బహు పర్వ బహు వ్రత మాసం.. కార్తికం

ABN , First Publish Date - 2020-11-17T09:12:05+05:30 IST

ప్రాచీన భారతీయ ఆర్ష సంప్రదాయంలో భారతీయులనందరినీ శారీరకంగా, మానసికంగా, బౌద్ధికంగా, ఆధ్యాత్మికంగా, సామాజికంగా చైతన్యవంతుల్ని చేయడం కోసం సంవత్సరం పొడవునా ఎన్నో పండుగలను, వ్రతాలను

బహు పర్వ బహు వ్రత మాసం.. కార్తికం

ప్రాచీన భారతీయ ఆర్ష సంప్రదాయంలో భారతీయులనందరినీ శారీరకంగా, మానసికంగా, బౌద్ధికంగా, ఆధ్యాత్మికంగా, సామాజికంగా చైతన్యవంతుల్ని చేయడం కోసం సంవత్సరం పొడవునా ఎన్నో పండుగలను, వ్రతాలను రూపొందించి భావితరాలకు బహూకరించారు మన మహర్షులు. అందులో కార్తికం ఒక మహత్తరమైన మాసం. ఒక్కొక మాసంలో ఒక్కొక్క దేవతకు ప్రాధాన్యం ఉంది. అయితే కార్తికం బహు దేవతాత్మకం. శివ, కేశవ, శక్తి, గణేశ, దామోదర, సూర్యాది దేవతలను, ఆయా దేవతల ప్రతీకలైన అశ్వత్థ (రావి), వట (మర్రి), పాలాశ(మోదుగ) వృక్షాలను, తులసి, ధాత్రీ మొదలైన మొక్కలను, గోవును, ఆయా ప్రాంతాలలోని నదులను అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించుకో దగిన మాసంగా కార్తిక మాసాన్ని తీర్చి దిద్దారు. ‘‘కార్తికః ఖలు వై మాసః సర్వమాసేషు చోత్తమః’’ అన్నారు పెద్దలు. అంటే.. అన్ని మాసాలలో కార్తికం చాలా గొప్పది అని అర్థం. ఈ మాసంలో రోజూ ఒక పర్వ దినమూ, ఒక వ్రతమూ ఉండి నెల అంతా దైవీమయంగా ఉంటుంది. లోకంలో సకల దేవతల భక్తులకూ కోరిన కోరికలను నెరవేర్చే కల్పతరువై ప్రకాశిస్తోంది. 


ముందుగా పర్వదినాలను చూద్దాం. దీపావళి మరునాడు బలి చక్రవర్తి భూలోకానికి వచ్చి భూలోక దీప శోభను పర్యవేక్షించడానికి వచ్చే రోజు బలి పాడ్యమి. యముడు తన చెల్లెలు యమున ఇంటికి వచ్చి భోజనం చేసే యమ ద్వితీయ/భగినీహస్త భోజనం. నాగ జాతికి చెందిన జరత్కారువు తన కుమారుడైన ఆస్తీకుని ద్వారా జనమేజయుని సర్పయాగాన్ని నిలుపుజేయించిన సందర్భానికి గుర్తు అయిన నాగులచవితి,  సుబ్రహ్మణ్యేశ్వరుని కొలుచుకునే నాగ పంచమి, సుబ్రహ్మణ్యేశ్వరునికీ, దేవసేనకు కళ్యాణదినమైన స్కందషష్ఠి, శాకంబరీ దేవిని పూజించుకుని ఏడుగురు విప్రులకు భోజనం నివేదించే శాకసప్తమి, గోవును, గోపాలకృష్ణుని పూజించుకునే గోపాష్టమి, అక్షయనవమి, సార్వభౌమవ్రతం, ఆషాఢంలో నిదురకు ఉపక్రమించిన మహావిష్ణువు మేల్కొనే రోజు ప్రబోధనైకాదశి, సమస్త దేవతలూ క్షీరసాగరంలో రమా సమేతంగా విష్ణువును పూజించుకునే క్షీరాబ్ది ద్వాదశి, వైకుంఠ చతుర్దశి, శివకేశవులు ఇరువురికీ ప్రీతిపాత్రమైన కార్తిక పూర్ణిమ, అదే రోజున..  అకాల మృత్యువు నుంచి రక్షించే యమ దీపదానం, దేవదీపావళి అయిన త్రిపురోత్సవం, సూర్యుడు తులా రాశిలో ప్రవేశించే తులాసంక్రాంతి, స్త్రీలు మాత్రమే పూజించే గణేశ వ్రతం కరకచతుర్థి ఇలా ఎన్నో పర్వదినాలు.


