రవేశంతో హైదరాబాద్‌లో అశాంతి ప్రబలుతుంది అన్న అధికారపక్షం ఆరోపణకు అనుగుణంగానే బిజెపి కూడా అవాంఛనీయ, ద్వేష, నేరపూరిత వ్యాఖ్యలతో ఉద్రిక్తతకు కారణమయింది. నిజానికి, ఒక సాధారణ పార్టీ లాగా, అభివృద్ధి రాహిత్యం గురించో, అప్రజాస్వామిక పాలన గురించో మాత్రమే ప్రచారం చేపట్టి ఉంటే, ప్రజలు బిజెపిని సీరియస్‌గా తీసుకునేవారేమో?


ఇవాళ సాయంత్రం ఎగ్జిట్ పోల్సు రేపు ఫలితాలు పెట్టుకుని, ఊహలు చేయడం అనవసరం. ఖచ్చితంగా చెప్పగలిగేది ఏమిటంటే, బిజెపికి ఎంతో కొంత సంతోషం, టిఆర్‌ఎస్‌కు ఎంతో కొంత విచారం తప్పవు.


నూటికి నలభై ఆరయితే డబ్బాలో పడ్డాయి. ఎవరికెన్ని అన్నది తేలాలి. శుక్రవారం తేలుతుందనుకోండి, తేడా ఏమిటి? 

ప్రచారం జోరు, ప్రసంగాల హోరు చూసి, బ్యాలట్ బాక్సులు పొంగిపొర్లుతాయని అనుకున్నారు. ఓటింగు శాతానికి ఏదో ఒక పార్టీ కుదుళ్లు కదిలిపోతాయని ఆశ పెట్టుకున్నారు. ఓటరు దేవుళ్లు ఎప్పటిలాగానే ఎక్కువగా ఓట్ ఫ్రమ్ హోమే ఇష్టపడ్డారు. మౌనమే వారి భాష. దాన్ని అర్థం చేసుకోలేక, వారికి బాధ్యత లేదని, వివేకం లేదని, గోడకుర్చీ వేయించాలని, వారికి రేషన్ కట్ చేయాలని, హక్కులన్నీ రద్దు చేయాలని పెద్దమనుషులంతా నోటికి వచ్చినట్టు మాటలు అనేశారు.


ఎక్స్ అఫీషియో సీట్లను కూడా లెక్కవేసి, టిఆర్ఎస్‌కు సగం మెజారిటీ సిద్ధంగా ఉన్నట్టు వ్యాఖ్యాతలు రాశారు. హైదరాబాద్ మహానగరపాలికాసంస్థలో ఎవరికి మెజారిటీ వస్తుంది, ఎవరు మేయర్ అవుతారు అన్నది ఈ ఎన్నికల సారాంశం కానేకాదు. బరిలోకి దిగకముందే గెలిచేసిన పార్టీ బిజెపి. పోయిన జిహెచ్ఎంసిలో నాలుగంటే నాలుగు సీట్లు గెలుచుకున్న ఆ పార్టీ ఈ సారి ఎంత కాదన్నా 8 సీట్లు గెలుచుకుంటుందా, అంటే వందశాతం వృద్ధి. 96 చోట్ల గెలిచిన తెలంగాణ రాష్ట్ర సమితి ఒక్క పదిసీట్లన్నా దిగిపోకపోతుందా, అంటే పతనం కొనసాగుతున్నట్టే కదా! ఈ రెండూ కనీస అవకాశాలు. బిజెపికి ఆ పార్టీ వాళ్లే లోలోపల చెప్పుకుంటున్నట్టు పాతికా ముప్పై రావచ్చు, లేదా, మనకు తెలియని ప్రభంజనమేదో నలభైఆరు శాతం ఓట్లలోనే సుడులు తిరిగి 80 సీట్లు కూడా గెలవవచ్చు. టిఆర్ఎస్ కనిష్ఠానికీ పడిపోవచ్చు. ఎవరూ పట్టించుకోకుండా ఉన్న కాంగ్రెస్ ఓ పదీఇరవై స్థానాలతో కొత్త ఆశలు పొందవచ్చు. మేయర్ బిజెపికి వస్తే గిస్తే, టిఆర్ఎస్ నుంచి బిజెపికి ప్రవాహం మొదలుకావచ్చు, ఆపైన ప్రభుత్వమే పడిపోవచ్చు. లేదంటే కాదంటే, టిఆర్ఎస్‌కే మునుపటి సీట్లే వస్తే, దుబ్బాక దెబ్బకు కట్టు కట్టుకోవచ్చు. పాలనలో లోటులేదని దబాయించవచ్చు. ఇవాళ సాయంత్రం ఎగ్జిట్ పోల్సు రేపు ఫలితాలు పెట్టుకుని, ఈ ఊహలన్నీ చేయడం అనవసరం. ఖచ్చితంగా చెప్పగలిగేది ఏమిటంటే, బిజెపికి ఎంతో కొంత సంతోషం, టిఆర్‌ఎస్‌కు ఎంతో కొంత విచారం తప్పవు. 


