Advertisement
Advertisement
Abn logo
Advertisement

కాదేదీ జీఎస్టీకి అనర్హం!

వస్తుసేవల పన్ను (జీఎస్టీ) నుంచి అంతిమంగా ఏ వస్తువుకు, ఏ సేవకు, బహుశా మినహాయింపు ఉండదేమో?! పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకు వచ్చే ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్టు ఆర్బీఐ (రిజర్వ్బ్యాంక్ ఆఫ్ ఇండియా) గవర్నర్ శశికాంత్ దాస్ వెల్లడించారు. దీనివల్ల ప్రభుత్వం తొలుత ఆదాయాన్ని కోల్పోవలసివచ్చినప్పటికీ దీర్ఘకాలంలో అమితంగా లబ్ధి పొందగలుగుతుందని ఆయన ఉద్ఘాటించారు. పెట్రోలియం ఉత్పత్తులపై జీఎస్టీ విధించడం వల్ల ప్రభుత్వానికి తొలి దశలో లక్ష కోట్ల రూపాయల మేరకు ఆదాయ నష్టం సంభవించవచ్చని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక ఒకటి అంచనా వేసింది. మరి ఈ లక్ష కోట్ల రూపాయల ఆదాయ నష్టాన్ని ఎక్కడ నుంచి, ఎలా భర్తీ చేస్తారు? వస్త్రాలు, కాగితాలు, బైక్‌లు, ఇతర వస్తువులపై విధించే పన్నుల నుంచి ఆ మొత్తాన్ని సమకూర్చుకుంటారు. మరింత స్పష్టంగా చెప్పాలంటే పెట్రోలియం ఉత్పత్తులను జీ ఎస్టీ పరిధిలోకి తీసుకురావడమనేది పన్నుల తగ్గింపునకు దారితీయదు. పెట్రోలియం ఉత్పత్తుల నుంచి ఇతర వస్తువులకు మాత్రమే పన్నులను మార్చడం సంభవిస్తుంది. ఇది అనివార్యం కూడా. 


మనం వినియోగించుకుంటున్న చమురులో 85 శాతాన్ని దిగుమతి చేసుకుంటున్నామనేది మనం విస్మరించలేని, విస్మరించరాని వాస్తవం. చమురుపై పన్ను తగ్గింపు వల్ల దాని ధర తగ్గుతుంది. ధర తగ్గుదలతో వినియోగం పెరుగుతుంది. అనివార్యంగా చమురు దిగుమతులూ పెరుగుతాయి. ఇది అంతిమంగా మన ఆర్థిక సార్వభౌమత్వానికి ఒక సవాల్ గా పరిణమిస్తుంది. చమురు వినియోగాన్ని పెంచుకోవడానికి బదులుగా తగ్గించుకోవల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనివల్ల చమురు దిగుమతులపై మనం తక్కువగా ఆధారపడతాము. పెట్రోలియం ఉత్పత్తులను జీ ఎస్టీ పరిధిలోకి తీసుకురావడం ద్వారా వాటిపై పన్ను తగ్గింపు పూర్తిగా వ్యతిరిక్త పరిస్థితులకు దారితీస్తుంది. మనం మరింతగా చమురు దిగుమతులపై ఆధారపడడం అనివార్యమవుతుంది. 


ప్రస్తావిత అంశాల నేపథ్యంలో పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన ఒక కీలక ప్రకటనను మనం అర్థం చేసుకోవలసి ఉంది. పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం వల్ల చమురు రంగం ఇతోధిక అభివృద్ధికి దోహదం జరుగుతుందని ఆయన ప్రకటించారు. 


సౌర ఫలకాలను ప్రతిష్ఠాపితం చేసుకోవడం కంటే ఒక డీజిల్ జనరేటర్‌ను ఏర్పాటు చేసుకోవడమే లాభదాయకమని పారిశ్రామిక వేత్తలు భావించే అవకాశం ఉంది. మరి మనం చమురు రంగం అభివృద్ధిని కోరుకొంటున్నామా? లేక సౌరశక్తి రంగం పురోగతిని అభిలషిస్తున్నామా? ఇదీ ఇప్పుడు మన ముందున్న ప్రశ్న.ఇంతకు ముందే చెప్పినట్టు చమురు వినియోగం పెరుగుదల ప్రతికూల ఫలితాలకు దారితీస్తుంది. మార్గాంతరమేమిటి? చమురు వినియోగం నాణ్యతను మెరుగుపరచుకోవడమే. సౌరశక్తి, పవన విద్యుత్తు మొదలైన ప్రత్యామ్నాయ ఇంధన వనరులకు ఆస్కారం లేని చోట్ల పెట్రోలియం ఉత్పత్తులను వినియోగించుకోవడం ఒక ఉపయుక్త పరిష్కారం. 