ఇక కార్తికంలో వచ్చే వ్రతాల గురించి తెలుసుకునే ముందు అసలు వ్రతం అంటే ఏమిటో తెలుసుకోవాలి. నిత్య, నైమిత్తిక, కామ్యక.. అని, వ్రతాలు మూడు విధాలు. బ్రహ్మచారులు అనుసరించే బ్రహ్మచర్యవ్రతం, గృహస్థుల అగ్నిహోత్ర వ్రతం, నిత్య సత్య వ్రతం, అహింసా వ్రతం వంటివి నిత్య వ్రతాలు. వీటికి కథలేమీ ఉండవు. అలాగే ఆయా మాసములలో ఆయా తిథులను నిమిత్తంగా చేసుకొని ఆయా దేవతలకు చెందిన పూజలూ వ్రతాలే. ఉదాహరణకు.. శ్రీరామనవమి, శ్రీకృష్ణాష్టమి, వినాయక చవితి, వరలక్ష్మీ వ్రతం, దీపావళి లక్ష్మీపూజ వంటివి. ఇవి నైమిత్తిక వ్రతాలు. ఇక కామ్యక వ్రతాలు. ఏదో ఒక కోర్కెతో చేసే వ్రతాలు. వీటికి తప్పక కథలు ఉంటాయి. మనకు కార్తికంలో వచ్చే వ్రతాలు ఎక్కువగా శివకేశవ దేవతా ప్రధానమైనవి.


వీటిలో నైమిత్తికములూ, ఉన్నాయి. కామ్యములూ ఉన్నాయి. ముక్కంటిని భర్తగా పొందాలని తపస్సుచేసిన గౌరి.. శివుని ప్రసన్నం చేసుకొన్న రోజున జరిగే త్రిలోచన గౌరీవ్రతం, నందికేశుడు చిత్రాంగదుడనే గంధర్వునికి చెప్పిన కేదారేశ్వరవ్రతం, తులసిని, ధాత్రీ రూపమున ఉన్న సమస్త దేవతలను అనుగ్రహించిన దామోదరునికి చెందిన శ్రీతులసీ ధాత్రీసహిత దామోదర వ్రతం, ఉమాసహితశంకరులను పూజించుకునే శ్రీ శివ సోమవార వ్రతం, క్షీరాబ్ది ద్వాదశి వ్రతం, జ్వాలాతోరణం, అర్థనారీశ్వర వ్రతం, శుక్ల నవమి, దశమి, ఏకాదశి తిథులలో జరుపుకొనే విష్ణు త్రిరాత్ర వ్రతం.. ఇలా ఎన్నో ఉన్నాయి. మానవుల చతుర్విధ పురుషార్థాలను తీర్చి,  లోకకళ్యాణాన్ని సిద్ధింపజేసేవే. కనుక ఇటువంటి కార్తిక మాసాన్ని ఒక మహా వ్రతంగా స్వీకరించి నియమబద్ధమైన జీవితాన్ని గడపాలి.





                                                                                                  ఆచార్య రాణి సదాశివ మూర్తి

Updated Date - 2020-11-17T09:12:05+05:30 IST