నేతిని వెన్నగా చేసే గంగాధరుడు!

ABN , First Publish Date - 2020-11-06T05:30:00+05:30 IST

ప్రకృతి సంపదకూ, ఆధ్యాత్మిక వైభవానికే కాదు... అంతుచిక్కని అద్భుతాలకు నెలవుగా భక్తులు పరిగణించే చోటు కర్ణాటకలోని శివగంగ. సాహస క్రీడా ప్రియులను సైతం ఆకర్షిస్తున్న శివగంగ ఎన్నో విశేషాల సమాహారం.

నేతిని వెన్నగా చేసే గంగాధరుడు!

ప్రకృతి సంపదకూ, ఆధ్యాత్మిక వైభవానికే కాదు... అంతుచిక్కని అద్భుతాలకు నెలవుగా భక్తులు పరిగణించే చోటు కర్ణాటకలోని శివగంగ. సాహస క్రీడా ప్రియులను సైతం ఆకర్షిస్తున్న శివగంగ ఎన్నో విశేషాల సమాహారం.


కర్ణాటకలో ప్రసిద్ధ పుణ్య స్థలాల్లో ఒకటైన శివగంగ (శివగంగే)ను ‘దక్షిణ కాశీ’గా భక్తులు పిలుచుకుంటారు. సుమారు 2,640 అడుగుల ఎత్తయిన పర్వతం మీద పరమశివుడు కొలువైన క్షేత్రం ఇది. ఆ పర్వతం లింగాకారంలో ఉంటుంది. దాని సమీపంలోనే నీటి ఊట (గంగ) పారుతూ ఉంటుంది. అందుకే దీనికి ‘శివగంగ’ అనే పేరు వచ్చిందంటారు. కర్ణాటక రాజధాని బెంగళూరుకు సుమారు యాభై అయిదు కిలోమీటర్ల దూరంలో శివగంగ క్షేత్రం ఉంది. తూర్పు నుంచి నందిలా, పశ్చిమం నుంచి వినాయకుడిలా, ఉత్తరం నుంచి మహా సర్పంలా, దక్షిణం నుంచి శివలింగంలా కనిపించడం ఈ పర్వతం విశిష్టతగా చెబుతారు. ఈ పర్వతంపై గంగాధరేశ్వర స్వామి వేల ఏళ్ళ క్రితం స్వయంభువుగా ఆవిర్భవించాడని స్థలపురాణం పేర్కొంటోంది. పార్వతీదేవి హొన్నమ్మాదేవిగా దర్శనమిస్తుంది. గంగాధరేశ్వరస్వామికి నేతితో అభిషేకం చేస్తారు.


శివలింగం మీద ఆ నెయ్యి పడగానే వెన్నగా మారిపోవడం కనిపిస్తుంది. సుమారు పదహారువందల ఏళ్ళుగా ఇలా జరుగుతోందనీ, ఈ మర్మాన్ని ఎవరూ కనుక్కోలేకపోయారనీ ఆలయ వర్గాల కథనం. వెన్నగా మారిన నెయ్యిలో ఓషధీ గుణాలు ఉంటాయనీ, దాన్ని సేవించడం వల్ల మొండి వ్యాధులు సైతం నయమవుతాయనీ భక్తుల నమ్మకం. అలాగే గంగాధరేశ్వరుడి గర్భగుడి లోంచీ సుమారు యాభై కిలోమీటర్ల దూరంలో... బెంగళూరు సమీపంలో ఉన్న గవి గంగాధరేశ్వర స్వామి ఆలయానికి రహస్య మార్గం ఉందన్న ప్రచారం ఉంది.. ప్రతి ఏటా మకర సంక్రాంతికి గంగాధరేశ్వరుడూ, హొన్నమ్మదేవిల కల్యాణం నిర్వహిస్తారు. ఆ సమయంలో కొండ మీద ఉండే రాతి నుంచీ వచ్చే పవిత్ర జలాన్ని వివాహ కార్యక్రమాల కోసం వినియోగిస్తారు. కుముద్వతి నది జన్మస్థలం శివగంగ పర్వతాలే!  ఇక్కడ భక్తులు స్నానాలు ఆచరించడానికి పవిత్రమైన తీర్థాలు ఎన్నో ఉన్నాయి. అలాగే శారదాంబ ఆలయం, నందీశ్వరుడి విగ్రహం తప్పక దర్శించాల్సిన ప్రదేశాలు. ప్రతి ఏటా మకర సంక్రాంతి రోజు సాయంత్రం నందీశ్వరుడి కొమ్ముల మధ్య నుంచీ సూర్యకాంతి నేరుగా శివ లింగాన్ని తాకుతుంది. ఆలయ నిర్మాణ కౌశలానికి దీన్ని ఒక నిదర్శనంగా భావిస్తారు. ఈ ఆలయంలో పెట్టే దీపం తప్ప విద్యుద్దీపాలు ఉండవు. ట్రెక్కింగ్‌ లాంటి సాహస క్రీడల కోసం కూడా ఎంతోమంది శివగంగకు వస్తూ ఉంటారు.

Updated Date - 2020-11-06T05:30:00+05:30 IST