ఇక్కడ ఒక స్వీయానుభవాన్ని చెబుతాను. 1980 దశకంలో మా ఇంటిలో ఏర్పాటు చేసుకునేందుకు ఒక చిన్న 500వాట్ పెట్రోల్ జనరేటర్‌ను కొనుగోలు చేశాను. అప్పట్లో సౌర ఫలకాలు చాలా హెచ్చు రేట్లలో మాత్రమే లభ్యమయ్యేవి. గృహావసరాలకు వాటినేర్పాటు చేసుకోవడమనేది లాభసాటి ప్రత్యామ్నాయం కాదు. అయితే ఇప్పుడు మా ఇంటిలో పెట్రోల్ జనరేటర్ స్థానంలో ఒక 240 వాట్ సౌర ఫలకాన్ని ఏర్పాటు చేసుకున్నాను. అప్పటికీ ఇప్పటికీ సౌర ఫలకాల ధర గణనీయంగా తగ్గగా పెట్రోల్ ధర భారీగా పెరిగింది మరి. ఇదే విధంగా పెట్రోల్ ధర మరింతగా పెరిగితే పట్టణాలు, నగరాలలోని ప్రయాణికులు పెట్రోల్‌తో నడిచే ప్రైవేట్ వాహనాలపై కాకుండా విద్యుత్‌తో నడిచే మెట్రోలపై ఆధారపడతారు. పెట్రోలియం ఉత్పత్తులను ప్రజల ప్రయాణాలకు, సుదూర ప్రాంతాలకు సరుకుల రవాణాకు మాత్రమే ఉపయోగించుకోవడం అన్ని విధాల శ్రేయస్కరం. ఈ రవాణా కార్యకలాపాలను సౌర శక్తి, పవన విద్యుత్ మొదలైన ప్రత్యామ్నాయ ఇంధన వనరులతో నిర్వహించడమనేది అసాధ్యం. 


పెట్రోలియం ఉత్పత్తులను వస్తుసేవల పన్ను పరిధిలోకి తీసుకురావడం వల్ల తక్షణ పర్యవసానమేమిటి? దేశవ్యాప్తంగా పెట్రోల్ మొదలైన వాటికి ఒకే ధర వసూలు చేస్తారు. పారిశ్రామిక వేత్తలు ఒక ఫ్యాక్టరీని నెలకొల్పడంపై నిర్ణయం తీసుకోవడంలో చమురు ధరను పరిగణనలోకి తీసుకోవల్సిన అవసరం ఉండదు. దీనివల్ల పారిశ్రామిక వేత్తలు తమ వనరులను ఇంకా ఇతర కార్యకలాపాలకు మరింత సమర్థంగా, ప్రయోజనకరంగా కేటాయించేందుకు వెసులుబాటు లభిస్తుంది. అయితే అదే సమయంలో పెట్రోలియం ఉత్పత్తులపై వసూలు చేయవలసిన వ్యాట్ (వ్యాల్యూ యాడెడ్ ట్యాక్స్- వస్తుసేవల ధరకు అదనంగా కలిపే పన్ను)పు నిర్ణయించడంలో రాష్ట్రాలకు గల స్వతంత్ర ప్రతిపత్తిని తొలగిస్తుంది. 


ఈ పరిణామాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సహజంగానే సుతరామూ అంగీకరించవు. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలు అధిక రేట్లతో పన్నులు వసూలు చేస్తున్నాయి. తద్వారా లభించే ఆదాయాన్ని అడవుల సంరక్షణ, నీటి పారుదల వసతుల అభివృద్ధి, టీకాలు వేయడం లేదా శాంతి భద్రతలను మరింత పటిష్ఠంగా నిర్వహించడం మొదలైన ప్రజా శ్రేయో కార్యకలాపాలకు వినియోగిస్తున్నాయి. మరి కొన్ని రాష్ట్రాలు పెట్రోలియం ఉత్పత్తులపై వసూలు చేస్తున్న వ్యాట్ రేట్ స్వల్ప స్థాయిలో మాత్రమే ఉంటోంది. కారణమేమిటి? వ్యాట్ రేట్, చమురు ధరలు స్వల్ప స్థాయిలో ఉండడం వల్ల తమ రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పేందుకు పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహకరంగా ఉంటుందని పలు రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ప్రజలకు సైతం మంచి ఆదాయం సమకూరుతుందని, జీవన ప్రమాణాలు మెరుగుపడతాయనేది రాష్ట్ర పాలకుల ఆశాభావం. వ్యాట్‌ను అటు హెచ్చు స్థాయిలో, ఇటు స్వల్ప స్థాయిలో వసూలు చేసే విధానాలు రెండూ సమర్థనీయమే. 


అధిక పన్నులతో సమకూరే అధికాదాయం, ప్రజా సదుపాయాల పై భారీ వ్యయాలు ప్రజా సంక్షేమానికి విశేషంగా దోహదం చేస్తాయి. అలాగే తక్కువ పన్నులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వేత్తలను మరింతగా ప్రోత్సహించడం కూడా జనక్షేమానికి తోడ్పడుతాయి. అయితే పన్నుల రాబడిని సమర్థంగా వినియోగించే రాష్ట్రాల ప్రజలు అధిక వ్యాట్ వసూలుతో విశేషంగా లబ్ధి పొందుతారు; రాబడిని దుబారా చేసే రాష్ట్రాల ప్రజలు అధిక వ్యాట్ మూలంగా నష్టపోతారు. వ్యాట్ విషయంలో స్వతంత్ర ప్రతిపత్తి రాబడిని సమర్థంగా వ్యయపరిచేందుకు రాష్ట్రాలకు ఒక ప్రోత్సాహకంగా ఉంది. అధిక వ్యయాల మూలంగా మీరు పలు ప్రయోజనాలను పొందగలుగుతారని పన్ను చెల్లింపుదారులకు రాష్ట్ర ప్రభుత్వం చెప్పగలుగుతుంది. ఈ విధంగా వ్యాట్ స్వత్రంత్ర ప్రతిపత్తి, ఆదాయాన్ని సమర్థంగా వినియోగించేందుకు రాష్ట్రా ప్రభుత్వాలను కచ్చితంగా పురిగొల్పుతుందనడంలో సందేహం లేదు.

భరత్ ఝున్‌ఝున్‌వాలా

(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)

Advertisement
Advertisement

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే మరిన్ని...