మరి, కల్వకుంట్ల చంద్రశేఖరరావు విచారపడతారా? సాంకేతికంగా గెలుపు దక్కితే, అంతా సజావుగా ఉంది లెమ్మని సమాధానపడతారా? లేక, తప్పెక్కడ జరిగిందో తరచి చూసుకుంటారా? కాక, తనకు తగినన్ని ఓట్లు వేయని ఓటర్ల మీద కోపించి అజ్ఞాతంలోకి వెడతారా? ఓటమి ఎదురయిన సందర్భాలలో గతంలో ఆయన వ్యవహరించిన తీరు కొందరికయినా గుర్తుండి ఉంటుంది. పార్టీ శ్రేణులే వెళ్లి ఆయనను బుజ్జగించి, క్రియాశీలతలోకి తెచ్చిన ఉదంతాలున్నాయి. కెసిఆర్ విశిష్టమైన ప్రజానాయకుడు. ఆయనలో అనేక అద్భుతమైన, ప్రత్యేకమైన లక్షణాలున్నాయి. కెసిఆర్‌లోని వృత్తి రాజకీయవాది అవలక్షణాలను ఎవరైనా ప్రస్తావిస్తే, జయశంకర్ ఆయనలోని సామర్థ్యాన్ని, వాగ్ధాటిని, అంతకుమించి, ఉద్యమంతో స్థిరంగా కొనసాగడాన్ని సమాధానంగా చెప్పేవారు. ఆ ఉద్యమంతో కానీ, ఉద్యమశ్రేణులతో కానీ, అధికారంలోకి వచ్చాక ప్రజలతో కానీ కెసిఆర్‌కు ఉండే సంబంధం విచిత్రమైనది. ఆయన ఉద్యమాన్ని నడిపించడం కాక, ఉద్యమమే ఆయనను నడిపించింది. అనేక సందర్భాలలో, ఆయన నిశ్శబ్దంగా ఉండిపోయేవారు. అప్పుడు ఉద్యమమే ఆయన పక్షాన సందడి చేసేది. ఒక్కోసారి ఆయన పరిస్థితులు పెట్టిన పరీక్షకు తట్టుకోలేకపోయేవారు, ఉద్యమమే ఆయనను నిలబెట్టింది. తనని కాపాడుకోవడం ఉద్యమం విధి అని ఆయన అనుకునేవారు. అధికారంలోకి వచ్చాక కూడా, తన ప్రభుత్వాన్ని రక్షిస్తూ ఉండడం ప్రజల కర్తవ్యం అని ఆయన అనుకుంటూ వస్తున్నారేమో అనిపిస్తుంది. తనకు తోచిన, తాను కనిపెట్టిన సంక్షేమాలేవో ప్రజలకు ఆయన అందిస్తాడు. అవేమీ చిన్నగా ఉండవు. ఆయన చేయి పెద్దదే. వాటిని మహాప్రసాదంగా అంగీకరించి ఊరుకోక, అవి లేవు, ఇవి లేవు, అవి కావాలి, ఇవి కావాలి అంటే ఆయనకు కోపం వస్తుంది. ఆయన మాట్లాడతారు, ప్రజలు వినాలి. ఆయన దృష్టిలో సమానమైన పని విభజన అది. అట్లా కాక, ప్రజలు తాము కూడా మాట్లాడదామని చూస్తే ఆయన సహించరు. ప్రజలే కాదు, పార్టీలోని ప్రభుత్వంలోని ఆయన సహచరులు అందరూ కేవలం అనుచరులే, లేదంటే శ్రోతలు, ప్రేక్షకులే. అందువల్ల, నిర్ణయాలు పై నుంచి కిందికి ప్రసారం అవుతుంటాయి. అవసరాలు, ఆకాంక్షలు, కింది నుంచి పైకి వినపడవు. అందువల్లే అనేక సమస్యలు. దుబ్బాకలో పరాజయానికి, జిహెచ్ఎంసిలో రేపు ఎదురయ్యే ఏ ఫలితమైనా సరే దానికీ మూలం ఆలకింపు లేని పాలన. 


