ఇషా హ్యాట్రిక్‌

ABN , First Publish Date - 2022-05-18T09:26:24+05:30 IST

జూనియర్‌ వరల్డ్‌ కప్‌ షూటింగ్‌లో హైదరాబాద్‌ అమ్మాయి ఇషా సింగ్‌ జోరు కొనసాగుతోంది. టోర్నమెంట్‌లో వరుసగా మూడో స్వర్ణంతో హ్యాట్రిక్‌ కొట్టింది. జర్మనీలో మంగళవారం జరిగిన 25 మీటర్ల

ఇషా హ్యాట్రిక్‌

జూనియర్‌ వరల్డ్‌కప్‌లో మూడో స్వర్ణం కైవసం

25 మీటర్ల పిస్టల్‌ టీమ్‌ ఈవెంట్‌లో జయకేతనం


న్యూఢిల్లీ: జూనియర్‌ వరల్డ్‌ కప్‌ షూటింగ్‌లో హైదరాబాద్‌ అమ్మాయి ఇషా సింగ్‌ జోరు కొనసాగుతోంది. టోర్నమెంట్‌లో వరుసగా మూడో స్వర్ణంతో హ్యాట్రిక్‌ కొట్టింది. జర్మనీలో మంగళవారం జరిగిన 25 మీటర్ల పిస్టల్‌ టీమ్‌ ఈవెంట్‌లో ఇషా సింగ్‌, మనూ భాకర్‌, రిథమ్‌ సాంగ్వాన్‌తో కూడిన భారత త్రయం చాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో ఇషా బృందం 16-2 స్కోరు తేడాతో ఆతిథ్య జర్మనీని చిత్తుచేసి పసిడి పతకాన్ని దక్కించుకుంది. ఇక, 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్స్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో భారత జోడీ పంకజ్‌ ముఖేజా-సిఫ్త్‌ కౌర్‌ సమ్రా ఫైనల్లో ఓటమిపాలై రజత పతకం అందుకుంది. పోలెండ్‌ ద్వయం మైకేల్‌-జూలియా 16-12 స్కోరు తేడాతో పంకజ్‌-కౌర్‌ జంటపై గెలిచి స్వర్ణం సాధించింది.




దీంతో భారత్‌ ఈ టోర్నమెంట్‌లో ఇప్పటిదాకా 11 స్వర్ణాలు, 13 రజతాలు, 4 కాంస్యాలతో కలిపి 28 పతకాలతో పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇటలీ 4 స్వర్ణాలు, 4 కాంస్యాలతో రెండోస్థానంలో ఉంది. కాగా.. 17 ఏళ్ల ఇషా సింగ్‌కు ఈ టోర్నీలో ఇది మూడో పసిడి పతకం కావడం విశేషం. అంతకుముందు మనూ భాకర్‌, పాలక్‌తో కలిసి 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ టీమ్‌ ఈవెంట్‌, సౌరభ్‌ చౌదరి జతగా మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్లలో ఇషా సింగ్‌ స్వర్ణాలు నెగ్గిన సంగతి తెలిసిందే. 

Updated Date - 2022-05-18T09:26:24+05:30 IST