జస్టిస్‌ జాస్తి ఈశ్వర ప్రసాద్‌ కన్నుమూత

ABN , First Publish Date - 2021-07-07T08:16:34+05:30 IST

హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి ఈశ్వర ప్రసాద్‌(87) మంగళవారం గుండెపోటుతో జూబ్లీహిల్స్‌లోని స్వగృహంలో కన్నుమూశారు. ఆయన మద్రాసు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్‌, ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు.

జస్టిస్‌ జాస్తి ఈశ్వర ప్రసాద్‌ కన్నుమూత

ఏపీ, కర్ణాటక హైకోర్టుల్లో జడ్జిగా బాధ్యతలు

ల్యాండ్‌ గ్రాబింగ్‌ కోర్టు చైర్మన్‌గా విధులు

సత్యసాయి సేవా సంస్థ కార్యదర్శిగా సేవలు

నేడు జూబ్లీహిల్స్‌లో అంత్యక్రియలు


బంజారాహిల్స్‌, జూలై 6 (ఆంధ్రజ్యోతి): హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి ఈశ్వర ప్రసాద్‌(87) మంగళవారం గుండెపోటుతో జూబ్లీహిల్స్‌లోని స్వగృహంలో కన్నుమూశారు. ఆయన మద్రాసు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్‌, ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. 1959లో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయవాదిగా ప్రాక్టిస్‌ ప్రారంభించారు. హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో పలు కీలక కేసులను వాదించారు. వాటిల్లో కోర్టులు పలు చరిత్రాత్మక తీర్పులు ఇచ్చాయి. 31 సంవత్సరాల న్యాయవాద వృత్తి తర్వాత.. 1990లో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. 1994లో కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యి.. 1996లో పదవీ విరమణ పొందారు. 1997లో ఏపీ ప్రభుత్వం పరిచయం చేసిన.. భూ ఆక్రమణల నిరోధక ప్రత్యేక కోర్టుకు చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.


అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పిలుపు మేరకు.. నేషనల్‌ ట్రైబ్యునల్‌ చైర్మన్‌గా పనిచేశారు. ఆ తర్వాత కూడా పలు ట్రైబ్యునళ్లలో సేవలందించారు. 23 ఏళ్ల పాటు సత్యసాయి సేవా సంస్థకు కార్యదర్శిగా పనిచేశారు. తన తల్లి జాస్తి సీతామహాలక్ష్మి పేరిట ఓ స్మారక ట్రస్టును స్థాపించి, పేదల అభ్యున్నతికి పాటుపడ్డారు. అప్పటి ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి, ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ తదితరులు ఆయన పనితీరును మెచ్చుకునేవారు. జస్టిస్‌ ఈశ్వర ప్రసాద్‌ తండ్రి జాస్తి సాంబశివరాలు జిల్లా, సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తిగా వ్యవహరించారు. ఆయన తల్లి జాస్తి సీతామహాలక్ష్మీ న్యాయవాదిగా, సామాజికవేత్త పనిచేశారు. జస్టిస్‌ ఈశ్వర ప్రసాద్‌ భార్య జాస్తి చామంతి కూడా న్యాయవాదిగా పనిచేశారు. 1990లో ఆయన హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించాక.. ఆమె ప్రాక్టిస్‌ను నిలిపివేశారు. ఢిల్లీలోని ఆంధ్ర వనితామండలికి అధ్యక్షురాలిగా సమాజ సేవలో పాలుపంచుకున్నారు. కాగా.. జస్టిస్‌ ఈశ్వరప్రసాద్‌ అంత్యక్రియలు బుధవారం జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. జస్టిస్‌ ఈశ్వరప్రసాద్‌ మృతిపట్ల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

Updated Date - 2021-07-07T08:16:34+05:30 IST