టిఆర్ఎస్ ప్రభుత్వం ఒకానొక రాజకీయ పార్టీ ప్రభుత్వం కాదు. ఒక ఉద్యమానికి నాయకత్వం వహించి, ఆ ఉద్యమం ఫలించగా ఏర్పడిన రాష్ట్రంలో అధికారానికి వచ్చిన ప్రభుత్వం. అందువల్ల, ప్రజలకు చాలా ఆశలుంటాయి. అతి చిన్న సమూహానికీ, అతి పెద్ద జనవర్గానికీ కూడా ప్రత్యేకమైన ఆకాంక్షలు ఉంటాయి. అంతే కాదు, అభివృద్ధి ఎట్లా జరపాలో ఆలోచనలూ ఉంటాయి. నైతికమయిన గీటురాళ్లూ, విలువల తూకపురాళ్లూ నిత్యం పహారా కాస్తుంటాయి. ప్రజల నుంచి సమస్య వచ్చినప్పుడల్లా ఉద్యమ ఉద్వేగాలను ఆసరా చేసుకోవడం, అవసరం తీరిపోగానే ఫక్తు రాజకీయ పార్టీ అనుకోవడం, అధికారపార్టీకి అలవాటు అయిపోయింది. 2018అసెంబ్లీ ఎన్నికల సమయంలో, ప్రజలలో ప్రభుత్వ వ్యతిరేకత గణనీయంగానే గూడుకట్టుకుని ఉన్నది. మహాకూటమిలో తెలుగుదేశం ఉనికి, కెసిఆర్‌కు ఆయుధమైంది. రాష్ట్రాన్ని రక్షించుకోవడం మీ చేతిలోనే ఉన్నది అంటూ ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. ఓటర్లలో అప్పుడొక సదసత్సంశయం. ఆ ఊగిసలాటలో తీవ్ర వ్యతిరేకులు సైతం అనుకూలురుగా మారిపోయారు. ఇప్పుడు జిహెచ్ఎంసి ఎన్నికల సమయంలో కూడా ప్రభుత్వ వ్యతిరేకులలోని బిజెపియేతర శ్రేణుల వారిని తనవైపు తిప్పుకోవడానికి హైదరాబాద్‌ను రక్షించుకోవడమనే పిలుపు కెసిఆర్ జారీచేశారు. అదొక రకమైన నైతికమయిన ఒత్తిడి. కానీ, ప్రభుత్వానికి వ్యతిరేకత వ్యక్తం కాకుండా ప్రజలు ఎంతకాలం కాపలా కాస్తారు? ప్రభుత్వాన్ని రక్షించుకోవడం ప్రజల బాధ్యత అనే భారం ఎంతకాలం? తమ ప్రజాస్వామికత ద్వారా, ప్రగతిశీలత ద్వారా, తన ప్రజాఅభివృద్ధి దృక్పథం ద్వారా ప్రభుత్వం తనను తాను రక్షించుకునే ప్రయత్నం ఎందుకు చేయదు? 


