బహుముఖ ప్రజ్ఞాశాలి

ABN , First Publish Date - 2022-04-30T07:03:09+05:30 IST

స్వాతంత్ర్య సమరయోధుడు, పత్రికా వ్యవస్థాపకుడు, నటుడు, గ్రంథాలయ ఉద్యమకారుడు, రాజకీయ నాయకుడు, ఆధ్యాత్మికవేత్త,

బహుముఖ ప్రజ్ఞాశాలి

స్వాతంత్ర్య సమరయోధుడు, పత్రికా వ్యవస్థాపకుడు, నటుడు, గ్రంథాలయ ఉద్యమకారుడు, రాజకీయ నాయకుడు, ఆధ్యాత్మికవేత్త, గాంధేయవాది, కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు. పామర్రు మండలం ఎలకుర్రు గ్రామంలో ఒక సామాన్య కుటుంబంలో 1867 మే ఒకటవ తేదీన జన్మించారు. ఆయన విద్యాభ్యాసం మచిలీపట్నంలో జరిగింది. హిందూ హైస్కూలులో చదివే రోజుల్లో నాటకాలు ఆడేవారు. స్త్రీ పాత్రలు ధరించేవారు. హరిశ్చంద్ర నాటకంలో చంద్రమతి, శ్రీకృష్ణ తులాభారంలో రుక్మిణి పాత్రలను ధరించారు. 1885లో జగ్గయ్యపేట, నందిగామల్లో నాటకాలు ఆడారు. విజయవాడలో దుర్గా కళామందిరాన్ని నిర్మించారు. తన స్వగ్రామమైన ఎలకుర్రులోని శివాలయం వద్ద స్వామివారి కళ్యాణోత్సవాల్లో రంగస్థల కళాకారుల ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఆ ఆనవాయితీ ఇప్పటికీ ఎలకుర్రు గ్రామంలో కొనసాగుతోంది. ఆంధ్రనాటక కళాపరిషత్‌ ద్వారా పలువురు కళాకారులను ప్రోత్సహించారు. కళారంగానికి ఈయన చేసిన సేవలను గుర్తించి 1935లో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది.


నాగేశ్వరరావు పంతులు 1892లో బొంబాయిలో విలియం అండ్‌ కోలో ఉద్యోగిగా చేరారు. ఆయన కార్యదక్షత, వ్యాపార కౌశలాన్ని గుర్తించిన యాజమాని తమ దేశానికి వెళ్తూ ఆ కంపెనీని నాగేశ్వరరావుకు ఇచ్చారు. దీన్ని అవకాశంగా మలచుకుని 1893లో అమృతాంజనం కనిపెట్టి లాభాలు గడించారు. సూరత్‌లో జరిగిన కాంగ్రెస్‌ మహాసభల సమయంలో వచ్చిన ఆలోచనతో బొంబాయిలో ఆంధ్రపత్రికను 1908లో వారపత్రికగా ప్రారంభించారు. ఆ తరువాత 1914లో ఈ పత్రికను దినపత్రికగా మార్చారు. భారతి మాసపత్రిక ద్వారా తెలుగు సాహిత్యానికి సేవలందించారు. 1926లో ఆంధ్రగ్రంథమాల సంస్థను నెలకొల్పి దాదాపు 120 గ్రంథాలను ప్రచురించారు. పలు తెలుగు నిఘంటువులను ముందుగా ఈ గ్రంథమాల నుంచే ప్రచురించారు. ఈయన చేసిన సేవలను గుర్తించి ఆంధ్రమహాసభ దేశోద్ధారక బిరుదునిచ్చి సత్కరించింది. కాంగ్రెస్‌ పార్టీ ప్రాంతీయ అధ్యక్షులుగా ఉన్న రోజుల్లో పలు స్వాతంత్య్ర ఉద్యమాల్లో పాల్గొన్నారు. టంగుటూరు ప్రకాశం పంతులుతో కలసి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. 1931లో ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించారు.


1929లో మచిలీపట్నం ఆంధ్ర జాతీయ కళాశాలకు గాంధీజీ వచ్చారు. తనకు వచ్చిన బహుమతులను వేలం వేశారు. అందులో అన్ని వస్తువులను నాగేశ్వరరావు పంతులు పాడి స్వాతంత్ర ఉద్యమానికి ఊతం ఇచ్చారు. ఆ సమయంలో నాగేశ్వరరావు పంతులుకు గాంధీజీ విశ్వదాత బిరుదునిచ్చి సత్కరించారు. ఆ తరువాత చిన్నాపురంలో ఉద్యమకారులు తయారుచేసిన ఉప్పును మచిలీపట్నం కోనేరు సెంటరులో వేలం వేశారు. గుప్పెడు ఉప్పును నవర్సు బంగారానికి పాడి ఉప్పు సత్యాగ్రహ ఉద్యమానికి ఊతం ఇచ్చారు. రాజకీయాల్లో, వ్యాపారంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న నాగేశ్వరరావు పంతులు నిరాడంబర జీవితం గడిపారు. మద్రాసులోని ఆయన నివాసం శ్రీబాగ్‌లో కోస్తా, రాయలసీమ నాయకుల మధ్య కుదిరిన ఒడంబడిక వల్ల ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు మార్గం ఏర్పడింది.


నాగేశ్వరరావు పంతులు ఎందరో పేద విద్యార్థుల చదువుకు, ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక సాయం అందించారు. ఎలకుర్రు గ్రామంలో నాగేశ్వరరావు నిర్మించిన దళిత కాలనీ ప్రారంభోత్సవ సమయంలో ఆయన దళితులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. అందుకు కొన్ని రోజులు అక్కడి బ్రాహ్మణులు ఆయనను దూరంగా పెట్టారు. 1938 ఏప్రిల్‌ 11న నాగేశ్వరరావు పంతులు లింగైక్యం చెందారు. ఆయన ఇంటిని, స్థలాన్ని మానసిక దివ్యాంగుల పాఠశాలకు ఇచ్చేశారు. ఇటీవల అక్కడ ఆయన పేరుతో ఎస్టీ కాలనీ కూడా నిర్మించారు. కాశీనాథుని నాగేశ్వరరావు పంతులును ప్రతి ఏడాదీ గుర్తు చేసుకుంటూ ఆయన పేరిట వివిధ రంగాలలోని ప్రముఖులకు ఆయన వంశీకులు విశ్వదాత అవార్డులు ప్రదానం చేస్తున్నారు. నాగేశ్వరరావు పంతులు ఆత్మవిశ్వాసం, పట్టుదల, దాతృత్వం, దక్షత నేటి తరానికి ఆదర్శం.


ముదిగొండ శాస్త్రి (జర్నలిస్టు)

(మే 1: కాశీనాథుని నాగేశ్వరరావు జయంతి)

Updated Date - 2022-04-30T07:03:09+05:30 IST