పల్లాను గెలిపించుకుని కేసీఆర్‌కు కానుకగా ఇద్దాం

ABN , First Publish Date - 2021-03-04T05:25:00+05:30 IST

పల్లాను గెలిపించుకుని కేసీఆర్‌కు కానుకగా ఇద్దాం

పల్లాను గెలిపించుకుని కేసీఆర్‌కు కానుకగా ఇద్దాం
మాట్లాడుతున్న కడియం శ్రీహరి

స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ నేతలు

కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి

హన్మకొండ టౌన్‌, మార్చి 3: స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో చాలా మంది పార్టీ నేతలు, కార్యకర్తలు అవమానాలకు గురవుతున్నారని, అయినా సరే అవమానాలు దిగమింగి కేసీఆర్‌ ఆదేశాలు శిరసావహిద్దామని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి సూచించారు. హన్మకొండలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గ నేతలు, కార్యకర్తల సమావేశం కడియం ఆధ్వర్యంలో బుధవారం జరిగింది. సమావేశ ప్రారంభంలో రైతు సమన్వయ సమితి సభ్యుడు రాంబాబు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో తమకు ప్రాధాన్యత లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న మొన్న రాజకీయాల్లోకి వచ్చిన వారికి ఇచ్చిన ప్రాధాన్యత తమకు ఉండడం లేదన్నారు. 

దీంతో  కడియం మాట్లాడుతూ.. అవమానాలు తనకు, తనను నమ్ముకున్న వారికి కొత్తేమీ కాదన్నారు. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నియోజకవర్గ ప్రజలను కంటికీ రెప్పలా కాపాడుకుంటానని పేర్కొన్నారు. కేసీఆర్‌ ఆశీస్సులతో తాను ఉప ముఖ్యమంత్రి అయ్యానని, ఆయన సైన్యంలో తాను, రాజయ్య, పల్లా సైనికులమేనన్నారు. కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాజయ్యను గెలిపించుకున్నామని తెలిపారు. నియోజకవర్గంలో ప్రజలు ఊహించినట్లు జరగలేదన్నారు. ప్రస్తుతం క్యాడర్‌లో అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోందన్నారు. విభేదాలు పక్కన పెట్టి, అవమానాలు దిగమింగి, అవసరమైతే ఒక మెట్టు దిగి అయినా పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలిపించుకుని కేసీఆర్‌కు కానుకగా ఇద్దామని కడియం  పిలుపునిచ్చారు.  

ముక్కు నేలకు రాస్తా: పల్లా

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం లక్షా30వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు తాను చెప్పిన లెక్కలు తప్పని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని, నిరూపించకుంటే కోదండరామ్‌ రాస్తాడా అని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి సవాల్‌ విసిరారు. ఎమ్మెల్సీ బరిలో నిలిచిన కోదండరామ్‌ ఓట్ల కోసం అబద్దపు ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు. కోదండరామ్‌ను జేఏసీ చైర్మన్‌ చేసిందే కేసీఆర్‌ అని పేర్కొన్నారు. ఈ సమావేశానికి వేలేరు జడ్పీటీసీ చాడ సరిత మినహా జడ్పీటీసీలు, ఎంపీపీలు ఎవరూ హాజరు కాలేదు.

Updated Date - 2021-03-04T05:25:00+05:30 IST