విషాదం ఏమిటంటే, ఈ సారి ఎన్నికల ప్రచారంలో కెసిఆర్ కానీ, టిఆర్ఎస్ కానీ తమను తాము తక్కువ ప్రమాదకారులుగా ప్రచారం చేసుకున్నారు తప్ప, అధిక అభివృద్ధి వాదులుగా ధ్వనించలేదు. బిజెపి గెలిస్తే హైదరాబాద్‌లో మత ఉద్రిక్తతల వాతావరణం ఏర్పడుతుంది కాబట్టి, శాంతియుత జీవనం చెదిరిపోతుంది కాబట్టి, మా మీద ఏమన్నా ఫిర్యాదులున్నా సరే, సహించి, మా కంటె పెద్ద ప్రమాదాన్ని నివారించండి- అని ప్రచారం చేయడంలో బలహీనత అర్థం కావడం లేదా? మా మీద వ్యతిరేకతను పక్కన బెట్టి, మమ్మల్ని గట్టెక్కించే భారం మీదే - అని ప్రజలను అర్థించడం కంటె, ప్రజలు స్వచ్ఛందంగా తమనే ఎంచుకునేట్టు ప్రవర్తనను మలచుకోవచ్చును కదా? కారణాలేవో నిర్దిష్టంగా చెప్పలేము కానీ, తెలంగాణ ప్రజలలో రాష్ట్ర ప్రభుత్వం మీద విముఖత పెరిగింది. అట్లాగని, అది మొత్తంగా నిరాకరించేంత పెద్దస్థాయిది కాకపోవచ్చు. కానీ, ఈ ప్రభుత్వానికి ఒక సందేశం వెళ్లాలి, ఒక దెబ్బ తగలాలి, తెలిసిరావాలి- అన్న పద్ధతిలో ప్రజలు ఆలోచిస్తున్నట్టు కనిపించింది. అట్లా అనిపించినప్పుడు, ఏదైనా ప్రత్యామ్నాయం కనిపిస్తే అటు ఆసక్తి కలగడం సహజమే కదా? బిజెపి ప్రవేశంతో హైదరాబాద్‌లో అశాంతి ప్రబలుతుంది అన్న అధికారపక్షం ఆరోపణకు అనుగుణంగానే బిజెపి కూడా అవాంఛనీయ, ద్వేష, నేరపూరిత వ్యాఖ్యలతో ఉద్రిక్తతకు కారణమయింది. నిజానికి, ఒక సాధారణ పార్టీ లాగా, అభివృద్ధి రాహిత్యం గురించో, అప్రజాస్వామిక పాలన గురించో మాత్రమే ప్రచారం చేపట్టి ఉంటే, ప్రజలు బిజెపిని సీరియస్‌గా తీసుకునేవారేమో? 


సాంకేతికంగా అధికారపక్షం చేతికే జిహెచ్‌ఎంసి వచ్చి, ఎవరో ఒకరిని ఉత్సవవిగ్రహంలా మేయర్‌ స్థానంలో కూర్చోబెట్టి, ఏ పాఠమూ నేర్చుకోకుండా వెనుకటి తీరునే పాలన కొనసాగిస్తే, ప్రభుత్వం గ్రాఫ్ వేగంగా పతనం అవుతుంది. ఇంకా నోముల నర్సింహయ్య అంత్యక్రియలు కూడా జరగకముందే, నాగార్జున సాగర్ ఉపఎన్నిక గురించి చర్చలు మొదలయ్యాయి. మళ్లీ అదొక పరీక్ష. ఎల్ బి స్టేడియం ప్రసంగంలోనే స్వరంలో భయం తప్ప బలం వినిపించలేదు. ఇప్పటికయినా చెప్పడం తగ్గించి, వినడం మొదలుపెట్టాలి. మొదట తమ మంత్రివర్గ సహచరులతో మాట్లాడడం మొదలుపెట్టాలి. తక్కువ ప్రమాదకారులం అన్నదాన్ని బిరుదుగా ధరించకుండా, సానుకూల విశేషణాలను సాధించుకునే ప్రయత్నం చేయాలి. పార్టీలోనూ, బయటా, ప్రభుత్వంలోనూ, సమాజంలోనూ మరోమాట అనడానికి, వినబడడానికి వీలులేని కట్టడి వాతావరణంలో, మరేదో బూచిని చూపిస్తే మాత్రం ప్రజలు ఎంతకాలం మభ్యపడతారు?


కె. శ్రీనివాస్

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.